Skip to main content

డేటా విశ్లేషణతో విలువైన కెరీర్...డేటా అనలిటిక్స్

ఐటీ కంపెనీ అయినా, షాపింగ్ మాల్ అయినా... సంస్థ ఏదైనప్పటకీ, కస్టమర్ల అభిరుచులు, వ్యాపారంలో కొత్త ధోరణులను ఒడిసిపట్టి, పోటీ ప్రపంచంలో ముందుకుదూసుకెళ్లడం ప్రధానం!
అలా దూసుకెళ్లాలంటే సంస్థ తీసుకునే నిర్ణయాల్లో పదును ఉండాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు బిగ్ డేటా, డేటా అనాలిసిస్ వీలుకల్పిస్తాయి. ప్రస్తుతం మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికం అండ్ హెల్త్‌కేర్ తదితర విభాగాల్లో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో డేటా అనలిటిక్స్‌లో కెరీర్ అవకాశాలపై ఫోకస్...

ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ), ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, టెలికం... ఇలా దేనికి సంబంధించిన కంపెనీ అయినా విజయపథంలో నడవాలంటే పోటీ కంపెనీలకంటే మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు డేటా అనలిటిక్స్ ఉపయోగపడుతుంది. అనలిటిక్స్ నిపుణులు సాంఖ్యక(స్టాటిస్టికల్), పరిమాణాత్మక (క్వాంటిటేటివ్), సాంకేతిక(టెక్నికల్) పద్ధతులను ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తారు. తద్వారా కంపెనీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు.

పెరుగుతున్న డిమాండ్:
సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో కంపెనీల మధ్య పోటీ తీవ్రం కావడంతో డేటా అనలిటిక్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్), క్రిసిల్ గ్లోబల్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ సర్వీసెస్ ‘బిగ్ డేటా-ది నెక్స్ట్ బిగ్ థింగ్’ నివేదిక ప్రకారం 2018 నాటికి ఒక్క అమెరికాలోనే 1,90,000 డేటా సైంటిస్ట్‌ల కొరత ఏర్పడనుంది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనాల ప్రకారం బిగ్ డేటా టెక్నాలజీ, సర్వీసుల మార్కెట్ 26.4 శాతం వార్షిక వృద్ధితో 2018 నాటికి 41.5 బిలియన్ డాలర్లకు చేరనుంది. యాడ్ టెక్, టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఈ-కామర్స్, సోషల్ మీడియా తదితరాల్లో అత్యధిక వృద్ధి నమోదు కానుంది.

ఐటీ రంగంలోనూ...
భవిష్యత్తులో అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు అనలిటిక్స్ విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. లేదంటే ఆయా కంపెనీలకు వృద్ధి ఉండదంటున్నారు. దీన్నిబట్టి చూస్తే ఐటీ రంగంలోనూ అనలిటిక్స్ నిపుణులకు తీవ్ర డిమాండ్ ఏర్పడనుంది. సాధారణ ఐటీ నిపుణుడితో పోలిస్తే అదే వయసు, అనుభవం ఉన్న డేటా అనలిటిక్స్ నైపుణ్యాలున్న వ్యక్తికి 30 నుంచి 50 శాతం అధిక వేతనాలు లభిస్తున్నాయి. ఇలాంటి సానుకూల వాతావరణం కారణంగా డేటా అనలిటిక్స్ నైపుణ్యాలు సొంతం చేసుకున్న వారికి సమున్నత కెరీర్ ఖాయమని చెప్పొచ్చు.

డేటా అనలిటిక్స్ కోర్సులు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డేటా అనలిటిక్స్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని దేశ,విదేశాల్లో ఉన్నత విద్యా సంస్థలు సంబంధిత కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఔత్సాహికులు, వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు టెక్నికల్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ మేళవింపుతో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కలకత్తా; ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ-హైదరాబాద్); ఐఐఎం-లక్నో; ఐఐఎం-బెంగళూరు, ఐఐటీ-హెచ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయి. సంస్థలు ఆన్ క్యాంపస్, ఆన్‌లైన్ బోధనా పద్ధతులను అవలంబిస్తున్నాయి. కొన్ని సంస్థలు విదేశీ బీ-స్కూల్స్ సహకారం తీసుకొని కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.

