Skip to main content

‘నీట్’-2020 కౌన్సెలింగ్ ఎలా ఉంటుంది..? అవసరమైన సర్టిఫికెట్లు..?

నీట్-యూజీ ఎంట్రన్స్.. ఎంబీబీఎస్, బీడీఎస్, సహా ఆయుష్ కోర్సులుగా పేర్కొనే బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్‌వైఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష! ఇటీవల..
నీట్-యూజీ ఫలితాలు వెలువడ్డాయి! జాతీయ స్థాయిలో 13 లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ నుంచి 33,841 మంది, తెలంగాణ నుంచి 28,093 మంది నీట్‌లో ఉత్తీర్ణత సాధించారు! ఇప్పుడు వీరందరిలో తలెత్తే సందేహాలు.. నీట్ కౌన్సెలింగ్ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు ఎలా హాజరు కావాలి?! తెలుగు రాష్ట్రాల్లోని హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ఎలా ఉంటుంది? అనేవే!! ఈ నేపథ్యంలో.. నీట్-యూజీ కౌన్సెలింగ్ తీరుతెన్నులు, అవసరమైన ధ్రువ పత్రాలు, సీట్లు-ఫీజులు, కోర్సులు-కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...

దేశంలో వెద్య విద్య కోర్సులకు సంబంధించి జాతీయ స్థాయిలో ఒకే పరీక్ష విధానం (నీట్) అమల్లోకి వచ్చినప్పటి నుంచి.. ప్రతి ఏటా నీట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. ఆల్ ఇండియా కోటాకు, రాష్ట్రాల స్థాయిలో కోటాకు వేర్వేరుగా కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు.

ముందుగా ఆల్ ఇండియా కోటా :
నీట్-యూజీ కౌన్సెలింగ్ ప్రక్రియలో ముందుగా ఆల్ ఇండియా కోటాలో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న 15శాతం సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నిర్వహిస్తుంది. ఈ ఏడాది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారైంది. అక్టోబర్ 27 నుంచి ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జాతీయ స్థాయిలోని అన్ని యూనివర్సిటీలు, మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలోని ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లోని 15 శాతం సీట్లకు ఆన్‌లైన్ విధానంలో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అదే విధంగా.. ఎయిమ్స్ క్యాంపస్‌లలోని వంద శాతం ఎంబీబీఎస్ సీట్లకు, డీమ్డ్ యూనివర్సిటీల్లోని వంద శాతం సీట్లకు.. జిప్‌మర్, ఇతర సెంట్రల్ యూనివర్సిటీల పరిధిలోని నిర్దేశిత శాతం సీట్లకు కూడా ఎంసీసీనే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది.

