Skip to main content

ఐఐటీల్లో హ్యూమానిటీస్ కోర్సులు

దేశంలో సాంకేతిక విద్యకు తలమానికం.. ఐఐటీలు. ఇంజనీరింగ్ విద్యను అందించడంలోప్రపంచ వినుతికెక్కిన ఈ విద్యా సంస్థలు.. మారుతున్న ఒరవడికి అనుగుణంగా తమ పంథాను మార్చుకుంటున్నాయి.. విద్యార్థి తాను చదువుతున్న డిగ్రీకే పరిమితం కాకుండా.. తన చుట్టూ ఉన్న సమాజాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా రూపొందించే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాయి.. ఈ ఆలోచనల్లోంచే ఐఐటీలు తమ కరిక్యులంలో సాంకేతిక అంశాలతోపాటు సామాజిక విషయాలకు పెద్ద పీట వేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఐఐటీలు అందిస్తున్న హ్యూమానిటీస్ కోర్సులు, సంబంధిత అంశాలపై విశ్లేషణ..

ప్రస్తుత విద్యా రంగంలో ఎటు చూసినా ప్రొఫెషనల్ కోర్సుల హవా కొనసాగుతుంది. దాంతో విద్యార్థులు తమ ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకే పరిమితమవుతున్నాడు. చుట్టూ ఉన్న ప్రపంచం, చరిత్ర, వారసత్వ సంపద, మానవ సంబంధాలు.. సమాజం పరంగా తన బాధ్యత వంటి అంశాలే విద్యార్థిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. ఈ ప్రాముఖ్యాన్ని గుర్తించిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు హ్యూమానిటీస్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటితోపాటు బిట్స్-పిలానీ, నిట్‌లు కూడా ఇంగ్లిష్, సైకాలజీ, ఎకనామిక్స్, ఫిలాసఫీ, సోషియాలజీ వంటి కోర్సులను బోధిస్తున్నాయి.

ఆలోచన వెనక:
కొత్తగా వస్తున్న సాంకేతిక మార్పులతో ప్రపంచమంతా యాంత్రికంగా మారుతోంది. ఈ నేపథ్యంలో..చుట్టూ ఉన్న సమాజాన్ని, మానవ సంబంధాలను అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూఎస్ లిబరల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మాదిరిగా.. డిస్క్రిప్టివ్(Descriptive), నార్మేటివ్ (Normative) అంశాలకు విద్యా వ్యవస్థలో ప్రాధాన్యం ఉండాలి. ఈ ఆలోచనే ఐఐటీలతోపాటు ఇతర టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో హ్యూమానిటీస్ కోర్సులు ప్రారంభానికి దోహదం చేసింది. హ్యూమానిటీస్ కోర్సులు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాం? మన చరిత్ర ఏమిటి? చుట్టూ ఉన్న ప్రజలతో మనకున్న సంబంధం? సామాజిక బాధ్యత? ఏవిధంగా ఒక సమాజంగా మనుగడ సాగించాలి? వంటి అంశాలను తెలుసుకోవడం ద్వారా పరిపూర్ణ మూర్తిమత్వానికి పునాది వేసుకోవడం.. హ్యూమానిటీస్ కోర్సులతోనే సాధ్యం. ఐఐటీలను మొదట ప్రారంభించినప్పుడు.. దేశం ఒక అత్యున్నత సాంకేతిక సమాజంగా రూపుదిద్దుకోవాలని అప్పటి విధాన నిర్ణేతలు భావించారు. కాబట్టి అప్పట్లో హ్యూమానిటీస్ కోర్సులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. సమాజం నిరంతరం మార్పు దిశగా పయనిస్తున్న క్రమంలో హ్యూమానిటీస్ అంశాలకు కూడా ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా అన్ని విభాగాలకు చెందిన విద్యార్థులకు ఐఐటీని చేరువ చేయాలనే ఉద్దేశం కూడా ఈ నిర్ణయం వెనక దాగి ఉంది.

పరిధి:
హిస్టరీ, ఎకనామిక్స్, డెవలప్‌మెంట్ స్టడీస్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, లిటరేచర్, లా, సోషియాలజీ, రిలీజియన్, కల్చర్, ఆర్ట్స్, అంత్రోపాలజీ, కమ్యూనికేషన్, సైకాలజీ వంటి సబ్జెక్టులు హ్యూమానిటీస్ కోర్సుల పరిధిలోకి వస్తాయి. వీటిల్లో ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ సబ్జెక్ట్‌లను దాదాపు అన్ని ఐఐటీలు, బిట్స్-పిలానీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం) ఆఫర్ చేస్తున్నాయి.

