లాక్‌డౌన్ సమయం: మీ పనికి ఆటంకం కలగకుండా..మీ ఉద్యోగాన్నీ.. మీ సంస్థను భద్రంగా కాపాడుకోండిలా..
Sakshi Education
సాక్షి: కరోనా తెచ్చిన లాక్‌డౌన్‌ను ఇబ్బందిగా చూస్తున్నాం కాని సాంకేతిక విప్లవంతో మనమెప్పుడో మానసికంగా లాక్‌డౌన్ అయిపోయాం.గుంపులో ఉన్న వాట్సప్‌లో ఒంటరిగా.. ఇంట్లో ఉన్నా ఫేస్‌బుక్‌లో ఏకాంతంగా.. భౌతికంగా ఆఫీస్‌లో ఉన్నా మానసికంగా ఇంటర్నెట్ సైట్స్‌లో.. నలుగురితో ప్రయాణిస్తున్న ఒక్కడిగా ఫోన్‌లో ఉంటూ సోషల్ మూవింగ్‌ను మనమెప్పుడో మరిచిపోయాం. కాబట్టి లాక్‌డౌన్ కొత్త కాదు ఏర్పడ్డ సందర్భమే వేరు అంతే. ఈ లాక్‌డౌన్ ఇంట్లోంచే పనిచేసుకొనే వెసులుబాటునిచ్చింది. మరింత మెరుగ్గా ఉత్పాదకతను పెంచే అవకాశమూ వచ్చింది. మొక్కుబడిగా కాకుండా ఉత్సాహంగా, డ్రాయింగ్‌రూమ్‌లో సింగిల్‌గానే ఉన్నా ఆఫీస్ టీమ్‌తో కలిసి పని పంచుకోవచ్చు. ప్రతికూలతను అనుకూలతగా మలచుకోవడాన్ని మించిన విజయం ఉండదు. ఇది పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఫార్ములా కాదు పని చేయడానికి కావల్సిన మైండ్‌సెట్. టెక్నాలజీ అందిస్తున్న సౌకర్యాలతో ఇంట్లోంచే పని చేసేయండి ఈజీగా.. ఈ టిప్స్‌ను ఫోలో అవుతూ...
టిప్స్..
- సెక్షన్‌లో పనిచేస్తున్న వాళ్లందరినీ ముందు .. ఒక టీమ్‌గా తయారుచేసుకోండి. వాళ్లందరి ఈమెయిల్ ఐడీలతో ఓ గ్రూప్ తయారు చేయండి. అసైన్‌మెంట్స్, సలహా, సూచనలు, మార్పులు చేర్పులు, ఒకరి నుంచి ఒకరికి పని బదలాయింపులు, నిర్ణయాలు.. అన్నిటినీ ఆ గ్రూప్‌లో పెట్టేస్తే అందరికీ అందుతాయి. సమాచారమూ వేగంగా బట్వాడా అవుతుంది. అవసరం అనుకుంటే చాట్ రూమ్ సౌకర్యం ద్వారా వర్క్ డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు.
- ముఖ్యమైన డాక్యుమెంట్స్ కోసం షేరింగ్ పర్మిషన్ పెట్టుకుంటే మార్పుచేర్పులకు , కామెంట్ రాయడానికీ అవకాశం ఉంటుంది. షేర్‌డ్రైవ్‌నూ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల టీమ్ సభ్యులకు అందుబాటులో ఉన్న డివైస్ నుంచే ఫైల్స్‌ను చెక్ చేసుకునే వీలుండి నిర్ణీత గడువులోపే పని పూర్తవుతుంది. ఒకవేళ రిఫరెన్స్ కావాలనుకున్నా సంబంధిత ఫైల్స్ డ్రైవ్‌లో అందుబాటులో ఉంటాయి.
- అత్యవసర మీటింగ్స్‌ను వాయిదా వేసుకోనక్కర్లేదు. వీడియో కాన్ఫరెన్స్, లేదంటే మీటింగ్ యాప్‌ల ద్వారా సమావేశమవచ్చు. క్యాలెండర్ ఇన్వైట్స్ క్రియేట్ చేసుకొని, ఎజెండా ప్రిపేర్ చేయొచ్చు. డాక్యుమెంట్స్‌నూ కేలెండర్ ఇన్వైట్‌కు జతపర్చుకోవచ్చు. వీటన్నిటికంటే ముందు వీడియో (గ్రూప్) కాన్ఫరెన్స్ యాప్స్ గురించి, వాటి ఆపరేషన్ గురించి టీమ్ సభ్యులందరూ అవగాహన పెంచుకుంటే ఎలాంటి అంతరాయంలేకుండా సాఫీగా సాగిపోతాయి ఆన్‌లైన్‌లో గ్రూప్ మీటింగ్స్.
- ఇంట్లోంచే పనిచేయడం వల్ల ఒంటరైపోయాం, వెనకబడిపోయామనే భావన ఎవరికీ కలగకుండా ప్రతి రోజూ టీమ్ మీటింగ్ పెట్టుకుంటే మంచింది. అందరం కలిసే పనిచేస్తున్నామనే ఉత్సాహంతో పని సామర్థ్యమూ పెరుగుతుంది.
- నిర్దేశించుకున్న లక్ష్యాలను, సాధించిన పురోగతిని చాట్ గ్రూప్‌లో ఎప్పటికప్పుడు షేర్ చేసుకోవాలి. దీనివల్ల టీమ్ స్పిరిట్‌తోపాటు పోటీతత్వమూ పెరుగుతుంది. లోపాలను సరిదిద్దుకొని వేగంగా టార్గెట్స్‌నూ పూర్తిచేయొచ్చు.
- క్యాలెండర్ ఇన్వైట్స్‌లో పనివేళలను ముందుగానే నమోదు చేసుకుంటే మంచిది. టీమ్ సభ్యులందరూ ఒకరితో ఒకరు అందుబాటులో ఉంటారు. టీమ్ వర్క్ అనేది ఒక భావనగానే మిగిలిపోకుండా ప్రాక్టికల్‌గానూ సాధ్యమవుతుంది.
ఇలా లాక్‌డౌన్ సమయంలో కూడా ఉత్పాదకత కుంటుపడకుండా ఉద్యోగాన్నీ తద్వారా సంస్థలనూ భద్రంగా కాపాడుకోవచ్చు.
Published date : 17 Apr 2020 02:09PM