డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు తీపి కబురు: ఏఈ స్థాయి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... విజయానికి మార్గం ఇదిగో
- ఏపీలో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు తీపి కబురు
- పలు శాఖల్లో ఏఈ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ప్రకటన
- ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న దరఖాస్తు ప్రక్రియ
- రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
- రూ.31,460–రూ.84,970 శ్రేణిలో వేతనం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గత కొద్ది రోజులుగా వరుస నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగార్థుల్లో ఆశలు నింపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నోటిఫికేషన్‌తో ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో.. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
మొత్తం పోస్టులు 190
ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్‌లు(గత నోటిఫికేషన్‌లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు. ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది.
అర్హతలు
- ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు.
- దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
- వయోపరిమితి: జూలై 1,2021 నాటికి 18–42ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక విధానం
రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు చేస్తారు.
రాత పరీక్ష ఇలా
రాత పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రశ్నపత్రం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది.
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు | సమయం |
1 | జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 150 | 150 | 150 ని |
2 | సివిల్/మెకానికల్ | 150 | 150 | 150 ని |
3 | ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్/సివిల్ | 150 | 150 | 150 ని |
- పేపర్–3 పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో ఎన్విరాన్‌మెంట్/సివిల్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే (పోస్ట్ కోడ్–3) నిర్వహిస్తారు.
- పేపర్ 2 అన్ని శాఖల్లోని సివిల్/మెకానికల్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఈ ప్రశ్న పత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది.
- నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలు చేయనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు.
విజయానికి మార్గం ఇదిగో
పేపర్–1 ఇలా
- పేపర్–1 జనరల్ స్టడీస్‌లో.. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ; ఏపీ, ఇండియా హిస్టరీ; పాలిటీ, గవర్నెన్స్; ఏపీలో అమలవుతున్న ఈ–గవర్నెన్స్ విధానాలు;
- ఆర్థికాభివృద్ధి అంశాలు, ఏపీలో ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న చర్యలు; డిజాస్టర్ మేనేజ్‌మెంట్; ఏపీ, ఇండియా ఫిజికల్ జాగ్రఫీ అంశాలపై దృష్టి పెట్టాలి.
- అదేవిధంగా లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లను ప్రాక్టీస్ చేయాలి.
- డేటా అనాలిసిస్ విషయంలో డేటా విశదీకరణ, విశ్లేషణ, డేటా రూపకల్పన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
పేపర్–2లో ఉమ్మడిగా
సివిల్, మెకానికల్ ఏఈ పోస్ట్‌లకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్ ఇది. ఇందులో విజయానికి అభ్యర్థులు సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌లోని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. డిప్లొమా స్థాయిలో ప్రశ్నలు ఉంటాయని నోటిఫికేషన్‌లో
పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలకు సంబంధించి డిప్లొమా లేదా బీటెక్ పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది. అదే విధంగా ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన ఏఈ ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
పేపర్–3లో రాణించాలంటే
- పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో.. ఎన్విరాన్‌మెంట్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే నిర్వహించే ఈ పేపర్‌లో ఎన్విరాన్‌మెంటల్/సివిల్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వాటర్ సప్లయి ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ మేనేజ్‌మెంట్, వాయు, శబ్ద కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్,డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్,బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ ప్రాక్టీస్ విభాగాల్లోని ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి.
- ప్రధానంగా ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో అమలవుతున్న విధానాలు,చేపడుతున్న చర్యలు,పర్యావరణ పరిరక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి.
సిలబస్ క్షుణ్నంగా
అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌లు, వాటికి సంబంధించి రాత పరీక్షలో పేర్కొన్న సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. దాని ఆధారంగా తాము కొత్తగా చదవాల్సిన అంశాలతోపాటు, ఇప్పటికే అవగాహన ఉన్న టాపిక్స్‌పై స్పష్టత
లభిస్తుంది. ఫలితంగా ప్రిపరేషన్‌లో ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా సమయ పాలనతో ముందుకు సాగాలి.
అకడమిక్ పుస్తకాలు
- సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకున్నాక..ఆయా అంశాలకు సంబంధించి బీటెక్ లేదా డిప్లొమా స్థాయిలోని అకడమిక్ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌లో అప్లికేషన్ అప్రోచ్‌ను అనుసరించాలి. దీనివల్ల ప్రాక్టికల్ థింకింగ్ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది.
- మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. అదే విధంగా ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి ఈసెట్, పీజీఈసెట్ తదితర ఇంజనీరింగ్ సెట్‌ల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
- పేపర్–2లోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలోనే ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాని అభ్యర్థులు బీటెక్ స్థాయిలోని అంశాలపైనా దృష్టిపెడితే విజయావకాశాలు మరింత మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఏపీపీఎస్సీ ఏఈ నోటిఫికేషన్–ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: అక్టోబర్ 21–నవంబర్ 11,2021
- దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 10, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://psc.ap.gov.in
చదవండి: