Skip to main content

కెరీర్ గైడెన్స్.. అకౌంటింగ్ టెక్నీషియన్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) రూపొందించిన నూతన కోర్సు ‘అకౌంటింగ్ టెక్నీషియన్ సర్టిఫికేషన్ కోర్స్(ఏటీసీ)’. అకౌంటింగ్ నిర్వహణలో విద్యార్థులకు పరిపూర్ణ అవగాహన కల్పించి... ఉద్యోగ సాధనలో వారిని విజేతలుగా నిలిపే లక్ష్యంతోనే ఈ కోర్సుకు ఐసీఏఐ రూపకల్పన చేసింది. సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, బిజినెస్ లా, కంపెనీ లా తదితర వ్యాపార సంబంధ అంశాలన్నిటిపై నా ఈ కోర్సు సమయంలో శిక్షణ ఇస్తారు.

సీఏ(చార్టర్డ్ అకౌంటెన్సీ)ను కెరీర్‌గా ఎంచుకున్న విద్యార్థి.. పదో తరగతి పూర్తికాగానే కామన్ ప్రొఫిషియెన్సీ టెస్ట్(సీపీటీ)కు పేరు నమోదు చేసుకోవాలి. ఇంటర్మీడియెట్‌తోపాటు సీపీటీకి హాజరై.. అందులోనూ ఉత్తీర్ణత సాధిస్తే తొలి దశ ముగిసినట్లే. అలా సీపీటీ పూర్తి చేసిన విద్యార్థులు... ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఎగ్జామినేషన్ (ఐపీసీసీ)కి పేరు నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత తొమ్మిది నెలల స్టడీ కోర్స్, 35 గంటల ఓరియెంటేషన్ కోర్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. ఈ ప్రక్రియ ముగి శాక.. ఐపీసీసీ గ్రూప్1 పరీక్షకు హాజరుకావాలి. ఇవి ప్రతి ఏటా మే, నవంబర్‌లలో ఉంటాయి. గ్రూప్1లో ఉత్తీర్ణత సాధించి.. ఒక ఏడాది ఆర్టికల్‌షిప్‌ను కూడా పూర్తి చేసుకుంటే అకౌంటింగ్ టెక్నిషియన్‌గా గుర్తింపు వస్తుంది. ఆ తర్వాత విద్యార్థి ఆసక్తిని బట్టి.. ఐపీసీసీ గ్రూప్-2లో చేరొచ్చు.అందులోనూ విజయం సాధిస్తే.. ఐపీసీసీ ఫైనల్ కోర్సులో ప్రవేశించవచ్చు. ఇది పూర్తయ్యాక.. చార్ట ర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడొచ్చు.

సీఏ పూర్తికాకపోయినా:
అకౌంటింగ్ టెక్నిషియన్ కోర్సుకు ప్రత్యేక కరిక్యులం, సిలబస్ లేదు. సీఏ కోర్సుతోనే దీన్ని అనుసంధానం చేశారు. ఇలా సీఏ తో అనుసంధానం చేయడం వల్ల.. ఐపీసీసీ ఉత్తీర్ణత సాధించలేక పోయినా.. అకౌంటింగ్ టెక్నిషియన్ సర్టిఫికెట్ సంపాదించుకునే అవకాశం లభిస్తుంది. ఫలితంగా ఉద్యోగ వేటలో ఇతరుల కంటే ముందుండొచ్చు. సీఏ కోర్సుకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు- ఐపీసీసీ (గతంలో ఇంటర్మీడియెట్, పీఈ, పీసీసీల స్థానంలో ఈ కొత్త స్కీంను ప్రవేశపెట్టారు) లోని గ్రూప్1లో ఉత్తీర్ణత పొంది... గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటెంట్ వద్ద ఆర్టికల్‌షిప్ పూర్తిచేస్తే.. అకౌంటింగ్ టెక్నిషియన్‌గా సర్టిఫికెట్ పొందవచ్చు.

కోర్సు స్వరూపం:
ఐపీసీసీ గ్రూప్1 లో మొత్తం నాలుగు పేపర్లుంటాయి. గ్రూప్2లో మూడు పేపర్లుంటాయి. గ్రూప్1లో... మొదటి పేపర్ అకౌంటిం గ్; రెండో పేపర్‌లో బిజినెస్ లా, కంపెనీ లా, బిజినెస్ ఎథిక్స్, కమ్యూనికేషన్స్; మూడో పేపర్‌లో కాస్ట్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్; నాలుగో పేపర్‌లో ఇన్‌కమ్‌ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ ఉంటాయి. ఈ నాలుగు పేపర్లలో ఉత్తీర్ణత సాధిస్తే.. అకౌం టింగ్ టెక్నిషియన్ కోర్సు పూర్తవుతుంది. ఐపీసీసీ దిశగా తొలి అంకం ముగుస్తుంది.

ఇతర అంశాలపైనా శిక్షణ:
కేవలం అకడమిక్ సబ్జెక్టులే కాకుండా.. ఉద్యోగ సాధనలో అవసరమయ్యే ఇతర అంశాలపైనా శిక్షణనిచ్చేవిధంగా ఐసీఏఐ కరిక్యులం రూపొందించింది. ఈ క్రమంలో 35 గంటల ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. ఇందులో పర్సనాలిటీ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆఫీస్ ప్రొసీజర్స్, బిజినెస్ ఎన్విరాన్‌మెంట్, జనరల్, కమర్షియల్ నాలెడ్జ్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ ప్రోగ్రాంలో.. కంప్యూటర్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలు, ఆఫీస్ డాక్యుమెంటేషన్ తదితర అంశాలపై సాంకేతిక శిక్షణనిస్తారు.

