Skip to main content

సీఏ-సీపీటీలో విజయానికిమార్గాలు...

చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సు తొలిదశ పరీక్ష సీఏ-సీపీటీ జూన్ 16న జరగనుంది. విద్యార్థుల సుదీర్ఘ ప్రణాళికాయుత సన్నద్ధత చివరి దశకు చేరింది.
 సీపీటీ విధానంలో నిర్వహించే తుది పరీక్ష ఇదే కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో తుదిదశ సన్నద్ధతకు ఉపయోగపడేలా సూచనలు...
  • 2019, జూన్ 16న ఉదయం అకౌంట్స్, మర్కంటైల్ లా సబ్జెక్టులకు మధ్యాహ్నం ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టులకు పరీక్ష జరుగుతుంది. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటి వరకు ప్రిపరేషన్‌కు ఏ మెటీరియల్‌ను ఉపయోగించారో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు కూడా అదే మెటీరియల్‌ను వినియోగించాలి. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మెటీరియల్‌ను ప్రామాణికంగా తీసుకోవాలి.
  • మర్కంటైల్ లా, అకౌంట్స్ సబ్జెక్టులు చాలా ముఖ్యమైనవి. వీటిపై పూర్తిస్థాయిలో పట్టుసాధించడం ద్వారా సీపీటిని దిగ్విజయంగా పూర్తిచేయొచ్చు.
  • రోజుకు కనీసం పది గంటలను రివిజన్‌కు కేటాయించాలి. బాగా తెలిసిన ఎంసీక్యూలను కొట్టేస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. దీనివల్ల ఆ ఎంసీక్యూస్‌ను మళ్లీ చదవాల్సిన అవసరం ఉండదు. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
  • భావనలను అర్థం చేసుకుంటూ ఎంసీక్యూస్ చదవాలి. అంతేతప్ప బట్టీపట్టకూడదు. సబ్జెక్టు పరంగా ఏవైనా సందేహాలుంటే తప్పనిసరిగా నిపుణుల సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
  • సీపీటీలో ఉత్తీర్ణత సాధించాలంటే 200 మార్కులకు 100 మార్కులు సాధించడంతో పాటు ప్రతి సబ్జెక్టులో 30 శాతం మార్కులు తెచ్చుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని రివిజన్‌లో అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యమివ్వాలి.
  • ప్రిపరేషన్ సమయంలో ఉపయోగించిన క్యాలిక్యులేటర్‌నే అసలు పరీక్షకు తీసుకెళ్లాలి. రోజుకు కనీసం అరగంటైనా క్యాలిక్యులేటర్ స్పీడ్ టైపింగ్‌ను ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్‌ను ఉపయోగించకూడదు.
సబ్జెక్టుల వారీ ముఖ్యాంశాలు..
అకౌంట్స్:
  • అకౌంట్స్ సబ్జెక్టు సీపీటీలో ప్రారంభమై ఫైనల్ వరకు ప్రతి దశలోనూ ఉంటుంది. అందువల్ల ప్రతి అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సీపీటీలో అధిక మార్కులు పొందేందుకు అవకాశమున్న సబ్జెక్టు ఇది.
  • అకౌంట్స్‌లో జర్నల్ ఎంట్రీస్ చాలా ముఖ్యమైనవి. ప్రతి చాప్టర్‌లోనూ జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. ఈ సబ్జెక్టులోని ఏ అంశాన్నీ బట్టీపట్టకూడదు. ప్రతి అంశంపై తార్కిక ఆలోచనా దృక్పథం అలవరచుకోవాలి.
  • ఇప్పటికే జర్నల్ ఎంట్రీస్‌ను ఒక పుస్తకంలో రాసుకున్నట్లయితే వాటిని పునశ్చరణ చేయాలి.
  • అకౌంట్స్‌లో పార్టనర్‌షిప్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్ అండ్ అకౌంటింగ్ యాన్ ఇంట్రడక్షన్, ఫైనల్ అకౌంట్స్, కన్‌సైన్‌మెంట్ అకౌంట్స్ ముఖ్యమైనవి.
మర్కంటైల్ లా..
  • ఇంటర్మీడియెట్‌లో ఏ గ్రూపు చదివిన వారికైనా ఇది కొత్త సబ్జెక్టే. పరీక్షలో ఈ సబ్జెక్టు నుంచి ప్రతి ప్రశ్నా డొంకతిరుగుడు లేకుండా నేరుగా వస్తుంది.
  • సబ్జెక్టులోని ప్రతి అంశానికి సంబంధించి అర్థవివరణ నైపుణ్యం పెంచుకోవాలి. ఇది వివాదాలతో కూడుకున్న సబ్జెక్టు కాబట్టి ప్రతి ఎంసీక్యూను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉండదు.
  • సీపీటీ పరిధిలో సెక్షన్ నంబర్లు, కేస్‌స్టడీస్, ఆథర్ పేర్లు, నిర్వచనాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
  • identify the correct/the correct/ incorrect/ all of the above/none of the above questions ఉంటాయి. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  • ఇందులో ఇండియన్ పార్టనర్‌షిప్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ముఖ్యమైనవి.
