Skip to main content

యువత కెరీర్‌కు సరికొత్త వేదిక..ఫిన్‌టెక్ జాబ్స్

డిజిటల్ ప్రపంచం.. ఆన్‌లైన్ కార్యకలాపాలు.. ఇప్పుడు ఎక్కడ, ఏ రంగంలో చూసినా ఇదే పరిస్థితి! కోర్ సెక్టార్స్ నుంచి సేవల రంగం వరకు.. అధిక శాతం కార్యకలాపాలు ఆన్‌లైన్‌లోనే!! అత్యంత కీలక రంగంగా భావించే.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్‌లో..డిజిటల్ కార్యకలాపాల వేగం మరింత పెరిగింది. ఫలితంగా కొత్తగా పుట్టుకొస్తున్న ఫిన్‌టెక్(ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలు)! ఇవే ఇప్పుడు యువత కెరీర్‌కు చక్కటి వేదికలుగా నిలుస్తూ.. ఉపాధి అవకాశాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో... ఫిన్‌టెక్ సంస్థల తీరుతెన్నులు, ఉద్యోగావకాశాలపై ప్రత్యేక కథనం...
బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో నూటికి ఎనభై శాతం డాక్యుమెంటేషన్ ఆన్‌లైన్‌లోనే జరుగు తోంది. ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్, మొబైల్ యాప్స్ రాకతో ఇది మరింత ఎక్కువైంది. ఇవే ఇప్పుడు ఫిన్‌టెక్ సంస్థల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తోంది. ఫలితంగా ఫిన్‌టెక్ విభాగంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. స్మార్ట్ ఫోన్స్, డిజిటల్ విప్లవం కారణంగా ఫైనాన్షియల్ రంగంలో వినియోగదారులకు పలు రకాల సేవలు అరచేతిలోనే అందుతున్నాయి. ఉదాహరణకు.. బిల్ పేమెంట్స్‌నే పరిగణనలోకి తీసుకుంటే.. ఒక్క క్లిక్‌తోనే పని పూర్తయ్యేలా టెక్నాలజీ అందుబాటు లోకి వచ్చింది. ఇదంతా ఫైనాన్షియల్ టెక్నాలజీ ద్వారానే సాధ్యమవుతోంది! అందుకే ఫిన్‌టెక్ సంస్థల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఒక్క మాటలో చెప్పా లంటే.. మొబైల్ వ్యాలెట్స్, పీర్ టు పీర్ ఆన్‌లైన్ లెండింగ్ వంటివన్నీ ఫిన్‌టెక్ కోవకు చెందినవే.

ఫిన్‌టెక్.. తీరుతెన్నులు
ఫిన్‌టెక్‌లను ఎన్‌బీఎఫ్‌సీ(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్) సంస్థలుగా పేర్కొనొచ్చు. కారణం.. ఇవి బ్యాంకింగ్ తరహా సేవలు అందిస్తుం డటమే. అది కూడా పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో! ఒకప్పుడు రుణానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. పేజీల కొద్దీ డాక్యుమెంట్లు, సంతకాలు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫిన్‌టెక్ సంస్థల టెక్నాలజీతో సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. మన వివరాలు పొందుపరిస్తే చాలు.. క్షణాల్లో మన క్రెడిట్ హిస్టరీ, ఇప్పటికే ఉన్న రుణాలు తదితర వివరాలన్నీ తెలుసుకునే వీలుంది. దాని ఆధారంగా మన రుణ దరఖాస్తు నిమిషాల్లో పరిష్కారమవుతుంది. ఒకవేళ మన క్రెడిట్ హిస్టరీ బాగుండి, మన దరఖాస్తుకు ఆమోదం లభిస్తే.. తక్షణమే అకౌంట్‌లో రుణ మొత్తం జమ అవుతోంది. ఫిన్‌టెక్ సంస్థల్లో అన్ని రకాల సదుపాయాలు ఒకే విండోలో లభిస్తున్నాయి. ఫిన్‌టెక్ సంస్థలు కేవలం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలకే పరిమితం కావడం కాలేదు. ఇన్సూరెన్స్, పేమెంట్స్, అసెట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ విభాగాలకూ విస్తరిస్తున్నాయి.

