Skip to main content

ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్..

స్వదేశీ పరిశోధనా కార్యకలాపాలు పెంచాలనే యోచన.. మేధో వలసకు అడ్డుకట్ట వేయాలనే తలంపు..ఆసక్తి ఉంటే బీటెక్‌తోనే నేరుగా పీహెచ్‌డీ చేసే అవకాశం! నెలకు రూ.70వేల ఫెలోషిప్..! ఏటా రెండు వేల మందికి అవకాశం..! ఐఐటీలు, ఐఐఎస్‌సీ (బెంగళూరు)లలో బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులకు ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్ పేరిట కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న ఈ పథకం గురించి...
బీటెక్ నుంచే పీహెచ్‌డీ...
దేశంలోని 23 ఐఐటీలు, బెంగళూరులోని ఐఐఎస్‌సీలో బీటెక్, ఇతర శాస్త్ర, సాంకేతిక కోర్సుల్లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్న విద్యార్థులు.. ఆ అర్హతతోనే పీహెచ్‌డీ దిశగా అడుగులు వేసేలా ‘ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్’కు రూపకల్పన జరుగుతోంది. ఇది మరికొన్ని రోజుల్లో అన్ని అనుమతులు పొంది కార్యరూపం దాల్చే అవకాశముంది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. తాజా నిర్ణయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం.. విద్యార్థులు బీటెక్ నాలుగో సంవత్సరంలోనే పరిశోధనా ఆసక్తి ఉన్న అంశంపై ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించాల్సి ఉంటుంది. దీనిని నిపుణుల కమిటీ పరిశీలించి అర్హులైన వారికి పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇలా.. 2 వేల మందిని ఎంపిక చేస్తారు. తొలుత ఏడాదికి వెయ్యి మందికే వర్తింపజేయాలని.. గతేడాది ఐఐటీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. అయితే.. తాజాగా పరిశోధనలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని పరిగణనలోకి తీసుకుని 2 వేలు చేశారు.

నెలకు రూ.70 వేల ఫెలోషిప్...
పీహెచ్‌డీకి ఎంపికైన ఐఐటీలు, ఐఐఎస్సీ విద్యార్థులకు నెలకు రూ.70 వేల చొప్పున ఐదేళ్లపాటు ఫెలోషిప్ అందించనుండటం ప్రస్తుత పథకంలోని విశేషం. అదనంగా హెచ్‌ఆర్‌ఏ, కాంటింజెన్సీ గ్రాంట్‌లు కూడా మంజూరు చేసే అవకాశముంది. వాస్తవానికి ప్రస్తుతం ఐఐటీల్లో పీహెచ్‌డీ అభ్యర్థులకు తొలి రెండేళ్లు.. జేఆర్‌ఎఫ్ పేరుతో నెలకు రూ.25 వేలు; మూడో ఏడాది నుంచి అయిదో సంవత్సరం పూర్తయ్యే వరకు ఎస్‌ఆర్‌ఎఫ్ పేరుతో నెలకు రూ.28 వేలు అందజేస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్ రీసెర్‌‌చ ఫెలోకు ఏకంగా అయిదేళ్ల పాటు నెలకు రూ.70 వేల ఫెలోషిప్ లభించనుంది. పరిశోధన అవకాశం పొందిన విద్యార్థులు నిర్దిష్ట అయిదేళ్ల గడువులో ఎప్పుడు మానేసినా.. అప్పటివరకు పొందిన స్కాలర్‌షిప్‌ను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎంపికకు ప్రత్యేక కమిటీ...
విద్యార్థులను పీహెచ్‌డీకి ఎంపిక చేసే క్రమంలో పలు విధివిధానాలు అమలు చేయనున్నారు.
అవి..
  • జాతీయ స్థాయిలో అన్ని ఐఐటీలు, ఐఐఎస్‌సీ ప్రొఫెసర్లతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు.
  • బీటెక్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు తమ పరిశోధన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఆ కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అభ్యర్థులు పేర్కొన్న రీసెర్చ్ ఏరియాస్ ఆధారంగా దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
  • షార్ట్‌లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులకు.. ఆయా సబ్జెక్ట్‌లకు చెందిన ప్రొఫెసర్ల నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అందులో విజయం సాధించినవారిని పీహెచ్‌డీకి ఎంపిక చేస్తుంది.
  • గైడ్ అందుబాటు, ఇన్‌స్టిట్యూట్‌లలో సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని.. అభ్యర్థులు ఏ క్యాంపస్‌లో రీసెర్చ్ చేయాలనే నిర్ణయాన్ని కూడా కమిటీయే నిర్ణయిస్తుంది.
  • ఎంపికైనవారిని ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోస్‌గా పిలుస్తారు.

