Skip to main content

ఆటోమేషన్ ఉద్యోగాల తీరు

ఆటోమేషన్.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు కెరీర్ పరంగా ప్రతి ఒక్కరి నోళ్లలో నానుతున్న పదాలు! వీటి ఫలితంగా భారీగా ఉద్యోగాల్లో కోత పడుతుందనే వార్తల నేపథ్యంలో కొత్త నైపుణ్యాలు దిశగా శిక్షణ తీసుకుంటున్న ఔత్సాహికులు! తాజాగా వివిధ సర్వేలు విడుదల చేసిన అంచనాల ప్రకారం 2030 నాటికి అధిక శాతం ఉద్యోగాలు.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్‌లతో నిండిపోనున్నాయి.
మన దేశంలో యువత ఏఐ, ఆటోమేషన్ నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఇప్పుడిప్పుడే అడుగులువేస్తున్న నేపథ్యంలో ఏఐతో భవిష్యత్ అవకాశాలపై అంచనాలు, వాటినిఅందుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను తెలుసుకుందాం..

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటే.. కంప్యూటర్లు ప్రతి పనికీ ప్రత్యేకంగా ప్రోగ్రామ్ అవసరం లేకుండానే పరిసరాల్లో మార్పులకు అనుగుణంగా ఆలోచించగలగడం, నేర్చుకోగలగడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండటం. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్‌లెర్నింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, బిగ్‌డేటా... ఇవన్నీ కొద్దిపాటి అంతరాలతో ఒకే తరానికి చెందిన టెక్నాలజీలు అని చెప్పొచ్చు. ఈ పదాలు యువత నోళ్లలో కొంత కాలంగా నానుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రమేణా విస్తరిస్తోంది. ఇది 2030 నాటికి తీవ్రస్థాయికి చేరుకొని.. ఆయా రంగాల్లో మానవ ప్రమేయం భారీగా తగ్గుతుందని ఇటీవల ఓ నివేదిక స్పష్టం చేసింది.

ఏఏ రంగాలపై ప్రభావం
తాజా నివేదికల ప్రకారం- 2030 నాటికి ఆటోమేషన్ ప్రమేయం అధికంగా ఉండే రంగాలు..
  • రవాణా, నిల్వ.
  • తయారీ.
  • హోల్‌సేల్, రిటైల్ వ్యాపారం.
  • పభుత్వ పాలన, రక్షణ.
  • ఆర్థిక, బీమా.
  • సమాచార సాంకేతిక రంగం.
  • శాస్త్రసాంకేతిక రంగం.
  • మానవ ఆరోగ్యం, సామాజిక సేవ.
  • విద్య.

మూడు దశల్లో..
వివిధ రంగాలపై ఆటోమేషన్ ప్రభావం మూడు దశలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.. అవి..
  • అల్గారిథమ్ వేవ్: ఆటోమేషన్‌లోనే సులువుగా ఉండే కంప్యుటేషనల్ టాస్క్ నిర్వహించడం, స్ట్రక్చర్డ్ డేటాను విశ్లేషించడం ఇందులో భాగం. ప్రస్తుతం ఆటోమేషన్ పరంగా ఈ స్థాయిలోనే అన్ని సంస్థలూ ఉన్నాయి.
  • ఆగ్‌మెంటేషన్ వేవ్: సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సమాచార మార్పిడి; అన్‌స్ట్రక్చర్డ్ డేటాను గణాంక సహితంగా విశ్లేషించడం (ఉదా: వేర్‌హౌస్‌లలో ఉండే ఏరియల్ డ్రోన్లు, రోబోలు). వాస్తవానికి ఈ విధానం ఇప్పటికే అమలవుతోందని, 2020 నాటికి కీలక దశకు చేరుకుంటుందని తాజా నివేదిక స్పష్టం చేసింది.
  • అటానమీ వేవ్: మానవ వనరులపై ప్రత్యక్ష ప్రభావం చూపేది ఈ దశలోనే!. ఈ దశలో మానవ వనరుల ప్రమేయం తగ్గి, వారి స్థానంలో పూర్తిగా ఆటోమేషన్‌పై ఆధారపడే పరిస్థితి వస్తుంది.

ప్రతి దానికీ ప్రోగ్రామింగ్ రాసే పరిస్థితి లేకుండా.. కంప్యూటర్లే సొంతంగా స్పందించేలా మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్‌పై ఆధారపడే విధానం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ప్రధానంగా ఉత్పత్తి, రవాణా రంగాల్లో దీన్ని చూడొచ్చు (ఉదా: డ్రైవర్ రహిత వాహనాలు).

ప్రభావం ఎవరిపై అధికం?
25 ఏళ్ల లోపు యువత ఆగ్‌మెంటేషన్, అటానమీ వేవ్ దశల్లో అత్యంత ప్రభావానికి గురవనుందని అంచనా. 25 ఏళ్ల నుంచి 54 ఏళ్ల మధ్య వయసు వారిలో ఆగ్‌మెంటేషన్ వేవ్ దశలో ఉద్యోగ భద్రతపరంగా ప్రతికూలత ఎదురుకానుంది. విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుంటే.. తక్కువ అర్హతలున్నవారు ఆగ్‌మెంటేషన్, అటానమీ వేవ్ దశల్లో అత్యంత ప్రభావానికి గురవనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ అర్హతలున్న వారు, ఉన్నత అర్హతలు కలిగిన వారు ఆగ్‌మెంటేషన్ వేవ్‌లోనే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోనున్నారు.

