Skip to main content

కెరీర్‌గెడైన్స్.. స్టాక్ ఎనలిస్ట్

సెబీ రూపొందించిన సరళీకృత లిస్టింగ్  నిబంధనలు , మరోవైపు ఆర్థిక అభివృద్ధి వంటి కారణాలతో స్టాక్ మార్కెట్ లావాదేవీలపై రోజు రోజుకీ ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.  తమ పొదుపు మొత్తాలను మదింపు చేసేందుకు దీన్నే అద్భుత సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.  మధ్య తరగతి నుంచి ఉన్నత శ్రేణి వర్గాల వరకు ‘పొదుపు శక్తి’ ఉన్న వారిలో నూటికి 50 నుంచి 60 శాతం మంది స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నవారే. అయితే సరైన అవగాహన లేకుండా.. కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాల ఆధారంగానే షేర్లు కొనడం ఏమంత ఆహ్వానించదగిన పరిణామం కాదు. ఈ పరిస్థితుల్లోనే ‘ఏ కంపెనీ షేర్లు కొనాలి? ఎన్ని కొంటే శ్రేయస్కరం? లేదా కొనుగోలు చేయాలా? అమ్మకం వైపు దృష్టి సారించాలా?’ వంటి విశ్లేషణలతో ‘స్టాక్ ఎనలిస్ట్’లు మదుపుదారులకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

స్టాక్ ఎనలిస్ట్ అంటే:
ఒక్క మాటలో చెప్పాలంటే.. తమ సంస్థ ద్వారా స్టాక్ మార్కెట్ లావాదేవీలు నిర్వహించే వినియోగదారులకు తగిన సలహాలిచ్చి వారిని లాభాల బాటలో నడిపించే వారే స్టాక్ ఎనలిస్ట్‌లు. అయితే ఆ సలహా ఇవ్వడానికి ముందు వారు కసరత్తు చేయాల్సిన అంశాలు ఎన్నో.  ప్రతి కంపెనీకి సంబంధించి ప్రతి విషయంపై క్షుణ్నంగా అవగాహన పొందాలి. ఇందుకోసం ఆయా కంపెనీల ఆర్థిక ఫలితాలు, లాభాల నిష్పత్తి, పెరుగుదల సూచీపై పరిశోధన, విస్తరణ అవకాశాలు, భవిష్యత్తు ఆదాయ అంచనాలపై కూలంకష పరిశోధనలు సాగించి... తగిన సలహాలను వినియోగదారులకు అందించాలి. అంతేకాక నివేదికలు రూపొందించడం వీరి విధి.

అడుగుపెట్టేదెలా:
షేర్ల లావాదేవీలు నిర్వహించే బ్రోకింగ్ లేదా ట్రేడింగ్ సంస్థల్లో (ఉదా: కార్వీ కన్సల్టెన్సీ, జెన్ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్ర) స్టాక్ ఎనలిస్ట్‌ల అవసరం ఏర్పడుతుంది. సాధారణంగా ఫైనాన్స్ ఐచ్ఛికాంశంగా ఎంబీఏ పట్టభద్రులకు లేదా ఎం.కాం. అభ్యర్థులకు ఈ అవకాశం లభిస్తుంది. ఎంబీఏ (ఫైనాన్స్)లో పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌లో ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశాలు మరింత సమీపంలో ఉంటాయి. వీటితోపాటు దేశంలో పలు విద్యా, శిక్షణ సంస్థలు కేవలం స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మిగిలిన వారితో పోల్చితే మరింత డిమాండ్ ఉంటోంది. అంతేకాక.. బీబీఏ పూర్తి చేసిన వారికి.. బి.కాం పూర్తి చేసి ఆర్థిక విభాగాల్లో అనుభవం గడించిన వారికి కూడా అవకాశాలు లభిస్తాయి. ఇలా అనుభవంతో వెళ్లిన వారు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి హాజరైతే అర్హతలకు నగిషీలు దిద్దుకోవచ్చు. మేనేజ్‌మెంట్ విద్యార్థులతో దీటుగా పోటీ పడవచ్చు.

ఇతర అర్హతలు:
ఎంబీయేకు జతగా... ఇంజనీరింగ్, ఫార్మసీ, బయోటెక్ వంటి అంశాల్లోనూ అర్హత సాధిస్తే ఆ అభ్యర్థులకు ఎదురుండదు. కారణం.. ఇప్పుడు చాలా వరకు స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో పాల్గొంటున్న సంస్థలు ఆ రంగాలకు చెందినవే. దీంతో వాటిపై అవగాహన ఉంటే ‘స్టాక్ ఎనలిస్ట్’లు ఆయా కంపెనీల సాంకేతిక అంశాలపైనా పట్టు సాధించే అవకాశం కలుగుతుంది. ఫలితంగా వారిచ్చే సలహాలు ఇతరులతో పోల్చితే విభిన్నంగా... వినూత్నంగా ఉంటాయి.