సీజీపీఏ 8 తప్పనిసరి..
అభ్యర్థుల అర్హత ప్రమాణాలపైనా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీని ప్రకారం.. బీటెక్ విద్యార్థులు మొదటి సెమిస్టర్ నుంచి ఎనిమిదో సెమిస్టర్ వరకు ప్రతిదాంట్లో ఎనిమిది అంతకంటే ఎక్కువ సీజీపీఏ సాధించాల్సి ఉంటుంది. ఈ విషయంపైనే ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశోధన ఆసక్తికి.. అకడమిక్ రికార్డ్‌కు ముడిపెట్టడం సరికాదని, అకడమిక్‌గా మంచి సీజీపీఏ పొందలేకున్నా.. పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎందరో ఉంటారనే వాదన తెరపైకి వస్తోంది.

మేధో వలసను అడ్డుకునేందుకే...
బీటెక్‌తోనే పీహెచ్‌డీకి అర్హత కల్పించడం... ఫెలోషిప్ మొత్తాన్ని దాదాపు మూడొంతులు పెంచడానికి ప్రధాన కారణం.. మేధో వలసను అడ్డుకోవడానికేనని ప్రభుత్వ వర్గాలు, విద్యావేత్తల అభిప్రాయం. అంతేకాక ఐఐటీల్లోని ఎంతోమంది విద్యార్థుల్లో పీహెచ్‌డీ చేయాలనే ఆసక్తి ఉంటోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా బీటెక్ అర్హతతో లభించే కొలువుల్లో చేరిపోతున్నారు. మరికొందరు విదేశాల్లో పీహెచ్‌డీ అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయనే ఆలోచనతో వెళ్లిపోతున్నారు. పర్యవసానంగా పీహెచ్‌డీ వైపు దృష్టిసారించే వారి సంఖ్య ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే తాజా పథకానికి రూపకల్పన చేసినట్లు స్పష్టమవుతోంది.

స్వదేశీ శోధన.. ప్రపంచ ర్యాంకింగ్ :
ప్రస్తుతం దేశంలో మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి పలు పథకాలు అమలవుతున్నాయి. వాటి లక్ష్యాలు నెరవేరేలా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది. కానీ.. కార్యకలాపాలు ఆ స్థాయిలో జరగడం లేదు. మరోవైపు ర్యాంకుల కేటాయింపు పరామితుల్లో ఒకటైన ‘రీసెర్చ్’లో వెనుకబడి ఉండటంతో ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకుల్లో ఐఐటీలు స్థానం దక్కించుకోలేకపోతున్నాయి. ప్రైమ్ మినిస్టర్ రీసెర్‌‌చ ఫెలోషిప్‌తో ఐఐటీలు, ఐఐఎస్సీల్లో ఏటా రెండు వేల మంది పరిశోధనల్లో నిమగ్నమవుతారని.. ఇది ప్రపంచ ర్యాంకుల్లో సానుకూల ఫలితానికి దోహదపడుతుందనే భావన ఐఐటీ వర్గాల్లో ఉంది.