  • కొంచెం శ్రమిస్తే మర్కంటైల్ లాలో 40 మార్కులకు 32-35 మార్కులను తేలిగ్గా సాధించొచ్చు.
ఎకనామిక్స్ :
  • ఎకనామిక్స్ సబ్జెక్టును రెండు భాగాలుగా విభజించొచ్చు. అవి..1. మైక్రో ఎకనామిక్స్; 2. మ్యాక్రో ఎకనామిక్స్.
  • పాత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ఈ సబ్జెక్టు నుంచి వస్తున్న ప్రశ్నల్లో 15-20 ప్రశ్నలు తేలిగ్గా, నేరుగా వస్తున్నట్లు అర్థమవుతోంది.
  • ఇందులోని అన్ని చాప్టర్లకు సమాన ప్రాధాన్యమివ్వాలి. డయాగ్రమ్స్, డెఫినిషన్స్, ఆథర్ పేర్లను గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు.
  • మైక్రో ఎకనామిక్స్‌లో ప్రాబ్లమ్స్‌ను ఒకటికి రెండుసార్లు చదివి, అర్థం చేసుకొని సమాధానం గుర్తించాలి. మైక్రో ఎకనామిక్స్‌లోని డయాగ్రమ్స్‌ను విశ్లేషించగలగాలి.
  • మ్యాక్రో ఎకనామిక్స్‌లో ఫ్యాక్ట్స్, ఫిగర్స్ (సంవత్సరాలు, శాతాలకు సంబంధించిన సమాచారం) చాలా ముఖ్యమైనవి.
  • మైక్రో ఎకనామిక్స్‌లో థియరీ ఆఫ్ కన్స్యూమర్ బిహేవియర్, కాస్ట్ అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, ప్రైస్ అండ్ అవుట్‌పుట్ డిటర్మినిషన్ ముఖ్యమైనవి.
క్వాంటిటేటివ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ :
  • మ్యాథమెటిక్స్‌లోని ఫార్ములాలు చాలా ముఖ్యమైనవి. సీఈసీ విద్యార్థులు ఎంసీక్యూస్‌ను ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాలి. అన్ని చాప్టర్లకు సమాన ప్రాధాన్యమివ్వాలి.
  • ప్రతి చాప్టర్‌లోని సమస్యలను ప్రాక్టీస్ చేశాక, ఆ సమస్యలకు సంబంధించిన సూత్రాలను ఒకటికి రెండుసార్లు చూడకుండా రాయాలి.
  • లిమిట్స్, డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, మ్యాథమెటిక్స్ ఆఫ్ ఫైనాన్స్ ముఖ్యమైన అంశాలు.
  • స్టాటిస్టిక్స్‌లోని ఫార్ములాలు దగ్గరి పోలికలు కలిగి ఉంటాయి. అందువల్ల సూత్రాల మధ్య వైవిధ్యాన్ని గుర్తించాలంటే తప్పనిసరిగా ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి. స్టాటిస్టిక్స్‌లో సమస్యలతో పాటు సైద్ధాంతిక అంశాలకు కూడా ప్రాధాన్యమివ్వాలి. 35-45 శాతం ఎంసీక్యూలు థియరీ నుంచి వచ్చేందుకు అవకాశముంది.
  • స్టాటిస్టిక్స్‌లో ప్రాబబిలిటీ, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్, శాంప్లింగ్, స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా చాప్టర్లు ముఖ్యమైనవి.
  • మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌లో అత్యధిక వెయిటేజీ ఉన్న చాప్టర్లకు ఎక్కువ సమయం కేటాయించాలి.
మోడల్ టెస్ట్‌లతో మేలు...
 ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో మోడల్ పరీక్షలు రాయాలి. కనీసం పది మోడల్ టెస్ట్‌లు రాయడం వల్ల పూర్తిస్థాయి సన్నద్ధత లభిస్తుంది. ఈ పరీక్షల ద్వారా తప్పులను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. మైండ్‌మ్యాప్స్‌ను రూపొందించుకొని పునశ్చరణకు ఉపయోగించుకోవాలి. గత ప్రశ్నపత్రాలను లోతుగా, వ్యూహాత్మకంగా పరిశీలిస్తే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనేది అర్థమవుతుంది. నిరంతర ప్రాక్టీస్‌తోనే సమస్యలకు సరైన సమాధానాలు గుర్తించగలరు. అందువల్ల ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమివ్వాలి.
  - సాయికృష్ణ, సీఏ-సీపీటీలో 197 మార్కులు సాధించిన విద్యార్థి.
 
 ఒత్తిడిని దరిచేరనీయొద్దు: 
 రివిజన్ సమయంలో ఒత్తిడిని దరిచేరనీయొద్దు. మెడిటేషన్ ద్వారా మానసిక సామర్థ్యం పెంపొందుతుంది. ఈ సమయంలో పునశ్చరణకు ఎంత ప్రాధాన్యమిస్తారో అంతేస్థాయిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంపైనా దృష్టిసారించాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. తగినంత విశ్రాంతి కూడా అవసరం. మాక్ టెస్ట్‌లు రాయడం వల్ల సమయపాలన అలవడుతుంది. విజయానికి దగ్గరి దారులుండవు. నిజాయితీతో కూడిన కష్టమే మంచి ఫలితాలనిస్తుంది.
     - ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్.
Published date : 12 Jun 2019 02:11PM

Photo Stories