Skip to main content

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో.. భవిష్యత్తులో సరికొత్త ఉద్యోగాలు

ఆఫీసులో కూర్చొని ఇంట్లో ఉన్న టీవీ, వాషింగ్ మెషీన్, లైట్లు ఆన్-ఆఫ్ చేయడం.. చేతికి ధరించే ఫిట్‌నెస్ బాండ్, స్మార్ట్ వాచ్‌తో వ్యాయామం ద్వారా శరీరం ఖర్చు చేసే కేలరీల వివరాలు, హార్ట్‌బీట్ రేటు తెలుసుకోవడం.. ఎక్కడో అమర్చిన సీసీటీవీతో లైవ్ వీక్షించడం.. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోం లాంటి ఉపకరణాలు మనం చెప్పే కమాండ్స్ మేరకు పనిచేసి పెట్టడం.. వంటివన్నీ ఎలా సాధ్యమవుతున్నాయో తెలుసా?! ‘ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ)’ వీటన్నింటినీ సుసాధ్యం చేస్తోంది!! ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతున్న ప్రతి స్మార్ట్ పరికరం వైర్‌లెస్ విధానంలో డేటా పంపించడం, రిసీవ్ చేసుకోవడం ఐవోటీ టెక్నాలజీలో కీలకం. ఐవోటీ విస్తరిస్తున్న కొద్దీ.. సంబంధిత నైపుణ్యాలున్న వారికి, ఆయా కోర్సులు చదివిన అభ్యర్థులకు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో.. ఫ్యూచర్ కెరీర్‌గా నిలుస్తున్న ఐవోటీ గురించి తెలుసుకుందాం..
ఐవోటీ అంటే ?
ఇంటర్నెట్‌కు అనుసంధానం అవుతున్న స్మార్ట్ డివైజ్‌ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒక నెట్‌వర్క్‌లో రెండు అంతకంటే ఎక్కువ స్మార్ట్ ఉపకరణాలు బ్లూటూత్, వైర్‌లెస్, ఇంటర్నెట్ ఆధారిత ఐపీ నెట్‌వర్క్‌తో పరస్పరం సమాచారాన్ని పంచుకుంటూ.. మార్పిడి చేసుకోవడాన్ని ఐవోటీగా పేర్కొనవచ్చు. ఇప్పటికే మార్కెట్లో ఐవోటీ సాంకేతిక అప్లికేషన్లు చాలా అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో ఐవోటీ అప్లికేషన్ల పరిధి మరింత విస్తృతం కానుంది. ప్రాసెస్ ఆటోమేషన్, హోం ఆటోమేషన్, స్మార్ట్‌కార్లు, డెసిషీయన్ అనలిటిక్స్, స్మార్ట్ గ్రిడ్స్ వంటి విభాగాల్లో ఐవోటీ టెక్నాలజీ విరివిరిగా వినియోగంలోకి వస్తోంది. దాంతో భవిషత్తులో సరికొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చే అవకాశం ఉంది.

అతిపెద్ద మార్కెట్‌గా..
2020 కల్లా ఇండియాలో 190కోట్ల ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఇంటర్నెట్‌తో అనుసంధానం కానున్నట్లు అంచనా. ఐవోటీ వాణిజ్యపరంగా అతిపెద్ద మార్కెట్‌గా అవతరించనుంది. 2020 నాటికల్లా ప్రపంచ ఐవోటీ మార్కెట్ విలువ 30 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇందులో భారత వాటా సుమారు 9 బిలియన్ డాలర్లని అంచనా.

ఎన్నో మార్పులకు నాంది :
ప్రజల దైనందిన జీవితంలో, సమాజంలో ఊహించని ఎన్నో మార్పులకు ఐవోటీ నాంది పలకనుంది. హెల్త్‌కేర్, అగ్రికల్చర్, స్మార్ట్ హోమ్స్, ధరించడానికి అనువుగా ఉండే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, మేకింగ్ స్మార్ట్ సిటీస్ విభాగాలలో ఐవోటీ తనదైన ముద్ర వేయనుంది. అంతేకాదు రాబోయే రోజుల్లో జెట్ విమానం ఇంజన్‌తో, చమురు వెలికితీసే యంత్రాల రిగ్‌లతో సహా అన్ని రకాల యంత్రాల భాగాలతో ఇంటర్నెట్ అనుసంధానం జరగనుంది.

భారత టెకీలకు అవకాశాలు :
ఐవోటీ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్న వారికి హెల్త్‌కేర్, రిటైల్, ఉత్పత్తి, రవాణా, టెలీ కమ్యూనికేషన్ల రంగాల్లో డిమాండ్ పెరుగుతోంది. ఇందులో టెలికాం, వెహికల్స్, హోమ్స్, పట్టణాలు, కంప్యూటర్స్, మ్యానుఫాక్చరింగ్, హెల్త్ కేర్ సెక్టారుల్లో ఉద్యోగవకాశాలు పుష్కలం. అలానే, భారీ పరిశ్రమల్లోనూ ఐవోటీ ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ రంగాలతోపాటు సేవల ఔట్‌సోర్సింగ్‌లోనూ భారత టెకీలకు మెరుగైన అవకాశాలు లభించనున్నాయి.