ఆసక్తే కీలకం:
స్టాక్ ఎనలిస్ట్‌గా రాణించాలంటే అర్హతలకంటే అత్యంత ముఖ్యమైనది.. తప్పనిసరిగా అభ్యర్థికి ఉండవలసినది ‘ఆసక్తి’. ఇతర ఉద్యోగాల మాదిరిగా ‘టెన్ టు సిక్స్’ పనిచేస్తే చాలనుకునే దృక్పథం ఈ రంగంలో అసలు సరిపడదు.  ఎందుకంటే.. స్టాక్ ఎనలిస్ట్‌లిచ్చే సలహాలు ఎందరో జీవితాలతో ముడిపడటమే కాకుండా.. కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలను మార్గ నిర్దేశం చేస్తాయి. ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా వ్యవహ రించినా ఒక్క వ్యక్తి వల్ల బ్రోకింగ్ సంస్థ విశ్వసనీయతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల యాంత్రికంగా పని చేసే పరిస్థితితో ఈ రంగంలో రాణించడం చాలా కష్టం. ఆసక్తి, పని వేళల విషయంలో రాజీ పడని ధోరణి అత్యంత అవశ్యం...

ఎ టు జెడ్:
విద్యార్హతలు, ఆసక్తితోపాటు ‘కంప్యూటర్ స్కిల్స్’, ‘మ్యాథమేటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్’ కూడా ఎంతో అవసరం. ఈ షేర్ ఏ నిమిషంలో ఎంత శాతం లాభనష్టాలకు గురవుతుందనే అంచనా ‘మ్యాథమేటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్’ ద్వారా అలవడితే... క్షణ క్షణానికి కంప్యూటర్ తెరపై మారే అంకె లను గ్రహించడానికి.. అందుకు అనుగుణంగా వినియో గదారుల తరఫున ‘ఆర్డర్లు’ ఇవ్వడానికి కంప్యూటర్ స్కిల్స్ ఉప యోగపడతాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్ నిబంధనలు, ట్యాక్స్ నియమాలు, మనీ మార్కెట్ నియమాలు, ఆర్థిక పరిస్థితిపై అవగాహన అలవర్చుకోక తప్పదు. మార్కెట్‌లో తాజా పరిస్థితులను లాజికల్‌గా విశ్లేషణ చేసే శక్తి ఉంటే వేరెవ్వరూ సాటిరారు. వేగవంతమైన నిర్ణాయక శక్తి కూడా అందలాలు ఎక్కిస్తుంది. వీటన్నిటితోపాటు ‘సేల్స్‌మెన్ షిప్’ కూడా ఎంతో అవసరం. కొన్ని సమయాల్లో ‘స్టాక్ ఎనలిస్ట్’లే వినియోగదారులకు ఫోన్ చేసి ఫలానా షేర్ కొనండి అని చెప్పి.. వారిని ఒప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు ఆ ‘సేల్స్‌మెన్‌షిప్’ ఎంతో మేలు చేస్తుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో సంభవించే అనూహ్య పరిణామాల వల్ల ఒక్కోసారి ఎనలిస్ట్‌ల విశ్లేషణలు కూడా ఎదురుతిరుగుతాయి.. ఎనలిస్ట్‌లను సంప్రదించకుండా సొంతగా ట్రేడింగ్ చేసుకుంటున్న వారు కూడా ఎక్కువగా ఉంటున్నారు. ఆయా వ్యక్తులు స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి ఇది కూడా ఓ కారణమే.

సాఫ్ట్‌స్కిల్స్:
ఏ రంగమైనా ఇప్పుడు వినిపిస్తున్న మంత్రం ‘సాఫ్ట్ స్కిల్స్’. ఇందుకు స్టాక్ ఎనలిస్ట్‌లు మినహాయింపేమీ కాదు. రోజుకు కొన్ని వందల మందితో మాట్లాడవలసి ఉంటుంది... ఈ పరిస్థితుల్లో విభిన్న మనస్తత్వాల వ్యక్తులు ఎదురుపడతారు. వారందరినీ ఒప్పించే విధంగా మెలగడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో సహనశీలత మరో ప్రధాన అవసరం. అంతేకాక.. కొన్ని సమయాల్లో నేరుగా సంస్థల ప్రతి నిధులతో సంప్రదించాల్సి ఉంటుంది. వారి సంస్థకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఎదుటి వారిని ఒప్పించే గుణం.. చక్కని మాట తీరు కచ్చితంగా మేలు చేస్తాయి.