కరిక్యులంలో భాగంగా:
ప్రస్తుతం బీటెక్ విద్యార్థి కేవలం తన సబ్జెక్ట్‌కు మాత్రమే పరిమితమైతే సరిపోదు. తన చుట్టూ ఉన్న ప్రపంచం, ఎంచుకున్న రంగంలో సాంఘికంగా, ఆర్థికంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనించడం తప్పనిసరి. అంతేకాకుండా వివిధ రకాల మనస్తత్వం, విభిన్న సంస్కృతుల నేపథ్యం ఉన్న వ్యక్తులతో ఏవిధంగా వ్యవహరించాలో అవగాహన ఏర్పర్చుకోవాలి. చరిత్ర, సాహిత్యం మీద కూడా ఆసక్తి ఉండడం కూడా చాలా అవసరం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వీటి ప్రాముఖ్యతను గుర్తించిన టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లు ఈ అంశాలను సిలబస్‌లో భాగంగా ఆఫర్ చేస్తున్నాయి. తదనుగుణంగా.. సోషియాలజీ, ఫిలాసఫీ, సైకాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లిష్, ఫారెన్ లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ వంటి అంశాలకు కరిక్యులంలో చోటు కల్పించాయి. ఈ క్రమంలో అన్ని ఐఐటీల్లో హ్యూమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ విభాగం కనిపిస్తుంది.

ఇంటర్ డిసిప్లినరీగా:
కొన్ని ఐఐటీలు హ్యూమానిటీస్ అంశాలను రెగ్యులర్ కరిక్యులంలో తప్పనిసరిగా చేస్తే.. కొన్ని అంశాలను మాత్రం ఐచ్ఛికంగా ఆఫర్ చేస్తున్నాయిు. తద్వారా ఒక టెక్నికల్ విద్యార్థి కేవలం తన రంగానికి పరిమితం కాకుండా చుట్టూ ఉన్న ప్రపంచంపై అవగాహన పెంచుకునేందుకు తోడ్పడుతున్నాయి. ఉదాహరణకు ఐఐటీ-కాన్పూర్ బ్యాచిలర్ స్థారుులో ప్రత్యేకంగా బీఎస్-ఎకనామిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది. అదే ఐఐటీ-ఢిల్లీ విషయానికొస్తే.. ఎకనామిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ అంశాలను అందిస్తుంది. ఇవి ఐచ్ఛికం. వీటిని ఇంటర్‌డిసిప్లినరీ పద్ధతిలో బోధిస్తుంది. ఇదే ఇంటర్‌డిసిప్లినరీ విధానాన్ని దాదాపు అన్ని ఐఐటీలు అనుసరిస్తున్నాయి. దాదాపు అన్ని ఐఐటీలు హ్యూమానిటీస్ కోర్సులను పీజీ, పీహెచ్‌డీ విభాగాల్లో అందిస్తుండడం విశేషం.

తప్పనిసరి:
దేశంలో సంస్కరణల ఫలితంగా ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ భాగస్వామ్యం, గ్లోబలైజేషన్ ఫలితంగా హ్యూమానిటీస్, సోషల్ సెన్సైస్ కోర్సుల ప్రాముఖ్యత అటు అకడమిక్, ప్రొఫెషనల్ రెండిటి పరంగాను పెరిగింది. అంతర్జాతీయ సంస్థలు దేశంలో పరిశ్రమలు నెలకొల్పుతుండడంతో.. అందులో పని చేసే అభ్యర్థులకు టెక్నికల్ నాలెడ్జ్‌తోపాటు సంబంధిత ఆర్థిక అంశాలపై అవగాహన ఉండడం తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్, మాక్రోఎకనామిక్స్, మేనేజీరియల్ ఎకనామిక్స్ వంటి అంశాలను బోధిస్తున్నారు. వివిధ రకాల వ్యక్తులతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి వారి మనస్తత్వాలకనుగుణంగా వ్యవహరించడానికి తోడ్పడే.. వర్క్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ కోసం సోషియాలజీ, సైకాలజీ అంశాలకు కరిక్యులంలో చోటు కల్పించారు. సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కోసం హిస్టరీ, లింగ్విస్టిక్స్ ఉపాధి కోసం ఎల్లలు దాటి వెళుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం ఇంగ్లిష్ భాషపై అవగాహన ఉంటే సరిపోదు. ఏదైనా ఒక ఫారెన్ లాంగ్వేజ్ ఉండడం అవకాశాలను విస్తృతం చేస్తుంది. దానికి తోడు కొన్ని స్వదేశీ కంపెనీలు విదేశాల్లో కూడా వ్యాపారాన్ని ప్రారంభిస్తుండడంతో ఫారెన్ లాంగ్వేజ్ తెలిసి ఉండడం తప్పనిసరిగా మారింది. అన్నిటి కంటే చుట్టూ ఉన్న సమాజాన్ని, మానవ సంబంధాలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కోసం ఫిలాసఫీని కూడా బోధిస్తున్నారు.

