Skip to main content

ఇక క్యాట్ పరీక్ష రెండు గంటలే...కీలక మార్పులు ఇవే..

కామన్ అడ్మిషన్ టెస్ట్.. సంక్షిప్తంగా క్యాట్! ప్రతిష్టాత్మక బీస్కూల్స్.. ఐఐఎంల్లో ప్రవేశానికి తొలి మెట్టు!! ఇందుకోసం ఏటా లక్షల మంది పోటీ పడుతుంటారు. క్యాట్ అభ్యర్థులు..

ఈ ఏడాది పరీక్షలో విజయానికి మరింత కృషి చేయాల్సిన అవసరం ఏర్పడింది! క్యాట్-2020లో తాజాగా జరిగిన పలు కీలక మార్పులే ఇందుకు కారణం!! వాస్తవానికి గత నాలుగేళ్లుగా క్యాట్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఈ ఏడాది కూడా మార్పులు ఉండకపోవచ్చు అనే అభిప్రాయం నోటిఫికేషన్ వెలువడిన సమయంలో వ్యక్తమైంది. కాని దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో.. క్యాట్-2020 నిర్వాహక ఇన్‌స్టిట్యూట్.. ఐఐఎం-ఇండోర్ అకస్మాత్తుగా మార్పులు ప్రకటించి.. అభ్యర్థులను ఆశ్చర్యానికి, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఇంతకీ ఆ మార్పులు ఏంటి..! సదరు మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటుంది.. మార్పులకు తగ్గట్టు ప్రిపరేషన్ మార్చుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

పరీక్ష వ్యవధి రెండు గంటలే!

క్యాట్-2020లో అత్యంత కీలకమైన మార్పు..పరీక్ష వ్యవధిలో మార్పు. ఆన్‌లైన్ విధానంలో సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)గా జరిగే ఈ పరీక్ష సమయం రెండు గంటలకు కుదించారు. గత నాలుగేళ్లుగా 3 గంటల వ్యవధిలో ఈ పరీక్ష జరుగుతోంది. కాని ఈ ఏడాది మాత్రం పరీక్ష సమయం రెండు గంటలేనని ఐఐఎం-ఇండోర్ వర్గాలు పేర్కొన్నాయి.

 

ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాలు..

క్యాట్ పరీక్ష వ్యవధిని రెండు గంటలకు తగ్గించిన నేపథ్యంలో.. పరీక్షలో అడిగే మూడు సెక్షన్లకు సంబంధించి సమయాన్ని కూడా తగ్గించారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాలు కేటాయించారు.

అవి..

  1. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్-40 నిమిషాలు
  2. డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్-40 నిమిషాలు
  3. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-40 నిమిషాలు.

 

ఒక సెక్షన్ పూర్తయ్యాకే.. మరో సెక్షన్‌కు

క్యాట్-2020లో మరో ముఖ్యమైన మార్పు.. అభ్యర్థులు ఒక సెక్షన్‌లోని ప్రశ్నలన్నింటినీ పూర్తిచేశాకే.. తదుపరి సెక్షన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఒక సెక్షన్ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. మధ్యలో వేరే సెక్షన్‌కు వెళ్లడం ఇకపై సాధ్యం కాదు. ఒక వేళ ఒక సెక్షన్ మధ్యలో వేరే సెక్షన్ ప్రశ్నలకు వెళితే.. అంతకుముందు సెక్షన్‌కు వెళ్లడం సాధ్యం కాదు. ఈ విషయంపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

{పశ్నల సంఖ్యపై అస్పష్టత:

పరీక్షలో అడిగే ప్రశ్నల సంఖ్య, మొత్తం పరీక్ష మార్కుల విషయంలో మాత్రం స్పష్టత లేదు. ఇది కూడా అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. ఐఐఎం-బెంగళూరుకు చెందిన ఓ ప్రొఫెసర్ అభిప్రాయం ప్రకారం- మొత్తంగా ప్రశ్నల సంఖ్య పది నుంచి 15 వరకు తగ్గే అవకాశం ఉంది. వాస్తవానికి గతేడాది వరకు.. వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి 34 ప్రశ్నలు; డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ నుంచి 32 ప్రశ్నలు; క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 32 ప్రశ్నలు అడిగారు. ఈ ఏడాది పరీక్ష సమయాన్ని రెండు గంటలకు కుదించినందున ప్రతి సెక్షన్‌లోనూ ప్రశ్నల సంఖ్య మూడు నుంచి అయిదు వరకు తగ్గే అవకాశముందని.. మొత్తంగా మూడు సెక్షన్లకు కలిపి కనిష్టంగా పది ప్రశ్నలు, గరిష్టంగా 15 ప్రశ్నల వరకు తగ్గొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేవిధంగా మొత్తం మార్కుల సంఖ్య 300 నుంచి 250కు తగ్గే అవకాశం ఉంది.

నాన్-ఎంసీక్యూలు..

పరీక్ష వ్యవధిని, సెక్షన్‌ల వారీగా సమయాన్ని తగ్గించిన నేపథ్యంలో.. ప్రధానంగా నాన్-ఎంసీక్యూ ప్రశ్నల సంఖ్య తగ్గే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి నాన్-ఎంసీక్యూలకు నెగెటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి నాన్- ఎంసీక్యూలను తగ్గించడానికే ఎక్కువ ఆస్కారముంది. ఒక్కో ప్రశ్నకు కేటాయించే మార్కుల సంఖ్యలో మార్పు ఉండకపోవచ్చు. గతంలో మాదిరిగానే ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించొచ్చు.

పరీక్ష సెషన్ల సంఖ్య పెంపు :

క్యాట్-2020లో మరో ప్రధాన మార్పు.. క్యాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్లను మూడుకు పెంచడం! గతేడాది వరకు ఒకేరోజు రెండు సెషన్లలో.. ఒక్కో సెషన్‌కు మూడు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహించారు. పరీక్ష సమయం తగ్గింపు, కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని.. ఒకే రోజు మూడు సెషన్లలో ఒక్కో సెషన్‌కు రెండు గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహించనున్నట్లు ఐఐఎం-ఇండోర్ వర్గాలు తెలిపాయి.

విజయానికి 60 శాతం పైగా మార్కులు..

పరీక్ష సమయం తగ్గింది. ప్రశ్నలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయినా అభ్యర్థులు మంచి పర్సంటైల్ సాధించాలంటే.. 60 శాతంపైగా మార్కులు సాధించాల్సిందే అంటున్నారు నిపుణులు. అప్పుడే 90 పర్సంటైల్‌పైగా స్కోర్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఐఐఎంలు వేర్వేరుగా ప్రకటించే దరఖాస్తు ప్రక్రియకు అర్హత లభిస్తుంది.

{పిపరేషన్ పక్కాగా..

క్యాట్-2020లో మార్పుల నేపథ్యంలో.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించాలంటే.. నవంబర్ 29న జరిగే పరీక్ష కోసం కసరత్తును తీవ్రం చేయాలి. సెక్షన్‌ల వారీగా ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి.

మార్పులకు అనుగుణంగా..

ఇప్పటికే ప్రిపరేషన్‌ను ప్రారంభించాల్సిన అభ్యర్థులు.. తమ ప్రిపరేషన్‌ను తాజా మార్పులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం నెలకొంది. అభ్యర్థులు ఎక్కువ వెయిటేజీ ఉన్న అంశాలను పరిశీలించి.. వాటిపై ఎక్కువ దృష్టి సారించాలి. ఆయా టాపిక్స్‌కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించి.. వాటిలోని అంశాలను ప్రాక్టీస్ చేస్తూ.. ప్రతి యూనిట్ తర్వాత ఉండే మోడల్ కొశ్చన్స్‌ను సాధన చేయాలి. ఆన్‌లైన్ విధానంలోనూ ఇప్పుడు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ :

ఈ విభాగంలో ప్రధానంగా రీడింగ్ కాంప్రహెన్షన్‌పై దృష్టి సారించాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నల్లో మంచి మార్కులు సొంతం చేసుకోవాలంటే.. స్టేట్‌మెంట్స్, అసెంప్షన్స్.. వంటి వాటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదే విధంగా ఫ్యాక్ట్స్,ఇన్ఫరెన్సెస్,జంబుల్డ్ పారాగ్రాఫ్‌లను ప్రాక్టీస్ చేయడం మేలు చేస్తుంది.

డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్:

ఈ సెక్షన్‌లో మెరుగైన స్కోర్ కోసం టేబుల్స్, గ్రాఫ్స్, చార్ట్స్ ఆధారిత ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. లాజికల్ రీజనింగ్ విషయంలో క్యూబ్స్, క్లాక్స్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, సీటింగ్ అరేంజ్‌మెంట్ వంటి అంశాలను అధ్యయనం చేయాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:

ఇందులో అర్థమెటిక్‌కు సంబంధించి పర్సంటేజెస్, రేషియోస్, డిస్టెన్స్-టైం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మ్యాథమెటిక్స్‌కు సంబంధించి అల్‌జీబ్రా, మోడ్రన్ మ్యాథ్స్, జామెట్రీ అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

కాన్సెప్ట్స్.. ప్రాక్టీస్ :

{పతి సెక్షన్ కీలకంగా నిలిచే క్యాట్‌లో విజయం సాధించాలంటే.. అభ్యర్థులు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ముందుగా సిలబస్‌ను పరిశీలించి.. అందులోని అంశాలు వాటికి సంబంధించిన కాన్సెప్ట్‌లపై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత ప్రామాణిక మెటీరియల్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. దీంతోపాటు ప్రతి టాపిక్ పూర్తయిన తర్వాత ప్రాక్టీస్ చేయడం ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు ప్రతిరోజు ప్రాక్టీస్‌కు కనీసం ఎనిమిది గంటల సమయం కేటాయించాలి. తాము చదివిన టాపిక్‌లో పొందిన పరిజ్ఞానాన్ని పరీక్షించుకునేలా సెల్ఫ్ అసైన్‌మెంట్స్ రాయాలి.

మాక్ టెస్ట్‌లతో మేలు :

{పస్తుతం అందుబాటులో ఉన్న సమయం, క్యాట్-2020 మార్పుల దృష్ట్యా అభ్యర్థులు మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి నుంచి కనీసం ఏడెనిమిది మాక్ టెస్ట్‌లకు హాజరయ్యేలా ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లలో తమ సామర్థ్య స్థాయి.. మెరుగవ్వాల్సిన టాపిక్స్‌పై అవగాహన ఏర్పడుతుంది.

ప్రిపరేషన్ శైలి మార్చుకోవాలి..

తాజాగా క్యాట్ మార్పులను పరిగణనలోకి తీసుకుంటే.. అభ్యర్థులు తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ప్రశ్నల సంఖ్యపై స్పష్టత ఇవ్వలేదు. కానీ సమయం విషయంలో స్పష్టత లభించింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే అభ్యర్థులు ప్రతి టాపిక్‌లోనూ తక్కువ సమయంలో పూర్తి అవగాహన పొందాల్సి ఉంది. అందుకోసం బేసిక్స్, కాన్సెప్ట్స్‌పై పట్టు సాధించేందుకు కృషి చేయాలి.

-రామ్‌నాథ్ ఎస్.కనకదండి, క్యాట్ కోర్స్ డెరైక్టర్, టైమ్ ఇన్‌స్టిట్యూట్

క్యాట్-2020 ముఖ్య సమాచారం:

  1. పరీక్ష తేదీ: నవంబర్ 29, 2020
  2. అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: అక్టోబర్ 28, 2020
  3. ఫలితాల వెల్లడి: జనవరి, 2021 రెండో వారం
  4. వివరాలకు వెబ్‌సైట్: iimcat.ac.in
Published date : 29 Sep 2020 03:49PM

Photo Stories