పరిమితంపై వ్యతిరేకత?
తాజా పథకాన్ని.. ఐఐటీలు, ఐఐఎస్‌సీ-బెంగళూరు విద్యార్థులకే పరిమితం చేయడంపై ఇతర ఇన్‌స్టిట్యూట్‌ల విద్యార్థుల నుంచి నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. దేశంలో ఇంకా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయని.. వాటిలోనూ పీహెచ్‌డీ చేసేందుకు సదుపాయాలున్నాయని పేర్కొంటున్నారు. ఇతర వర్సిటీల్లో సైతం పరిశోధనల పట్ల ఆసక్తి కలిగిన ప్రతిభావంతులను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్యలు వస్తున్నాయి.

గతంలో ఫలితమివ్వని పీఎంఎఫ్‌ఎస్...
పీఎంఎఫ్‌ఎస్.. ప్రైమ్ మినిస్టర్ ఫెలోషిప్ స్కీమ్ ఫర్ డాక్టోరల్ స్టడీస్. 2012లోనే.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో డీఎస్‌టీ ఆధ్వర్యంలోని సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ (సెర్బ్), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ మధ్య ఒప్పందం ద్వారా ఈ పథకం ప్రారంభమైంది. దీని ప్రకారం.. పీహెచ్‌డీ ఔత్సాహిక అభ్యర్థులు ఇండస్ట్రీ స్పాన్సర్ ద్వారా రీసెర్చ్ అవకాశం పొంది.. దరఖాస్తు చేసుకుంటే నెలకు రూ.72,800 ఫెలోఫిప్ లభిస్తుంది. ఈ మొత్తంలో యాభై శాతాన్ని సెర్బ్, మరో యాభై శాతాన్ని స్పాన్సర్ ఇండస్ట్రీ అందిస్తుంది. ఇలా ఏటా వంద మందికి అవకాశం లభిస్తుంది. ఇందుకోసం www.primeministerfellowshipscheme.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. అభ్యర్థులే ఇండస్ట్రీ స్పాన్సర్స్‌ను పొందాల్సి రావడం, వ్యవధి కూడా నాలుగేళ్లే ఉండటం ఈ పథకంలో ప్రధాన ప్రతికూలతగా మారింది. దీంతో ఏటా వందమందికి అని పేర్కొన్నా.. ప్రారంభమై అయిదేళ్లవుతున్నా.. కేవలం 79 మంది మాత్రమే లబ్ధి పొందారు.

పీహెచ్‌డీకి ఇతర మార్గాలు..
  • జెస్ట్ ద్వారా దేశంలోని ప్రముఖ పరిశోధనా కేంద్రాల్లో ప్రవేశం పొందొచ్చు
  • గేట్ ద్వారా పీహెచ్‌డీ, ఎంఎస్‌బై రీసెర్చ్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ - పీహెచ్‌డీ అవకాశం లభిస్తుంది.
  • ఐఐటీలు ప్రత్యేకంగా నెలకొల్పిన రీసెర్చ్ కేంద్రాలకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
‘‘2020 నాటికి దేశీయంగా పదివేల మంది పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్దాలి. ఇందులో ఐఐటీలు ప్రముఖ పాత్ర పోషించాలి. ప్రభుత్వం తోడ్పాటు అందించాలి’’
-భారత అణుశక్తి సంస్థ మాజీ డెరైక్టర్ అనిల్ కకోద్కర్ కమిటీ, ఐఐటీల కౌన్సిళ్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి.

విద్యార్థులకు మేలు చేసే నిర్ణయం...
బీటెక్ స్థాయిలోనే పరిశోధనల దిశగా ఆలోచించే విద్యార్థులకు ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్ మేలు చేస్తుందని చెప్పొచ్చు. కేవలం రెండు వేల మందికే అని నిర్ణయించినప్పటికీ.. లభించనున్న ప్రోత్సాహకాలు మరెందరో విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయి. ఇలాంటివారంతా ఈ పథకంతో పాటు ఇతర మార్గాల ద్వారా పీహెచ్‌డీవైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా దేశంలో పరిశోధనా కార్యకలాపాలు పెరగడం ఖాయం.
-ప్రొఫెసర్. ఆర్.వి.రాజ్‌కుమార్, ఐఐటీ-భువనేశ్వర్
Published date : 26 Sep 2017 05:32PM

Photo Stories