కరోనా ప్రభావంతో ఇంటర్న్‌షిప్‌ల వాయిదా.. ఆందోళనలో విద్యార్థులు
కోవిడ్–19 ఇంజనీరింగ్, ఎంబీఏ కోర్సులను చదువుతున్న విద్యార్థుల ఇంటర్న్‌షిప్ షెడ్యూల్, ప్రణాళికలను పూర్తిగా గందరగోళంలో పడేసింది.
కీలకం ఇంటర్న్‌షిప్‌లే..
ఎంబీఏ, ఇంజనీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించేవి ఈ ఇంటర్న్‌షిప్‌లే. ఇవి సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభమవుతాయి. అందుకే ఇప్పుడు కరోనా కారణంగా ఇంటర్న్‌షిప్‌లు రద్దు అవడం, వాయిదా పడటంతో విద్యార్థులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. చాలామంది విద్యార్థుల వేసవి ఇంటర్న్‌షిప్‌ల కాల వ్యవధి ఎనిమిది వారాల నుంచి ఆరు వారాలకు తగ్గింది. కొంతమందికి వాయిదాపడ్డాయి. మరికొంతమంది ఇంటర్న్‌షిప్‌లు రద్దు అయ్యాయి. చాలా తక్కువ మంది ఆన్లైన్లో చేస్తున్నారు.
ఇంటర్న్‌షిప్‌లు వాయిదా..
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ).. సాంకేతిక సంస్థలన్నింటికి వేసవి ఇంటర్న్‌షిప్‌లను లాక్డౌన్ ఎత్తివేసే వరకు హోల్డ్‌లో ఉంచాలని ఆదేశించింది. ఇంటినుంచి పనిచేసే అవకాశం కల్పించే వాటికి అనుమతించాలని పేర్కొంది. దేశంలోని ప్రధాన బిజినెస్ స్కూళ్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు ఇంటర్న్‌షిప్ షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కంపెనీలను కోరాయి. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం లక్నో, ఐఐఎం ఇండోర్, ఎక్స్ఎల్ఆర్ఐ విద్యార్థులకు ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశం ఇచ్చారు. ఐఐఎం కోజికోడ్ వంటి సంస్థలు రిక్రూటర్లకు ఎప్పటికప్పడు సమాచారాన్ని ఇస్తున్నాయి. అనేక సంస్థలు ఇంటర్న్‌షిప్ వ్యవధిని తగ్గిస్తున్నాయి.
వర్చువల్ మోడ్..
ఇంటర్న్‌షిప్‌ను వర్చువల్/రిమోట్ వర్కింగ్ మోడ్‌కు మార్చాలని ఐఐఎం అహ్మదాబాద్ రిక్రూటర్లను కోరింది. పలు సంస్థలు ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
ఐఐటీæ ఖరగ్‌పూర్..
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు చేసే వేసవి ఇంటర్న్‌షిప్‌లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఐఐటీ ఖరగ్‌పూర్ కోరింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నందున తమ సంస్థలో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇంటర్న్‌లుగా పనిచేసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఆయా విభాగాలకు సంబంధించి విద్యార్థులు ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే సూచించింది. అదే సమయంలో విద్యార్థులు ఆన్లైన్ ఇంటర్న్‌షిప్ ఇచ్చే సంస్థలను సంప్రదించవచ్చని పేర్కొంది. విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాల గురించి కంపెనీలతో చర్చించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్.. టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.