Skip to main content

ఇంజనీరింగ్ సెట్స్.. ఎఫ్‌ఏక్యూస్

ఇంజనీరింగ్ చదవాలని ఆకాంక్షించే వారిలో ఎక్కువ మంది ఎంసెట్ లేదా జేఈఈ మీదే దృష్టి కేంద్రీకరిస్తారు. మంచి కాలేజీలో, నచ్చిన కోర్సులో చేరేందుకు ఎంతగానో శ్రమిస్తారు. ఈ ఎంట్రన్స్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా పోటీ కూడా అధికంగానే ఉంటోంది. తీవ్రంగా కష్టించినప్పటికీ నచ్చిన కాలేజీలో సీటును తృటిలో కోల్పోయేవారెందరో! ఎంసెట్, జేఈఈలో సరైన ర్యాంక్ రాకపోయినా, అదే స్థాయి ప్రమాణాలతో బీటెక్ కోర్సులను ఆఫర్ చేసే విద్యాసంస్థలు దేశంలో చాలానే ఉన్నాయి. ఆయా కాలేజీలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధిస్తే.. ఐఐటీలకు దీటైన ఇన్‌స్టిట్యూట్‌లలో సీటు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్షలు, వీటికి సంబంధించి విద్యార్థుల్లో తలెత్తే సందేహాల నివృత్తి కోసం సమాధానాలివిగో..
ప్ర: తెలంగాణ ఎంసెట్ ముఖ్య తేదీలు?
జ:
తెలంగాణ రాష్ట్రంలో మే 2న ఎంసెట్ నిర్వహిస్తున్నారు. ఇంజనీరింగ్‌లో ప్రవేశం కోసం ఉదయం రాత పరీక్ష జరుగుతుంది. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 160 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.tseamcet.in

ప్ర: ఏపీ ఎంసెట్ ముఖ్య తేదీలు?
జ:
ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 29న జరగనుంది. దరఖాస్తు గడువు మార్చి 21తో ముగిసింది. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష స్వరూపం టీఎస్ ఎంసెట్ మాదిరిగానే ఉంటుంది.
వెబ్‌సైట్: www.apeamcet.org

ప్ర: బీటెక్ కోర్సులో ప్రవేశానికి ఎంసెట్, జేఈఈలే మార్గమా?
జ:
బీటెక్ కోర్సులో ప్రవేశానికి ఎంసెట్, జేఈఈలతోపాటు అనేక ప్రముఖ సంస్థలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లు లేదా ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయిలో అడ్మిషన్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. వాటిలో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఎంసెట్ ద్వారా రాష్ట్ర స్థాయిలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో, జేఈఈ మెయిన్ ద్వారా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడుగు పెట్టొచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశం లభిస్తుంది.

ప్ర: ఎంసెట్, జేఈఈ తర్వాత ప్రముఖంగా నిలిచే ఎంట్రన్స్?
జ:
ఈ విషయంలో ఇతర ఇన్‌స్టిట్యూట్‌లతో పోల్చితే బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) నిర్వహించే బిట్‌శాట్‌కు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ఈ పరీక్షకు హాజరు కావాలంటే 75 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ గ్రూప్ చదివి ఉండాలి.

ప్ర: బిట్‌శాట్ స్వరూపం ఎలా ఉంటుంది?
జ:
ఇది ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీలలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి 40 ప్రశ్నల చొప్పున అడుగుతారు. మ్యాథమెటిక్స్ నుంచి 45 ప్రశ్నలు, లాజికల్ రీజనింగ్ విభాగం నుంచి 10; ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ నుంచి 15 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. బిట్‌శాట్‌లో ర్యాంకు పొందిన విద్యార్థులకు బిట్స్- పిలానీ, గోవా, హైదరాబాద్, మెస్రా క్యాంపస్‌లలో సీట్లు కేటాయిస్తారు. రాష్ట్రాల స్థాయిలో ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షల్లో టాప్ ర్యాంకు సాధించిన వారికి నేరుగా ప్రవేశం కల్పిస్తారు.