ఐవోటీ.. ప్రస్తుత జాబ్ రోల్స్
ప్రస్తుతం ఐవోటీ నిపుణులకు యూఐ, యూఎక్స్ డిజైనర్స్, నెట్‌వర్క్ ఇంజనీర్, బ్యాక్‌ఎండ్ డెవలపర్, టెక్నికల్ కన్సల్టెంట్,ఎం2ఎం ఇంజనీర్, కస్టమర్ సపోర్ట్ వంటి జాబ్ రోల్స్ లభించే అవకాశముంది. ఈ రంగంలో ప్రత్యేక నిపుణులు అవసరం కూడా ఎక్కువగా ఉంది. అందులో భాగంగా సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్, ప్రొడక్ట్ మేనేజర్, ఇండస్ట్రియల్ డేటా సైంటిస్ట్, ఇండస్ట్రియల్ ఇంజనీర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్, రోబోట్ కోఆర్డినేటర్‌లకు డిమాండ్ పెరుగుతోంది.

నైపుణ్యాలు..
మెషిన్ లెర్నింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్, ప్రోగ్రామింగ్, అనలిటిక్స్, కమ్యూనికేషన్ ప్రొటోకాల్, నెట్‌వర్క్ సెక్యూరిటీ, యూఐ, యూఎక్స్ డిజైన్, క్లౌడ్ కంప్యూటింగ్, ఎడ్జ్ కంప్యూటింగ్‌తోపాటు, సాఫ్ట్‌స్కిల్స్ ఉండాలి. ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్‌తో డివైస్‌కు సంబంధించిన డేటాప్యాట్రన్స్‌ను అంచనా వేయగలగాలి. ఐవోటీ టెక్నాలజీలో మెషిన్ లెర్నింగ్‌కు సమీప భవిష్యత్తులో అత్యంత ప్రాధాన్యత లభిస్తుంది. పరికరాల డిజైనింగ్ కోసంఆటోక్యాడ్ టెక్నాలజీ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నెట్ ద్వారా అనుసంధానించిన డివైజ్‌లను మేనేజ్ చేయడానికి, సర్వర్ సైడ్ వెబ్ డెవలప్‌మెంట్‌కు నోడ్ జేఎస్ లాంటి ఓపెన్ సోర్స్‌ను ఉపయోగిస్తారు. డేటాచౌర్యం, ఫిజికల్, లాజికల్ ముప్పు నుంచి భద్రత కల్పించే సెక్యూరిటీ ఇంజనీరింగ్, సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాల్లో నిపుణుల అవసరం ఉంటుంది. బిగ్‌డేటా, జీపీఎస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సర్క్యూట్ డిజైన్, మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామర్ స్కిల్స్ ఉన్నవారికి ఐవోటీ చక్కటి వేదిక కానుంది.

అందుబాటులో మూక్స్ :
ఐవోటీ సంబంధిత సబ్జెక్టులను ఇన్‌స్టిట్యూట్‌లు క్యరికులంలో చేరుస్తున్నాయి. వీటితోపాటు అన్ని ఆన్‌లైన్ లెర్నింగ్ వేదిక(మూక్స్)ల్లో ఐవోటీ సంబంధిత కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు ఎంబెడెడ్ ప్రోగ్రామర్స్, డివైస్ ఎక్స్‌పర్ట్స్, క్లౌడ్ ఎక్స్‌పర్ట్స్, డేటాసైంటిస్ట్, వెబ్ ప్రోగ్రామర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్, ఫుల్ స్టాక్ డెవలర్స్, బిగ్‌డేటా ఇంజనీర్, డేటాబేస్ ఎక్స్‌పర్ట్, టెక్నికల్ ఆర్కిటెక్ట్స్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ లాంటి ఉద్యోగాల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటాయి.

హైరింగ్ సంస్థలు :
ప్రముఖ సంస్థలు క్వాల్‌కాం, వెరిజాన్, గూగుల్, అసెంచర్, ఎల్ అండ్ టీ, ఐబీఎం, ఎస్‌ఏపీ ఈఆర్‌పీ,సిస్కో మొదలైనవి ఐవోటీ నిపుణులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో ముందుంటున్నాయి.

వేతనాలు:
ఐటీ రంగంలో ఐవోటీపై నైపుణ్యం పొందిన వారికి మెరుగైన వేతనాలు లభిస్తున్నాయి. ఐవోటీలో సీనియర్‌‌సకు సగటు వార్షిక వేతనం రూ.17 లక్షలు, ఫ్రెషర్స్‌కు రూ.6 లక్షల వరకూ వేతనం అందుతోంది.
Published date : 24 Sep 2019 03:53PM

Photo Stories