Skip to main content

గేట్‌లో ఉండే వాటిలో టాప్-5 పేపర్లు ఇవే.. వీటిలోనే అత్యధికంగా హాజరయిన అభ్యర్థులు..

మొత్తం అభ్యర్థుల్లో అధిక శాతం మంది హాజరైన పేపర్లలో..టాప్-5 జాబితాలో కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు నిలిచాయి.

మొత్తం పరీక్ష రాసిన వారిలో ఈ పేపర్లకు హాజరైన అభ్యర్థుల సంఖ్య 60 శాతం వరకు ఉంటుందని అంచనా. ఈ టాప్-5 పేపర్లను విశ్లేషిస్తే..అన్ని పేపర్లు ఒక మోస్తరు క్లిష్టతతో ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కంప్యూటర్ సైన్స్..
కంప్యూటర్ సైన్స్(సీఎస్‌ఈ) పేపర్ క్లిష్టత స్థాయి ఓ మోస్తరుగా ఉందని చెబుతున్నారు. ఈ పేపర్ కాన్సెప్ట్ ఆధారితంగానే జరిగింది. ఇందులో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్ అండ్ డేటాస్ట్రక్చర్‌లకు సమాన వెయిటేజీ ఇస్తూ ప్రశ్నలు కనిపించాయి. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 16 ప్రశ్నలు అడిగారు. దాంతో సమాధానాలు గుర్తించడంలో అభ్యర్థులకు కొంత సమయాభావం ఎదురైంది. కాన్సెప్ట్స్ ఆధారిత ప్రశ్నల సంఖ్య 20 శాతం వరకు, థియరీ ఆధారిత ప్రశ్నల సంఖ్య 15 శాతం వరకు ఉంది. మొత్తమ్మీద ఈ పేపర్‌లో ఈ ఏడాది అభ్యర్థులు 60 నుంచి 65 మార్కులు సాధించే అవకాశం ఉంది.

మెకానికల్ ఇంజనీరింగ్..
మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ క్లిష్టత స్థాయి కూడా ఓ మోస్తరుగా ఉందని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇతర ప్రశ్నలు కూడా న్యూమరికల్ అప్రోచ్‌తో సమాధానం రాబట్టే విధంగా ఉన్నాయి. ప్రశ్నలన్నీ కాన్సెప్ట్స్‌కు సంబంధించినవే. ఇంజనీరింగ్ మ్యాథ్స్ ఆధారంగా పలు ప్రశ్నలు అడిగారు. బీటెక్ స్థాయిలో అకడమిక్స్‌పై పూర్తి పట్టు సాధించిన అభ్యర్థులు..ఈ పేపర్‌ను సులువుగానే ఎదుర్కొన్నారనే అభిప్రాయం వ్యక్తమ వుతోంది. ఈ పేపర్‌లో సగటు(మోడరేట్) క్లిష్టతతో కూడిన ప్రశ్నలే ఉన్నాయి. రెండు స్లాట్లలో అడిగిన ప్రశ్నల మధ్య సమతుల్యత పాటించినట్లు కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్..
రెండు స్లాట్లలో నిర్వహించిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ఈసీ) పరీక్షలో.. మొదటి స్లాట్ కొంత కష్టంగా, రెండో స్లాట్ కొంచెం సులువుగా ఉన్నట్లు నిపుణుల అభిప్రాయం. ఎలక్ట్రానిక్ డివెజైస్ అండ్ సర్క్యూట్స్,అనలాగ్ సిస్టమ్స్ అంశాల నుంచి అడిగిన ప్రశ్నలు క్లిష్టంగా ఉన్నాయి. మిగతా అంశాల పరంగా ప్రశ్నల క్లిష్టత స్థాయి మధ్యస్థంగా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద వంద మార్కులకు నిర్వహించిన ఈ పేపర్లో 40 నుంచి 50 మార్కులు ఖాయంగా సాధించొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్..
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పేపర్‌లో.. కోర్ టాపిక్స్‌పై ప్రశ్నలు అడగడం ప్రాధాన్యత సంతరిం చుకుంది. ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటి క్లిష్టత స్థాయి సాధారణంగా ఉండటం అభ్యర్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. కోర్ టాపిక్స్‌పై బాగా అవగాహన ఉన్న వారు మంచి స్కోర్ చేయొచ్చు. రెండు స్లాట్ల పేపర్ల క్లిష్టత కూడా మోడరేట్‌గా ఉంది. దాంతో మొత్తం వంద మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో.. ఫండమెంటల్స్‌పై పట్టు ఉన్న అభ్యర్థులు 50 నుంచి 60 మార్కులు పొందే అవకాశముంది.

సివిల్ ఇంజనీరింగ్..
సివిల్ ఇంజనీరింగ్‌లో.. ట్రాన్స్‌పోర్ట్ ఇంజ నీరింగ్,ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, జియో టెక్నికల్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ హైడ్రాలజీ అంశాలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చినట్లు పేర్కొంటున్నారు. తొలి స్లాట్‌లో ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ అనాలిసిస్ అంశాలకు సంబంధించిన ప్రశ్నలు కొంత క్లిష్టతతో ఉన్నాయి. రెండో స్లాట్‌లో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ప్రశ్నలు అత్యంత క్లిష్టంగా అడిగారు. మిగతా విభాగాలకు సంబంధించిన ప్రశ్నలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా మధ్యస్థంగా ఉన్నాయి. మొత్తం మీద ఈ పేపర్‌ను మోడరేట్ పేపర్‌గా పేర్కొనచ్చని నిపుణుల అభిప్రాయం. కాన్సెప్ట్‌పై స్పష్టత ఉన్న అభ్యర్థులు 40 నుంచి 45 మార్కులు పొందే అవకాశం ఉంది.

ఇంకా చదవండి: part 3: గేట్ 2021 ఫలితాల్లో కటాఫ్ ఎంత ఉండాలో తెలుసా..?

Published date : 20 Feb 2021 04:43PM

Photo Stories