విధులివే:
ఒక స్టాక్ ఎనలిస్ట్ చేసే విధులు సాధారణంగా ఇలా ఉంటాయి.. ఓ సంస్థకు సంబంధించి పరిశోధన చేసి అవగాహన పొందడం.. వారి ఆర్థిక ఫలితాలు, ఆ రంగంలో సంబంధిత సంస్థకు ఎదురవుతున్న పోటీ, ప్రస్తుత పరిణామాలు, ఆ రంగంలో ప్రస్తుత నిబంధనలు తదితర అంశాలపై పరిశోధన చేయడం... ఈ విధంగా ఒక రంగంలో అనేక సంస్థలపై క్షుణ్నంగా అధ్యయనం చేసి.. ‘షార్ట్ లిస్ట్’ రూపొందించుకుని.. మంచి వాటి గురించి వినియోగదారులకు తెలియజేయాలి. అవసరమైతే తామందించే సలహాలు... ఏ విధంగా ఉపయోగపడతాయో వినియో గదారులకు విశ్లేషించే సామర్థ్యం కచ్చితంగా ఉండాలి.

గురి కుదిరితే:
‘ఆ డాక్టర్ హస్తవాసి మంచిది.. చేయి పడితే చాలు జబ్బు నయం’.. ఇది డాక్టర్ల గురించి రోగుల్లో నెలకొనే అభిప్రాయం. ఇప్పుడు దీనిని ‘స్టాక్ ఎనలిస్ట్’లకు కూడా అన్వయించవచ్చు. వీరిచ్చే సలహాలు వినియోగదారులను లాభాల బాటలో పరుగులు పెట్టిస్తే.. అలాంటి అభ్యర్థులు స్వల్ప కాలంలో వెలిగిపోతారు. ‘ఉద్యోగి’ హోదా నుంచి ‘యజమాని’ హోదాకు ఎదిగే అవకాశాలు ఎన్నెన్నో..  రెండు మూడేళ్లలోనే సీనియర్ స్థాయికి చేరుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా స్థిరపడవచ్చు. మరికొంతమంది పెద్ద సంస్థల్లో ‘పోర్ట్ ఫోలియో మేనేజర్లు’గా అవతారమెత్తవచ్చు.

వేతనాలు:
ఎలాంటి అనుభవం లేకుండా అకెడమిక్ అర్హతల ఆధారంగా ‘స్టాక్ ఎనలిస్ట్’లుగా అడుగుపెట్టిన వారికి ప్రారంభ స్థాయిలో నెలకు రూ. 12 వేల నుంచి 15 వేల వేతనం లభిస్తుంది. రెండు, మూడేళ్లు అనుభవం ఉన్న వారికి రూ. 20 వేలకు పైగా నెల జీతం అందిస్తున్నారు. డిగ్రీ ఆధారంగా ప్రవేశించిన వారికి వేతనాలు కాసింత తక్కువగానే ఉంటాయి. అయితే తెలివి తేటలతో అడుగువేస్తే జీతాలు శరవేగంగా పెరగడం ఖాయం. స్టాక్ ఎనలిస్ట్‌లతోపాటు ఇటీవల కాలంలో ఇన్వెస్ట్‌మెంట్ ఎన లిస్ట్‌లకు అవకాశాలు పెరుగుతున్నాయి. మ్యూచ్యువల్ ఫండ్ సంస్థల్లో వీరికి అవకాశాలు లభిస్తాయి. ఏ షేర్లు కొనుగోలు చేస్తే.. ఏ మేరకు లాభాలుంటాయి? తద్వారా తమ సంస్థ జారీ చేసిన ఫండ్లు కొన్న వారికి ఎంత రాబడి ఉంటుంది? అనే అంశాలపై యాజమాన్యాలకు సలహాలిస్తారు.

స్టాక్ ఎనలిస్ట్‌గా స్థిరపడేందుకు ప్రత్యేక కోర్సులు అందిస్తున్న సంస్థలివే...
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్-ముంబై
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ ఆఫ్ డెవలప్‌మెంట్-న్యూఢిల్లీ
 వెబ్‌సైట్: www.utiicm.com

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ -ముంబై
  వెబ్‌సైట్: www.bseindia.com

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా
వెబ్‌సైట్: www.icsi.edu

వీటితోపాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు డిగ్రీ, పీజీ స్థాయిలో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్... పోర్ట్‌ఫోలియో విభాగాల్లో పలు కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి సాధారణంగా ప్రతి ఏటా జనవరి, మార్చి మధ్యలో ప్రకటనలు విడుదలవుతాయి.

Published date : 06 Jul 2012 03:53PM

Photo Stories