తొలి రౌండ్ తర్వాత.. స్థానిక కౌన్సెలింగ్ :
జాతీయ స్థాయిలో ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి దశ ముగిసిన తర్వాత.. రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తాయి. ఆయా యూనివర్సిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 85 శాతం సీట్లకు(ఆల్ ఇండియా కోటాకు అప్పగించిన 15 శాతం మినహాయిస్తే) కౌన్సెలింగ్ చేపడతాయి. ప్రైవేటు కళాశాలల్లో ప్రైవేట్-బీ పేరిట అందుబాటులో ఉండే 35 శాతం సీట్లు.. మేనేజ్‌మెంట్ కోటా లేదా ఎన్‌ఆర్‌ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లు అంటే ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పోగా మిగిలే 50 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే భర్తీ చేస్తాయి. ఇక మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ప్రక్రియ ఇలా..:
  • నీట్‌లో ఉత్తీర్ణత సాధించి ఆన్‌లైన్ విధానంలో ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరు కావాలంటే.. ముందుగా ఆన్‌లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్‌ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి.
  • అనంతరం అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి.
  • వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్‌లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి.
  • ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్‌మెంట్ వివరాలను వెల్లడిస్తారు. తొలి రౌండ్‌లో సీట్ అలాట్‌మెంట్ పొందిన అభ్యర్థులు..సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ తొలి రౌండ్‌లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకపోతే.. ప్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. అలాంటి అభ్యర్థులు రెండోరౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. ఒకవేళ తొలిరౌండ్ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు.. మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా అందుబాటులో ఉంది.
  • ఈ ఏడాది రెండు రౌండ్లలో ఎంసీసీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
  • ఈ రెండు రౌండ్ల తర్వాత కూడా ఆల్ ఇండియా కోటా.. అదే విధంగా ఎంసీసీ పరిధిలోని ఇతర యూనివర్సిటీల్లోని సీట్లు మిగిలితే మాప్-అప్ రౌండ్ పేరిట తుది కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ షెడ్యూల్.. :
  • డీజీహెచ్‌ఎస్ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ.. ఆల్ ఇండియా కోటాలోని 15 శాతం సీట్ల భర్తీకి, డీమ్డ్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఎయిమ్స్, జిప్‌మర్, ఈఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీ ఇన్‌స్టిట్యూట్‌లలో నిర్దేశిత శాతాల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం రెండు రౌండ్లు, ఆ తర్వాత మాప్-అప్ రౌండ్‌లో ఈ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.
  • అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు: మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్.
  • అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 వరకు: ఛాయిస్ లాక్ చేసుకునే అవకాశం.
  • నవంబర్ 3, 4 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ.
  • నవంబర్ 5వ తేదీన సీట్ అలాట్‌మెంట్ ఫలితాల వెల్లడి.
  • నవంబర్ 6 నుంచి 12 వరకు అభ్యర్థులు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం.
  • నవంబర్ 18 నుంచి నవంబర్ 22 వరకు రెండో రౌండ్ రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్.
  • నవంబర్ 19 నుంచి నవంబర్ 22 వరకు ఛాయిస్ ఫిల్లింగ్, లాక్ చేసుకునే సదుపాయం.
  • నవంబర్ 23, 24 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ.
  • నవంబర్ 25న సీట్ అలాట్‌మెంట్ ఫలితాల వెల్లడి.
  • నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే సదుపాయం.
  • ఆల్ ఇండియా కోటా(15 శాతం) సీట్లలో భర్తీ కాని సీట్లను డిసెంబర్ 3న స్టేట్ కోటాకు బదిలీ చేస్తారు.
మాప్-అప్ రౌండ్ షెడ్యూల్ :
  • సెంట్రల్ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ఈఎస్‌ఐసీ టీచింగ్ హాస్పిటల్స్, ఎయిమ్స్, జిప్‌మర్‌లకు మాప్-అప్ రౌండ్ పేరుతో చివరగా మరో దఫా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
  • డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 14 వరకు రిజిస్ట్రేషన్ ఛాయిస్ ఫిల్లింగ్.
  • డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 14 వరకు ఛాయిస్ ఫిల్లింగ్, లాకింగ్ సదుపాయం.
  • డిసెంబర్ 15, 16 తేదీల్లో మాప్ రౌండ్ సీట్ కేటాయింపు ప్రక్రియ.
  • డిసెంబర్ 17న మాప్ అప్ రౌండ్ సీట్ కేటాయింపు ఫలితాలు వెల్లడి.
  • డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 24 వరకు సీటు పొందిన అభ్యర్థులు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చే అవకాశం.
  • మాప్ అప్ రౌండ్ తర్వాత కూడా భర్తీ కాని సీట్లు ఉంటే.. వాటిని స్ట్రే వేకెన్సీ రౌండ్ పేరుతో డిసెంబర్ 28 నుంచి డిసెంబర్ 31 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియను సీట్లు భర్తీ కాని ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహిస్తాయి. ఈ క్రమంలో మాప్ అప్ రౌండ్‌లో భర్తీ కాని సీట్లను ఆయా ఇన్‌స్టిట్యూట్‌లకు బదిలీ చేస్తారు.
అవసరమైన సర్టిఫికెట్లు ఇవే..:
  • నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్
  • నీట్ ర్యాంక్ కార్డ్
  • పుట్టిన తేదీ ధ్రువపత్రం
  • పదో తరగతి సర్టిఫికెట్; ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్; ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరూకూ స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు)
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది; ప్రొవిజినల్ అలాట్‌మెంట్ లెటర్(ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో సీటు కేటాయింపు వచ్చినట్లు ధ్రువ పరిచే పత్రం); వ్యక్తిగత గుర్తింపు డాక్యుమెంట్; ఎన్‌ఆర్‌ఐ, ఓసీఐ అభ్యర్థులైతే స్పాన్సర్ పాస్‌పోర్ట్‌ను, ఎంబసీ సర్టిఫికెట్‌ను అందించాలి; అదే విధంగా స్పాన్సర్‌షిప్ ధ్రువపత్రాన్ని కూడా అందించాలి; రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు, పీడబ్ల్యుడీ అభ్యర్థులు సంబంధిత కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లను అందించాలి.
ఆల్ ఇండియా కోటా ఎంసీసీ కౌన్సెలింగ్ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://mcc.nic.in/UGCounselling

ఒకటో తేదీలోపు నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్రంలో నీట్-యూజీ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను నవంబర్ ఒకటో తేదీలోపు ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎంసీసీ నుంచి మూడు, నాలుగు రోజుల్లో మెరిట్ జాబితా వస్తుంది. అది రాగానే ఎంసీసీ ఫస్ట్ రౌండ్ అలాట్‌మెంట్‌లోపు ఇక్కడ షెడ్యూల్ ప్రకటిస్తాం. విద్యార్థులు ఆన్‌లైన్ కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్ క్రమంలో ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభమయ్యే సమయానికి అన్ని రకాల సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. ఈసారి ఆన్‌లైన్ అప్లికేషన్‌తోపాటు నిర్దేశిత సర్టిఫికెట్లు అన్నింటిని ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్(ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత మంజూరు చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్నే సమర్పించాలి. ఛాయిస్ ఫిల్లింగ్‌కు ముందే అన్ని కళాశాలల గురించి తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. మొదటి రౌండ్‌లో సీట్ లభించిన అభ్యర్థులు.. ఇక్కడ తప్పనిసరిగా జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి. లేదంటే తర్వాత రౌండ్లలో కౌన్సెలింగ్‌కు అనుమతి ఉండదు. ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ విషయంలో మాత్రం కొన్ని కళాశాలలు, యూనివర్సిటీలకు మొదటి రౌండ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకున్నా.. తదుపరి రౌండ్లకు రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చే విధానం అమల్లో ఉంది. కానీ మేము మాత్రం తప్పనిసరిగా మొదటి రౌండ్‌లో లభించిన సీటుకు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తేనే తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు అనుమతి ఇవ్వాలని నిర్ణయించాం.

-డాక్టర్.బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్‌లర్, కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్ (కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ, వరంగల్)
Published date : 27 Oct 2020 01:49PM

Photo Stories