Skip to main content

ఆటోమేషన్ యుగం...సాఫ్ట్‌స్కిల్స్‌తోనే విజయం !

‘యువత ఆటోమేషన్ బాట పట్టాలి. ఐఓటీ, ఏఐ, రోబోటిక్స్, బ్లాక్ చైన్, మెషీన్ లెర్నింగ్..ఈ లేటెస్ట్ టెక్నాలజీని పుక్కిట పట్టాల్సిందే! లేదంటే భవిష్యత్తు అవకాశాలు అంతంత మాత్రమే’-గత రెండేళ్లుగా కార్పొరేట్ సంస్థలు, రిక్రూటర్లు పదేపదే చెబుతున్న మాటలు.
‘ఆటోమేషన్ ముఖ్యమే. దాంతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఆధునిక నైపుణ్యాలున్నా.. సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే రాణించడం కష్టమే! కాబట్టి యువత కోర్(హార్డ్) నైపుణ్యాలతోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌ను సైతం సొంతం చేసుకోవాలి’-అవే కార్పొరేట్ సంస్థలు, రిక్రూటర్లు సాఫ్ట్ స్కిల్స్ ప్రాధాన్యం గురించి తాజాగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయం.

గత రెండేళ్లుగా సంస్థలు ఆటోమేషన్ బాటపట్టిన తరుణంలో సాఫ్ట్‌స్కిల్స్ ప్రాధాన్యం కొంత తగ్గింది. కోర్ నైపుణ్యాల ఆవశ్యకత పెరిగింది. అయితే ఇటీవల వెలువడిన ఓ సర్వేలో.. సాఫ్ట్ స్కిల్స్ ప్రాధాన్యం మళ్లీ తెరపైకి వచ్చింది. కంపెనీలు నేటి ఆటోమేషన్ యుగంలోనూ.. అభ్యర్థుల సాఫ్ట్ స్కిల్స్‌కు పెద్దపీట వేస్తున్నట్లు ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ లింక్డ్‌ఇన్ తాజా సర్వేలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు.. సాఫ్ట్‌స్కిల్స్ ఉంటేనే అభ్యర్థులకు ఆఫర్ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొంది. ఉద్యోగుల సాఫ్ట్ట్‌స్కిల్స్ సంస్థ విజయానికి దోహదం చేస్తాయని ప్రపంచ వ్యాప్తంగా 92 శాతం మంది రిక్రూటర్లు, టాలెంట్ ప్రొఫెషనల్స్ పేర్కొనడం గమనార్హం.

మారుతున్న సాఫ్ట్‌స్కిల్స్..
సాఫ్ట్‌స్కిల్స్ ఉన్న అభ్యర్థుల వల్ల ప్రయోజనం చేకూరుతుందని మన దేశంలోని 87శాతం సంస్థలు(రిక్రూటర్స్) పేర్కొనడం విశేషం. అంతర్జాతీయంగానూ ఆయా దేశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. యూఎస్, యూకేల్లో 90 శాతం; కెనడాలో 94 శాతం; చైనాలో 93 శాతం కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో సాఫ్ట్‌స్కిల్స్‌కు పెద్దపీట వేస్తున్నాయి. గతంలో సాఫ్ట్‌స్కిల్స్ అంటే.. కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద నైపుణ్యం, బాడీ లాంగ్వేజ్ వంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. కానీ.. ప్రస్తుతం క్రియేటివిటీ (సృజనాత్మకత), పర్సుయేషన్(ఒప్పించడం), కొలాబరేషన్(కలిసి పనిచేయడం), అడాప్టబిలిటీ(పరిస్థితులకు తగ్గట్టు మారడం), టైమ్ మేనేజ్‌మెంట్(సమయ పాలన) వంటి స్కిల్స్ కీలకంగా మారుతున్నాయి.

కంపెనీలకు క్లిష్టంగా..
అభ్యర్థుల్లోని సాఫ్ట్ స్కిల్స్‌ను గుర్తించడం కంపెనీలకు క్లిష్టంగా మారిందని తాజా సర్వేలో పేర్కొనడం గమనార్హం. 57 శాతం సంస్థలు.. తాము అభ్యర్థుల్లోని సాఫ్ట్ స్కిల్స్‌ను అంచనా వేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపాయి. కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధించి ఓ అంచనాకు వస్తున్నాయి. అవి.. బిహేవియరల్ ప్రశ్నలు, బాడీ లాంగ్వేజ్ పరిశీలన, సమయోచిత ప్రశ్నలు, ప్రాజెక్ట్స్, టెక్నాలజీ ఆధారిత మూల్యాంకనను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. నియామక ప్రక్రియ సమయంలో పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్ ఆధారంగా ఆయా సాఫ్ట్‌స్కిల్స్‌ను పరిశీలిస్తున్నారు. సమయోచిత ప్రశ్నల ద్వారా.. అభ్యర్థుల్లోని క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అడాప్టబిలిటీ, కొలాబరేషన్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌ను పరిశీలిస్తున్నారు.