ఐఐఎం కలకత్తా, ఐఐటీ ఖరగ్‌పూర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్(ఐఎస్‌ఐ)-కోల్‌కతా సంయుక్తంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (పీజీడీబీఏ) కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. కోర్సు వ్యవధి 22 నెలలు.
అర్హత: డిగ్రీ/పీజీ (10+2+4)తో పాటు క్యాట్/ జీమ్యాట్/ జీఆర్‌ఈ/ గేట్ స్కోర్. లేదా ఐఎస్‌ఐ నిర్వహించిన మాస్టర్ స్థాయి ఎంట్రన్స్‌లో అర్హత సాధించి ఉండాలి.
కోర్సులో భాగంగా ఐఐఎం కలకత్తా.. మేనేజ్‌మెంట్‌లో అనలిటిక్స్ అప్లికేషన్స్‌పై దృష్టిసారిస్తుంది. అభ్యర్థులకు అనలిటిక్స్- స్టాటిస్టికల్, మెషీన్ లెర్నింగ్ థియరీపై ఐఎస్‌ఐ కోల్‌కతా నైపుణ్యాలు అందిస్తుంది. ఐఐటీ ఖరగ్‌పూర్.. అనలిటిక్స్‌కు సంబంధించిన టెక్నాలజీ అంశాలపై అవగాహన పెంపొందిస్తుంది.
వెబ్‌సైట్: www.iimcal.ac.in

ఐఐఎం-బెంగళూరు... డిజిటల్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ అనలిటిక్స్; ఫ్రం డేటా టు డెసిషన్స్; బిగ్ డేటా అండ్ అప్లయిడ్ మార్కెటింగ్ అనలిటిక్స్; హెల్త్‌కేర్ అనలిటిక్స్; బిజినెస్ అనలిటిక్స్-ది సైన్స్ ఆఫ్ డేటా డ్రైవెన్ డెసిషన్ మేకింగ్ కోర్సులను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.iimb.ernet.in

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- లక్నో (ఐఐఎంఎల్); కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియానా యూనివర్సిటీ, యూఎస్‌ఏ సంయుక్తంగా సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్ (CPBAE)ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.iiml.ac.in

హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అనలిటిక్స్ (సీబీఏ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల కోర్సు.
వెబ్‌సైట్: www.isb.edu

కోర్సుల్లో ఎవరు చేరొచ్చు?
కొన్ని సంస్థలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, సైన్స్, కామర్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో బ్యాచిలర్ డిగ్రీని అర్హతలుగా పేర్కొంటున్నాయి. మరికొన్ని మాస్టర్స్ డిగ్రీని అర్హతగా నిర్దేశిస్తున్నాయి.
పని అనుభవాన్ని (వర్క్ ఎక్స్‌పీరియన్స్) అర్హతగా పేర్కొంటున్నాయి. అయితే విశ్లేషణా సామర్థ్యం, అకడమిక్స్‌లో మంచి ప్రతిభ ఉంటే ఫ్రెషర్స్‌కు కూడా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

కోర్సులు-కరిక్యులం
బిజినెస్ ఫండమెంటల్స్/డేటా కలెక్షన్; డేటా మేనేజ్‌మెంట్, డేటా విజువలైజేషన్, స్టాటిస్టికల్ అనాలిసిస్, కాంటెంపరరీ అనలిటిక్స్, ఫోర్‌కాస్టింగ్ అనలిటిక్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.
అనలిటిక్స్ రంగంలోని నిపుణులతో సెమినార్లు, పరిశ్రమల సందర్శన వంటివి ఉంటాయి.
కొన్ని బిజినెస్ స్కూల్స్ ఎంబీఏ కరిక్యులంలో భాగంగా బిజినెస్ అనలిటిక్స్ అంశాలపై శిక్షణ ఇస్తున్నాయి.