ఆటోమేషన్ ప్రభావం వల్ల 2030ల్లో వివిధ స్థాయిల్లో మానవ వనరుల ప్రమేయం తగ్గే పరిస్థితులున్నట్లు నివేదిక పేర్కొంది. సాంకేతిక మార్పులను ఒడిసిపట్టుకొని, సంబంధిత నైపుణ్యాలు పెంచుకున్న వారికి మాత్రం అత్యున్నత హోదాలు లభించడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏఐ ఆధారిత వ్యవస్థల నిర్వహణ, పర్యవేక్షణకు అత్యున్నత సాంకేతిక అర్హతులున్న వారికి కంపెనీలు పెద్దపీట వేయనున్నాయి.

కొత్త జాబ్‌రోల్స్
జాబ్ రోల్స్ పరంగా ఐటీ, ఆటోమోటివ్, టెక్స్‌టైల్, బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్ రంగాల్లో కొత్త జాబ్ రోల్స్ ఆవిష్కృతం కానున్నాయి. డేటా సైంటిస్ట్; 3-డి ప్రింటింగ్, డిజిటిల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్; బ్లాక్‌చైన్ ఆర్కిటెక్ట్ తదితర సరికొత్త ఉద్యోగాలు తెరపైకి రానున్నాయి.

అవసరమైన నైపుణ్యాలు
ముఖ్యంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో కెరీర్ దిశగా ఆలోచిస్తున్న విద్యార్థులు.. తమకు మ్యాథమెటిక్స్‌పై ఆసక్తి ఉందో లేదో చూసుకోవాలి. దాంతోపాటు పదో తరగతి/ఇంటర్మీడియెట్ స్థాయిలోని మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఆల్జీబ్రా సమస్యలకు సొంతంగా భిన్నమైన కోణంలో సమాధానాలు రాబట్టగలరేమో ప్రయత్నించాలి. అలాగే కంప్యూటర్ బేసిక్స్‌తోపాటు హార్డ్‌వేర్‌పైనా అవగాహన, ఆసక్తి, అభిరుచి ఉండాలి. లాజికల్ థింకింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్ స్కిల్స్ తప్పనిసరి. వీటితోపాటు ఏఐ కెరీర్‌లో రాణించాలంటే.. కంప్యూటర్ సైన్స్ ప్రాథమిక అంశాలతోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్‌వేర్ డిజైన్‌లో ప్రావీణ్యం సొంతం చేసుకోవాలి.

కోర్సుల వివరాలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్ తదితర విభాగాల్లో కెరీర్ కోరుకునే విద్యార్థులు బీటెక్ పూర్తిచేసుకోవడం... ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి బ్రాంచ్‌లో చేరడం ద్వారా ఏఐ, మెషిన్‌లెర్నింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ దిశగా కెరీర్‌కు మేలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బ్యాచిలర్ స్థాయిలో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులు చదివిన విద్యార్థులు డేటాసైన్స్, బిగ్‌డేటా కోర్సులు నేర్చుకోవచ్చు.

ఇండియా స్కిల్ రిపోర్ట్
భారత్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అనలిటిక్స్ ప్రభావం కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్న మొత్తం సంస్థల్లో 69 శాతం సంస్థలు తమ నియామకాల్లో ఆటోమేషన్ స్కిల్స్‌కు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నాయి. 24 శాతం సంస్థలు అనలిటిక్స్ నైపుణ్యాలు, 15 శాతం సంస్థలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

కోర్సులు, సంస్థలు
  1. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్.. రోబోటిక్స్ స్పెషలైజేషన్‌తో మాస్టర్స్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటర్ సైన్స్‌ను ఆఫర్ చేస్తోంది.
  2. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ.. ఎంటెక్ ఇన్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ కోర్సును అందుబాటులో ఉంచింది.
  3. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ.. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్‌లో ఎంఈ/ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
  4. ఐఐటీ బాంబే, ఐఐటీ మద్రాస్, ట్రిపుల్ ఐటీ బెంగళూరు, ఐఎస్‌బీ, ఐఐఎం బెంగళూరు, కోల్‌కతా, లక్నో కూడా వివిధ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
  5. మెషిన్ లెర్నింగ్, బిగ్‌డేటాకు సంబంధించి ఆర్, పైథాన్, స్పార్క్, హడూప్, ఎస్‌ఏఎస్ తదితర కోర్సులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
  6. డేటా సైన్స్ అనేది డేటా రూపకల్పన, విశ్లేషణ, కూర్పుకు సంబంధించింది. విభిన్న విభాగాల నుంచి పెద్ద ఎత్తున డేటాను సేకరించి.. బిగ్‌డేటా టూల్స్ ఆధారంగా వర్గీకరిస్తారు. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ అనువర్తింపజేసి... కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా విశ్లేషిస్తారు. డేటా సైంటిస్ట్‌లు ముఖ్యంగా డేటాను వ్యాపార కోణంలో చూస్తారు.
Published date : 16 Apr 2018 12:28PM

Photo Stories