SBI Workers Salary: ఎస్‌బీఐ కాంట్రాక్టు వర్కర్లకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలి
ఏప్రిల్ 21న సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్‌బీఐ కాంట్రాక్టు వర్కర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్‌బీఐలో 8 గంటల పని విధానం లేదని కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకిరీ చేయించుకుంటూ రూ.15 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనాన్ని రూ. 30 వేలకు పెంచి ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలన్నారు.
ఎస్‌బీఐలో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మంది కాంట్రాక్ట్ వర్కర్లు పని చేస్తున్నట్లు తెలిపారు. 8 గంటల పని విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అదనంగా పని చేస్తే అదనపు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత కాంట్రాక్ట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని కోరారు.
చదవండి: BOI Recruitment 2024: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
బ్యాంకు యాజమాన్యం వర్కర్లకు 30 రోజుల వేతనం విడుదల చేస్తుండగా కాంట్రాక్టర్ 26 రోజుల వేతనమే చెల్లిస్తూ మిగతా నాలుగు రోజుల వేతనాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు.
కాంట్రాక్టు వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టులో ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి జంతర్‌మంత్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మల్లేష్, ప్రధాన కార్యదర్శి పాండు, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ డివిజన్ అధ్యక్షులు సాయి తదితరులు పాల్గొన్నారు.