ప్ర: వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశం ఎలా?
జ:
వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏటా గఐఖీఉఉ పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్ష మొత్తం మూడు విభాగాల్లో (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) లో 120 మార్కులకు ఉంటుంది. ఈ సంస్థ కూడా జాతీయ స్థాయిలో పరీక్ష నిర్వహిస్తోంది.

ప్ర: ఎస్‌ఆర్‌ఎం జేఈఈ అంటే?
జ:
చెన్నైలోని శ్రీరామచంద్ర యూనివర్సిటీ బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఎస్‌ఆర్‌ఎం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎస్‌ఆర్‌ఎంజేఈఈ)ను నిర్వహిస్తోంది. ఇంటర్మీడియెట్ ఎంపీసీలో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి 35 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఈ ఎంట్రన్స్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌తోపాటు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న మరో అయిదు ప్రాంగణాల్లో దాదాపు 7,500 సీట్లు భర్తీ చేస్తారు.

ప్ర: కొమెడ్క్ యూజీఈటీ ఉద్దేశం?
జ:
కర్ణాటకకు చెందిన ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల యాజమాన్యాలు సంయుక్తంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నాయి. అదే కన్సార్షియం ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక అండ్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (కొమెడ్క్ యూజీఈటీ). ఈ పరీక్షలో ర్యాంకు ద్వారా ప్రైవేట్ మెడికల్, ఇంజనీరింగ్, డెంటల్ కళాశాలల్లోని మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ చేస్తారు. ఎంట్రన్స్ ఆబ్జెక్టివ్ విధానంలో మూడు విభాగాల్లో (మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) 180 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష ద్వారా దాదాపు 21 వేల సీట్లు భర్తీ చేస్తారు. ఫీజులు, సీట్ల రిజర్వేషన్ వివరాలను కౌన్సెలింగ్ సమయంలో వెల్లడిస్తారు. ప్రస్తుతం కొమెడ్క్ యూజీఈటీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి తేదీ ఏప్రిల్ 4.
వివరాలకు వెబ్‌సైట్: www.comedk.org

ప్ర: మణిపాల్ అకాడమీలో బీటెక్ అవకాశాలున్నాయా?
జ:
బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి మణిపాల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పేరుతో ఆ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తోంది. 50శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది మార్చి 28.
వివరాలకు వెబ్‌సైట్: manipal.edu/mu.html

ప్ర: తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ కాకుండా ఇతర ఎంట్రన్స్‌లు ఏమైనా ఉన్నాయా?
జ: ప్రభుత్వ యూనివర్సిటీల కళాశాలలు, అనుబంధ ప్రైవేట్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం తెలుగు రాష్ట్రాలు నిర్వహించే ఎంసెట్ నిర్వహిస్తున్నాయి. ఇవి కాకుండా డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపు పొందిన గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీలు వాటి పరిధిలోని ఇంజనీరింగ్ సీట్లకు వేర్వేరుగా ఎంట్రన్స్ టెస్టులు నిర్వహిస్తున్నాయి.

ప్ర: గీతం, కేఎల్ యూనివర్సిటీల ప్రవేశ పరీక్షల వివరాలు?
జ:
గీతం యూనివర్సిటీ గీతం అడ్మిషన్ టెస్ట్ పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్ ఉత్తీర్ణులు అర్హులు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది.
ఈ పరీక్షలో ర్యాంకు ఆధారంగా గీతం విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో బీటెక్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి తేదీ ఏప్రిల్ 2.
వివరాలకు వెబ్‌సైట్: www.gitam.edu/gitadmissions.aspx
కేల్ యూనివర్సిటీ బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి కేఎల్‌యూఈఈఈ పేరుతో పరీక్ష నిర్వహిస్తోంది. ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి తేదీ ఏప్రిల్ 17. 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్ ఉత్తీర్ణులు అర్హులు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో మొత్తం 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో మే 13, 14 తేదీల్లో, ఆఫ్‌లైన్ విధానంలో ఏప్రిల్ 24న పరీక్ష నిర్వహిస్తారు.
వివరాలకు వెబ్‌సైట్: www.kluniversity.in