నచ్చిన సమయంలో పనిచేసేలా..
లింక్డ్‌ఇన్ గ్లోబల్ టాలెంట్ ట్రెండ్స్-2019లో మరో కీలక ట్రెండ్‌గా.. వర్క్ ఫ్లెక్సిబిలిటీ నిలిచింది! అంటే.. సంస్థలు.. ఉద్యోగులు తమకు నచ్చిన సమయంలో పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించడం. ఇలాంటి విధానం ఫలితంగా ఉద్యోగులు ఉల్లాసంగా పనిచేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనాలోని సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించడం వల్ల ఉత్పత్తి సామర్థ్యం 13 శాతం పెరిగిందని సర్వే పేర్కొంది. మరోవైపు ఉద్యోగార్థుల్లో కూడా ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్‌పై ఆసక్తి పెరుగుతోంది. వర్క్ ఫ్లెక్సిబిలిటీ పరంగా-సాఫ్ట్‌వేర్ అండ్ ఐటీ-72శాతం, ఫైనాన్స్-62 శాతం, కార్పొరేట్‌సర్వీసెస్-57 శాతం, హెల్త్‌కేర్-43 శాతం, మాన్యుఫ్యాక్చరింగ్-43 శాతంగా ఉంది. ముఖ్యంగా మహిళల్లో నచ్చిన సమయంలో పని ఆలోచన ఎక్కువగా కనిపిస్తోంది. ఫ్లెక్సిబుల్ వర్క్ కల్చర్ విధానం అనుసరించే సంస్థల వైపు మొగ్గు చూపుతామని 36 శాతం మంది మహిళలు పేర్కొన్నారు. ఇది పురుషుల్లో 29 శాతం మాత్రమే ఉండటమే ఇందుకు నిదర్శనం. అయితే నచ్చిన సమయంలో పని సంస్కృతి కారణంగా.. టీమ్ బాండింగ్, కొలాబరేషన్, విధి నిర్వహణకు తక్కువ ప్రాధాన్యం వంటి సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు.

వేతన పారదర్శకత :
వేతన పారదర్శకత (పే ట్రాన్స్‌పరెన్సీ). తాజా సర్వే ప్రకారం- ప్రస్తుతం 27 శాతం సంస్థలు వేతన పారదర్శకత విధానాన్ని అమలు చేస్తున్నాయి. వీటిలో 67 శాతం సంస్థలు నియామక ప్రక్రియలోనే వేతనమెంతో తెలియజేస్తున్నాయి. 59 శాతం కంపెనీలు.. సంస్థలోని ఆయా ఉద్యోగుల వేతనమెంతో ఇతర ఉద్యోగులకు కూడా తెలిసేలా చేస్తున్నాయి. 48 శాతం సంస్థలైతే నేరుగా నియామక ప్రకటనల్లోనే వేతనాన్ని తెలియజేస్తున్నాయి. వేతన పారదర్శకతతో.. నియామకాల సమయంలో జీతభత్యాల బేరసారాలు గాడిన పడతాయి. అంతేకాకుండా ఫెయిర్ పే ధ్రువీకరణ సాధ్యమవుతుంది. ముఖ్యంగా జీతం తక్కువగా ఉందని అసంతృప్తి చెందే సిబ్బందిని గుర్తించడం తేలికవుతుంది. వేతన పారదర్శకతకు అంతర్జాతీయంగా పలు దేశాల్లోని సంస్థలు విముఖంగా ఉండటం గమనార్హం. యూకే, యూఎస్, కెనడా, ఫ్రాన్స్.. ఇలా ప్రముఖ దేశాల్లో 50 నుంచి 60 శాతం సంస్థలే వేతనాలను వెల్లడించడానికి సుముఖత వ్యక్తం చేశాయి. భారత్‌లోని 57 సంస్థలు వేతన పారదర్శకతకు సానుకూలంగా స్పందించాయి.

వేధింపుల నిరోధక విధానాలు..
గ్లోబల్ టాలెంట్ ట్రెండ్స్ ప్రకారం-ఆయా సంస్థలు అనుసరిస్తున్న వేధింపుల నిరోధక విధానాలు కూడా ఈ ఏడాది కీలకంగా మారనున్నాయి. ఇటీవల కాలంలో సంస్థల్లోని మహిళా ఉద్యోగులు తమకు ఎదురవుతున్న వేధింపులను బహిరంగ పరుస్తున్నారు. దాంతో వేధింపుల నిరోధక విధానాలు ప్రాధాన్యంగా మారాయని సంస్థలు భావిస్తున్నాయి. అంతర్జాతీయంగా 80 శాతం సంస్థలు వేధింపుల నిరోధక విధానాలు(యాంటీ హెరాస్‌మెంట్ పాలసీస్)కు సంబంధించి అంతర్గతంగా పకడ్బందీ విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపాయి. వేధింపుల నిరోధక విధానాలకు సంబంధించి మన దేశంలోని సంస్థలు మరింత ప్రాధాన్యం ఇస్తున్నాయి. వేధింపుల నియంత్రణ విధానాలు భవిష్యత్తు నియామకాలపై ప్రభావం చూపుతాయని మన దేశంలోని 87 శాతం రిక్రూటర్లు పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. సంస్థలు యాంటీ హెరాస్‌మెంట్ విధానాలపై ఉద్యోగులకు శిక్షణనివ్వడం.. వేధింపులకు గురైన వారితో నేరుగా చర్చించి వారి సమస్యను తెలుసుకోవడం.. నాయకత్వ స్థాయిలో జెండర్ డైవర్సిటీకి ప్రాధాన్యం ఇవ్వడం.. అంతర్గత విచారణ విధానాలను మరింత పకడ్బందీగా రూపొందించడం వంటి వాటిపై దృష్టిపెడుతున్నాయి.
Published date : 05 Mar 2019 03:37PM

Photo Stories