దాదాపు 200 ఫిన్‌టెక్ సంస్థలు..
ఫైనాన్స్ సేవలు, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్, లోన్ అప్రూవల్స్, బీమా ప్రీమియం చెల్లింపులు, ఈ-కామర్స్ లావాదేవీలు వంటివన్నీ స్మార్ట్‌ఫోన్ ద్వారా జరిగేలా ఫైనాన్షియల్ టెక్నాలజీ అందుబా టులోకి వచ్చింది. దీంతో పట్టణ ప్రాంతాల్లో వీటికి ఆదరణ బాగా పెరుగుతోంది. ఈ ఆదరణే ఫిన్‌టెక్ సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరించడానికి, అదే సమయంలో కొత్తగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి దోహదపడుతోంది. సీఐఐ, నాస్‌కామ్ తదితర సంస్థల అంచనాల ప్రకారం- ప్రస్తుతం దేశంలో ఫిన్‌టెక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల సంఖ్య దాదాపు 200.

ఫిన్‌టెక్ స్టార్టప్స్ :
ఫిన్‌టెక్ విభాగంలో స్టార్టప్ సంస్థల సంఖ్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఇవి పీటుపీ లెండింగ్ విధానంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటి లోనూ వేల సంఖ్యలో అవకాశాలు లభిస్తున్నాయి. రూ.కోటి నుంచి రూ.పది కోట్ల మూలధనం పెట్టుబడితో ఫిన్‌టెక్ స్టార్టప్ సంస్థలు ప్రారంభమ వుతున్నాయి. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంటున్నాయి.

బ్లాక్‌చైన్ ప్రొఫెషనల్స్ హవా..
బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఆన్‌లైన్ కార్యకలా పాలను పారదర్శకంగా, అవకతవకలు లేకుండా నిర్వహించగలిగే అవకాశముంది. దాంతో ఫిన్‌టెక్ సంస్థలు ఇటీవల కాలంలో బ్లాక్‌చైన్ టెక్నాలజీలో నైపుణ్యం పొందిన వారిని నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. ప్రధానంగా బ్లాక్‌చైన్ ఆర్కి టెక్ట్, బ్లాక్‌చైన్ డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, బ్లాక్‌చైన్ క్వాలిటీ ఇంజనీర్, బ్లాక్‌చైన్ డిజైనర్, బ్లాక్‌చైన్ ఇంజనీర్ వంటి హోదాల్లో నియామకాలు చేపడుతు న్నాయి. వీరికి ప్రారంభంలోనే నెలకు సగటున రూ.40 వేల నుంచి రూ.50 వేల వేతనం లభిస్తోంది.

బ్లాక్ చైన్ ఆర్కిటెక్ట్ :
బ్లాక్‌చైన్ టెక్నాలజీ నిపుణులు ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్, డెవలప్‌మెంట్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అంతేకాకుండా టెక్నాల జీపై ఇతర విభాగాల్లోని సిబ్బందికి సైతం అవగాహ న కల్పించాల్సి ఉంటుంది. వీరికి ప్రారంభంలోనే రూ.50వేలకుపైగా వేతనం లభిస్తోంది. బ్లాక్‌చైన్ విభాగంలో కొలువులు సొంతం చేసుకోవాలంటే.. కోడింగ్, లాంగ్వేజ్ స్కిల్స్‌తోపాటు, న్యూరల్ నెట్‌వర్క్స్, నోడ్.జేఎస్, ఎస్‌ఓఏపీ, ఎంవైఎస్‌క్యూ ఎల్, జావా, హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్, పైథాన్, బిట్‌కాయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి నైపుణ్యాలు తప్పనిసరి.

నాన్-టెక్నికల్ ఉద్యోగాలు :
ఫిన్‌టెక్ సంస్థల్లో నాన్-టెక్నికల్ ఉద్యోగాలు సైతం అందుకునే వీలుంది. ప్రధానంగా కంటెంట్ రైటర్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, కాల్ సెంటర్ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ హోదాల్లో ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే ఇంగ్లిష్ నైపుణ్యం ఉండాలి.