ఇప్పటికే పీసీసీ కోర్సులో పేరు నమోదు చేసుకున్న విద్యార్థి... ఐపీసీసీకి మారొచ్చు. www.icai.org నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని నిర్దేశిత ఫీజుతో పీసీసీ నుంచి ఐపీసీసీకి మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఉదాహరణకు 2009, నవంబరులో ఐపీసీసీ పరీక్షలు రాయాలనుకున్న పీసీసీ విద్యార్థి... 2009, జనవరి 31లోపు ఐసీఏఐకి దరఖాస్తు చేసుకోవాలి. అదేవిధంగా 2010, మే పరీక్షల కోసం... 2009, జులై 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పీసీసీ విధానంలో ఎంతకాలం ఆర్టికల్స్ అసిస్టెంట్‌గా పనిచేశారనే విషయంతో సంబంధం లేకుండా.. ఐపీసీసీకి మారిన విద్యార్థి కనీసం 9 నెలల స్టడీ కోర్సు పూర్తిచేయాలి. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ కూడా చేయాలి. ఆ తర్వాతే గ్రూప్ 1, గ్రూప్ 2లకు హాజరయ్యేందుకు వీలుంటుంది.

ఎంతో అనువైంది:
ఐపీసీసీ (ఇంటిగ్రేటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ ఎగ్జామినేషన్), ఏటీసీ (అకౌంటింగ్ టెక్నిషియన్ సర్టిఫికేషన్) విధానాలు విద్యార్థులకు ఎంతో అనువైనవి. గతంలో మూడున్నరేళ్లున్న ఆర్టికల్‌షిప్... ఇప్పుడు మూడేళ్లే. ఐపీసీసీ గ్రూప్ 2లో పేరు నమోదు చేసుకోగానే.. ఆర్టికల్‌షిప్ కోసం పేరు నమోదు చేసుకోవచ్చు. గత విధానం ప్రకారం...పీఈ-2, పీసీసీ కోర్సుల్లో ప్రవేశించిన విద్యార్థులు కూడా కొత్త విధానంలోకి మారేందుకు అవకాశం ఉంది. కేవలం అకౌంటింగ్ కోర్సు మాత్రమే కాకుండా.. మరెన్నో షార్ట్‌టర్మ్ కోర్సులను కూడా ఐసీఏఐ నిర్వహిస్తోంది. కార్పొరేట్ గవర్నెన్స్, హెచ్‌ఆర్‌డీ, ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్, మెర్జర్స్ అండ్ అమాల్గమేషన్స్, స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ వాటిలో కొన్ని.

అవకాశాలు:
ఆడిటర్లుగా, టాక్స్ కన్సల్టెంట్లుగా, ఫైనాన్షియల్ కన్సల్టెంట్లుగా, పనిచేయొచ్చు. బ్యాంకింగ్, ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్‌లలో కన్సల్టెన్సీలుగా పని చేసే అవకాశం ఈ కోర్సు పూర్తి చేసిన వారికి లభిస్తుంది.

ఎప్పుడైనా రిజిస్ట్రేషన్:
ఐపీసీసీ/ఏటీసీ కోర్స్‌లకున్న మరో ప్రత్యేకత ఏడాదిలో ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం. జనవరి 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అదే సంవత్సరం నవంబర్‌లో జరిగే పరీక్షకు... జూన్ 30లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తర్వాతి ఏడాది మేలో జరిగే పరీక్షకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్‌కు, పరీక్షకు మధ్య తొమ్మిది నెలల స్టడీ కోర్సును పూర్తిచేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యవధిని తప్పనిసరిగా నిర్ణయించారు.
మరిన్ని వివరాలకు www.icaihyd.org 
  • గతంలోని ఇంటర్ పీఈ-2, పీసీసీ స్థానంలో ఐపీసీసీ ప్రవేశం
  • ఐపీసీసీ గ్రూప్-1 ఉత్తీర్ణత సాధిస్తే.. అకౌంటింగ్ టెక్నిషియన్ కోర్స్ సర్టిఫికెట్
  • ఐపీసీసీ గ్రూప్-1, 2, ఏటీసీ (మూడు కలిపి) ఫీజు రూ. పదివేలు
  • ఆర్టికల్ షిప్ కోసం అదనంగా మరో రెండు వేల రూపాయలు.
  • ఏడాది పొడవునా రిజిస్ట్రేషన్ సదుపాయం
  • ప్రతి ఏటా రెండుసార్లు పరీక్షలు
  • పేరు నమోదు.. పరీక్ష తేదీకి మధ్య తొమ్మిది నెలల వ్యవధి తప్పనిసరి
  • జూన్ 30 లోపు నమోదు చేసుకుంటే తదుపరి ఏడాది మే పరీక్షలకు.. ఫిబ్రవరి 28లోపు నమోదు చేసుకుంటే అదే ఏడాది నవంబర్ పరీక్షలకు హాజరయ్యే అవకాశం
Published date : 19 Mar 2012 02:28PM

Photo Stories