ప్రవేశం:
బ్యాచిలర్/ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ స్థాయిలో ఉండే కోర్సులకు జేఈఈ-అడ్వాన్స్‌డ్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ మద్రాస్ మాత్రం.. హ్యూమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (హెచ్‌ఎస్‌ఈఈ) ఆధారంగా అడ్మిషన్లను చేపడుతుంది. 2014 సంవత్సరానికి హెచ్‌ఎస్‌ఈఈ నోటిఫికేషన్ వెలువడింది. పీహెచ్‌డీ, ఎంఫిల్, పీజీ కోర్సుల ప్రవేశ వివరాలను ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల వెబ్‌సైట్ నుంచి పొందొచ్చు.

కొన్ని ఐఐటీలు బోధిస్తున్న అంశాలు
ఐఐటీ-ఇండోర్
Bavitha
ఇంగ్లిష్, సైకాలజీ, ఫిలాసఫీ, ఎకనామిక్స్ (బీటెక్ కోర్సులో భాగంగా).
పీహెచ్‌డీ.
వెబ్‌సైట్: www.iiti.ac.in



ఐఐటీ-మద్రాస్
Bavitha
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఇంటిగ్రేటెడ్ ఎంఏ (డెవలప్‌మెంట్ స్టడీస్, ఇంగ్లిష్ స్టడీస్)
అర్హత: 10+2/తత్సమానం.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
రాత పరీక్ష: పేపర్-1, పేపర్-2 అనే రెండు పేపర్లుగా ఉంటుంది. పేపర్-1ను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్, అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్‌ఎబిలిటీ, జనరల్ స్టడీస్, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎకాలజీ వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. సమాధానాలను గుర్తించడానికి 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-2 డిస్క్రిప్టివ్‌గా ఉంటుంది. ఇందులో నిర్దేశించిన అంశంపై వ్యాసం రాయాలి. 30 నిమిషాల సమయం కేటాయించారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 18, 2013.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ముగింపు: జనవరి 17, 2014.
పరీక్ష ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జనవరి 24, 2014
పోస్ట్ ద్వారా దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ:
జనవరి 27, 2014
పరీక్ష తేదీ: ఏప్రిల్ 20, 2014.
వివరాలకు: hsee.iitm.ac.in

ఐఐటీ-ఢిల్లీ
Bavitha
అండర్ గ్రాడ్యుయేట్ (ఇంటర్ డిసిప్లినరీ ఓరియెంటేషన్‌లో.. ఎకనామిక్స్, ఇంగ్లిష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ), పీహెచ్‌డీ.
వెబ్‌సైట్: www.iitd.ac.in




ఐఐటీ-గాంధీనగర్
Bavitha
ఎకనామిక్స్, ఫిలాసఫీ, వరల్డ్ సివిలైజేషన్/హిస్టరీ తదితరాలు (బీటెక్ కోర్సులో భాగంగా).
పీహెచ్‌డీ (ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, ఇంగ్లిష్)
వెబ్‌సైట్: www.iitgn.ac.in



ఐఐటీ-మండి
Bavitha
కమ్యూనికేషన్, జర్మన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్, పొలిటికల్ ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ (బీటెక్ కోర్సులో భాగంగా). పీహెచ్‌డీ-పబ్లిక్ పాలసీ, పొలిటికల్ ఫిలాసఫీ, తదితర.
వెబ్‌సైట్: www.iitmandi.ac.in

ఐఐటీ-బాంబే
Bavitha
బ్యాచిలర్ (బీటెక్ కోర్సులో భాగంగా-ఇంటర్ డిసిప్లినరీ ఓరియెంటేషన్‌లో ఎలెక్టివిస్‌గా).. ఎకనామిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ తదితరాలు. ఎంఫిల్-డెవలప్‌మెంట్ స్టడీస్, పీహెచ్‌డీ.
వెబ్‌సైట్: www.iitb.ac.in

Published date : 12 Dec 2013 03:39PM

Photo Stories