భవిష్యత్తు ఆశాజనకంగా..
మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు కొలువుల పరంగా నూతన వేదికలు ఫిన్‌టెక్ సంస్థలు అని చెప్పొచ్చు. భవిష్యత్తులోనూ ఫిన్‌టెక్ అవకాశాల జోరు కొనసాగనుంది. ఏటేటా ఫిన్‌టెక్ సంస్థలు విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. నాస్‌కామ్ అంచనా ప్రకారం-2018లో కార్యకలా పాలు భారీగా పెరిగాయి. ఇదే ధోరణి భవిష్యత్తు లోనూ కొనసాగనుంది. దీనికి అనుగుణంగానే ఉద్యోగాలు కూడా లభించనున్నాయి.

ఉద్యోగ సాధనకు మార్గాలు..
ఫిన్‌టెక్ సంస్థల్లో కొలువు దీరే మార్గం ఏంటనే సందేహం తలెత్తడం సహజం. ప్రస్తుతం అధిక శాతం సంస్థలు జాబ్ పోర్టల్స్ ఆధారంగా తమకు సరితూగే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. పేటీఎం, ఫోన్ పే వంటి భారీ స్థాయి సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ల ద్వారా నియామకాలు చేపడుతున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు జాబ్ పోర్టల్స్‌లో తమ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఫిన్‌టెక్ సంస్థల్లో అడుగుపెట్టొచ్చు.

ఈ నైపుణ్యాలు తప్పనిసరి :
ఫిన్‌టెక్ సంస్థల్లో ఉద్యోగాలు కోరుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా కొన్ని సాంకేతిక నైపుణ్యాలు కలిగుండాలి.
అవి...
  • ఐఓఎస్ డెవలప్ మెంట్
  • ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్
  • సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్(ఎస్‌ఆర్‌ఈ)
  • ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్ నాలెడ్జ్
  • అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఏపీఐ)
  • బ్లాక్ చైన్ టెక్నాలజీ, బకస్టమర్ ఎక్విజిషన్
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
  • బిగ్‌డేటా అనలిటిక్స్
  • అప్లికేషన్ డెవలప్‌మెంట్
  • పాజెక్ట్ మేనేజ్‌మెంట్
  • సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్
  • హార్డ్‌వేర్ నెట్‌వర్కింగ్.

వేల సంఖ్యలో కొలువులు :
ఎస్‌బ్యాంక్, నాస్‌కామ్, పీడబ్యూసీ తదితర సంస్థల అంచనాల ప్రకారం-2020 నాటికి ఫిన్‌టెక్ సంస్థల్లో అందుబాటులోకి రానున్న ఉద్యోగాల సంఖ్య సుమారు లక్ష. ఫిన్‌టెక్ సంస్థల్లో టెక్నికల్ ఉద్యోగాల సంఖ్యే అధికంగా ఉంటోంది. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా అప్లికేషన్స్, అనలిటిక్స్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, నెట్ వర్కింగ్ వంటి విభాగాల్లో భారీగా నియామకాలు జరుగుతున్నాయి. కోడింగ్, ప్రోగ్రామింగ్, డేటా మేనేజ్‌మెంట్ ఉద్యోగాల్లో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ అభ్యర్థులను నియమించుకు నేందుకు సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి.

ఫిన్‌టెక్ సంస్థలు.. అందిస్తున్న సేవలు
  • డిజిటల్ లెండింగ్
  • పేమెంట్ సర్వీసెస్
  • సేవింగ్స్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్
  • రెమిటెన్సెస్
  • పాయింట్ ఆఫ్ సేల్
  • ఇన్సూరెన్స్

ఫిన్‌టెక్ జాబ్స్ విభాగాలు :
  • సాఫ్ట్‌వేర్
  • సేల్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్
  • కోర్ ఫైనాన్స్
  • ప్లానింగ్ అండ్ కన్సల్టింగ్
  • టాప్ మేనేజ్‌మెంట్

టెక్, మేనేజ్‌మెంట్ విద్యార్థులకు చక్కటి వేదికలు :
ఫిన్‌టెక్ సంస్థల్లో టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే వీరు సంబంధిత నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. అందుకు ప్రామాణిక సంస్థలు అందించే సర్టిఫికేషన్స్ పూర్తి చేసుకుంటే మరింత మెరుగైన హోదాలు అందుకునే అవకాశం ఉంటుంది.
- బాబు మునగాల, సీఈఓ, జెబీ బ్లాక్ చైన్ సొల్యూషన్స్
Published date : 31 Aug 2019 12:14PM

Photo Stories