ఉన్నత ఉద్యోగావకాశాలు
డేటా అనలిటిక్స్ నైపుణ్యాలున్న వారికి ఐటీ సర్వీసెస్, ఎడ్యుకేషన్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ట్రావెల్ అండ్ టూరిజం, హెల్త్‌కేర్, బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ తదితర రంగాలకు సంబంధించిన సంస్థల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉదాహరణకు మార్కెటింగ్ రంగాన్ని తీసుకుంటే సేకరణ (ప్రొక్యూర్‌మెంట్), బ్రాండింగ్, ప్రమోషన్ ప్రోగ్రామ్స్ తదితర అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు కంపెనీలు అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి.
కార్పొరేట్ సంస్థలు సొంతంగా ఇన్‌హౌజ్ అనలిటిక్స్ బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని థర్డ్‌పార్టీ ఐటీ/ఐటీఈఎస్ సర్వీస్ ప్రొవైడర్ల అనలిటిక్స్ సేవలను పొందుతున్నాయి.
ఢిల్లీ/గుర్గావ్, ముంబై, పుణె, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్ తదితర నగరాలు అనలిటిక్స్ నిపుణులకు అవకాశాలకు వేదికలుగా నిలుస్తున్నాయి.
కార్పొరేట్ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా తమకు కావాల్సిన నిపుణులను నియమించుకుంటున్నాయి.

వేతనాలు
మైక్రోసాఫ్ట్, గూగుల్, జెన్‌ప్యాక్ట్, టీసీఎస్, ఐబీఎం, విప్రో, డెల్ వంటి సంస్థలు ప్రతిభ కలిగిన అనలిటిక్స్ నిపుణులకు అత్యుత్తమ వేతన ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. ప్రతిభ ఉన్న అనలిటిక్స్ నిపుణులకు కార్పొరేట్ కంపెనీలు ప్రారంభంలో నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఇస్తున్నాయి.

జాబ్ ప్రొఫైల్స్
డేటా అనలిటిక్స్ స్కిల్స్ ఉన్నవారికి వివిధ హోదాల్లో అవకాశాలుంటాయి. అవి...
  • డేటా సైంటిస్ట్
  • డేటా అనలిస్ట్
  • బిగ్ డేటా ఆర్కిటెక్ట్
  • సీనియర్ అనలిస్ట్
  • బిగ్ డేటా డెవలపర్
  • బిగ్ డేటా అనలిటిక్స్ బిజినెస్ కన్సల్టెంట్
  • బిగ్ డేటా ఇంజనీర్
ఉన్నత అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలు:
  • మెషీన్ లెర్నింగ్, డేటా మైనింగ్
  • స్టాటిస్టిక్స్ అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్
  • డేటా విజువలైజేషన్
  • హదూప్ (Hadoop)
  • స్పార్క్
SQL
  • Not only SQL (NoSQ-L)
  • పైథాన్/ఆర్/జావా
  • ప్లాబ్లమ్ సాల్వింగ్
  • ఆప్టిమైజేషన్ టెక్నిక్స్
అనలిటిక్స్‌తో అద్భుత కెరీర్!
గత రెండేళ్లుగా బిగ్ డేటా, డేటా అనలిటిక్స్ విభాగంలో కెరీర్ అవకాశాలు బాగా పెరిగాయి. ఆసక్తిని బట్టి ఔత్సాహికులు ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్, డిస్క్రిప్టివ్ అనలిటిక్స్‌ల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కోడింగ్, బిజినెస్ అండర్‌స్టాండింగ్, స్టాటిస్టిక్స్, డేటా మైనింగ్ టెక్నిక్స్ పరిజ్ఞానం ఉంటే డేటా అనలిటిక్స్ రంగంలో రాణింవచ్చు. అనలిటిక్స్ నైపుణ్యాలున్న వారికి టెలికం, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్, ఈ-కామర్స్ తదితర రంగాలకు చెందిన కార్పొరేట్ కంపెనీల్లో డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, బిగ్ డేటా ఇంజనీర్, బిగ్ డేటా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వంటి ఉన్నత స్థాయి అవకాశాలుంటాయి. అనలిటిక్స్ నిపుణులను ఎక్కువగా నియమించుకున్న కంపెనీల్లో టీసీఎస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్, ఐబీఎం, జెన్‌ప్యాక్ట్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌పీ, డెలాయిట్, హెచ్‌సీఎల్ ముందున్నాయి.
ఎ. బాలగంగాధర తిలక్, (అమెరికాకు సంబంధించిన టెలీకమ్యూనికేషన్ కంపెనీలో డేటా సైంటిస్ట్).
Published date : 10 Jul 2015 12:53PM

Photo Stories