ప్ర: ఐఐఎస్‌ఈఆర్‌లో బీటెక్ చదివే అవకాశం ఉందా?
జ:
ఉన్నత ప్రమాణాలతో కూడిన సాంకేతిక విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర మానవ వనరుల విభాగం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ను నెలకొల్పింది. ఇవి బీటెక్ కోర్సును అందించడం లేదు. కానీ అయిదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సును అభ్యసించొచ్చు. మొత్తం 1120 సీట్లు అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ లేదా కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఉత్తీర్ణులకు 50 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగతా 50 శాతం సీట్ల భర్తీకి ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తోంది.
వివరాలకు వెబ్‌సైట్: www.iiseradmission.in

ప్ర: తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పిన జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ప్రత్యేక కోటా ఏమైనా ఉంటుందా?
జ:
ఎన్‌ఐటీల్లో 50 శాతం సీట్లను సంబంధిత ఎన్‌ఐటీ ఉన్న రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తారు. దీన్ని హోం స్టేట్ కోటా అని పేర్కొంటారు. ఇవి తప్ప ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల సీట్ల భర్తీలో హోం స్టేట్ కోటా ఉండదు. అభ్యర్థులు జాతీయ స్థాయి పరీక్షలో ర్యాంకు పొందాల్సిందే.

ప్ర: ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో రాణించడానికి ఉపకరించేవి?
జ:
పరీక్షలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలోని బేసిక్ కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. భిన్న కోణాల్లో సమస్యను పరిష్కరించే విధంగా అప్లికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి.

ప్ర: జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రిపరేషన్‌తో అన్ని పరీక్షలకు సన్నద్ధం కావొచ్చా?
జ:
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానం మేరకు అందులో పేర్కొన్న అంశాలు అన్ని పరీక్షల్లోనూ కవర్ అవుతాయి. రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో మాత్రం కొద్దిపాటి తేడాలు ఉంటాయి. ఆయా రాష్ట్రాల బోర్డు సిలబస్‌కు అనుగుణంగా పరీక్ష సిలబస్ ఉంటుంది. విద్యార్థులు తాము హాజరవుతున్న పరీక్షకు సంబంధించి సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించి జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్‌తో బేరీజు వేసుకోవాలి.

ప్ర: సెల్ఫ్ అసెస్‌మెంట్ కోణంలో ఉపకరించే మార్గాలు?
జ:
అభ్యర్థులు ప్రతి రోజు రివిజన్ చేయాలి. చదవడానికి ఉపక్రమించే ముందు.. అంతకుముందు రోజు చదివిన అంశాల పునశ్చరణకు కనీసం పది నిమిషాలు కేటాయించాలి. ప్రతి వారం సబ్జెక్ట్ వారీగా మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లు రాయాలి. పరీక్షకు నెల రోజుల ముందు వ్యవధిలో కనీసం నాలుగైదు గ్రాండ్ టెస్ట్‌లకు హాజరైతే మరింత ఉపయుక్తంగా ఉంటుంది.

ప్ర: ఒక అభ్యర్థి తన సొంత రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లకు పోటీ పడొచ్చా?
జ:
పోటీ పడొచ్చు. కానీ సీట్ల రిజర్వేషన్ పరంగా ఎలాంటి ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓపెన్ కేటగిరీలో ఉండే 15 శాతం సీట్లకే ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడే వీలుంది.

ప్ర: ఎంట్రన్స్‌లో ర్యాంకు ఆధారంగా సీటు పొందిన విద్యార్థులకు ఉపకారవేతనాలు లభిస్తాయా?
జ:
స్కాలర్‌షిప్‌లు, ఫీజు రాయితీ అనేవి సదరు పరీక్షలు నిర్వహించే విద్యాసంస్థలు లేదా ప్రభుత్వాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇతర ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు మెరిట్ కమ్ మీన్స్ అసిస్టెన్స్ పేరుతో 100 శాతం నుంచి 25 శాతం వరకు ఫీజు రాయితీ కల్పిస్తున్నాయి. ఇవి అభ్యర్థులు కుటుంబ వార్షికాదాయం విషయంలో నిబంధనలు అమలు చేస్తున్నాయి.
Published date : 24 Mar 2016 03:37PM

Photo Stories