APPSC: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో కీలక మార్పులు
గ్రూప్–1లో పేపర్–1, పేపర్2గా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్ ఓఎమ్మార్ ఆధారిత పత్రాలతో పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది. ఒక్కో పేపర్‌లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. గతంలో లేనివిధంగా ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, సూపరింటెండెంట్లే కాకుండా జిల్లాస్థాయి అధికారి ఒకరిని ప్రత్యేక పర్యవేక్షకునిగా నియమిస్తున్నారు.
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్ | టీఎస్‌పీఎస్సీ
కోడింగ్ తప్పయితే..
ఈసారి ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించిన సవివర సమాచారం ప్రశ్నపత్రాలు, ఓఎమ్మార్ పత్రాల్లో ముద్రించి ఉంటుంది. వాటిని ముందుగా తెలుసుకునేందుకు వీలుగా వాటి నమూనాలను కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీనివల్ల అభ్యర్థికి సమయం కలసి రావడంతోపాటు పరీక్షపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ బుక్‌లెట్లపై కోడింగ్ సిరీస్ నంబర్లు సరిసమానంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. తప్పు కోడింగ్ ఉంటే కనుక ఆ జవాబు పత్రాలు చెల్లుబాటు కావు. అభ్యర్థి తన రిజిస్టర్ నంబర్‌ను ప్రశ్నపత్రం బుక్‌లెట్‌పై నిర్ణీత స్థలంలోనే రాయాలి. అభ్యర్థులు హాల్‌టికెట్లతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ఆ తరువాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 వరకు మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు అనుమతిస్తారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 వరకు అవకాశవిుస్తారు. తరువాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తు ఫారంలో బయోడేటా వివరాలను తప్పుగా సమర్పించి ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందుబాటులో ఉన్న నామినల్ రోల్స్‌లో డేటాను అప్‌డేట్ చేసుకోవచ్చు. ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇన్విజిలేటర్ సంతకాన్ని తీసుకోవాలి.
ఓఎమ్మార్‌లో ఒరిజినల్, డూప్లికేట్ పత్రాలు
అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం రెండు కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థి పైన ఉండే ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్‌కు అందించాలి. దిగువన ఉండే డూప్లికేట్ సమాధాన పత్రాన్ని తన రికార్డుకోసం తీసుకువెళ్లాలి. అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రంపై సమాధానాలను ఎంపిక చేయరాదు. కేవలం ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇచ్చిన స్థలంలో నీలం లేదా నలుపు బాల్‌పెన్నుతో బబుల్ చేయాలి. వైటనర్, మార్కర్, ఎరేజర్లను వినియోగించినా ఆ సమాధాన పత్రం చెల్లదు. అంధత్వం, రెండు చేతులకూ వైకల్యం, మస్తిష్క పక్షవాతం గల అభ్యర్థులకు స్క్రయిబర్లను అనుమతిస్తారు. ఈసారి అత్యధికంగా 714 మంది స్క్రయిబర్లు కావాలని దరఖాస్తు చేశారు. అభ్యర్థులు స్క్రయిబ్‌ను తామే తెచ్చుకుంటే వారికి ఆ పోస్టుకు నిర్ణయించిన అర్హత కన్నా తక్కువ అర్హత ఉండాలి. అభ్యర్థి తెచ్చుకున్న స్క్రయిబ్ అర్హుడు కాకుంటే చీఫ్ సూపరింటెండెంటు వేరొకరిని ఏర్పాటు చేస్తారు.
- విధివిధానాలను తెలుసుకునేలా వెబ్‌సైట్‌లో నమూనా ప్రశ్నపత్రం
- ఓఎమ్మార్‌లో ఒరిజినల్, డూప్లికేట్ పత్రాలు
- తక్కువ అర్హతలున్న వారికే స్క్రయిబ్‌లుగా అనుమతి
- నిర్ణీత సమయం దాటితే పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ
ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో గ్రూప్–1 క్యాడర్ పోస్టుల భర్తీకి జనవరి 8వ తేదీన ప్రిలిమనరీ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశామని Andhra Pradesh Public Service Commission (APPSC) చైర్మన్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. జనవరి 5న ఏపీపీఎస్‌సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,26,449 మంది హాజరవుతారన్నారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి సకాలంలో పూర్తిచేయాలన్నది కమిషన్ లక్ష్యమని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే..
యూపీఎస్సీ తరహాలోనే..
ఈ సారి గ్రూప్–1లో 92 పోస్టుల భర్తీకి వీలుగా నోటిఫికేషన్ ఇచ్చాం. గత గ్రూప్–1లో మిగిలిన 16 నుంచి 18 వరకు పోస్టులను క్యారీఫార్వర్డ్ కింద ఈ నోటిఫికేషన్‌కు జత చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. న్యాయపరమైన సలహాల అనంతరం ప్రిలిమ్స్ నిర్వహించే 8వ తేదీలోపు వాటిని ప్రకటిస్తాం. యూపీఎస్సీ మాదిరిగా గ్రూప్–1 పోస్టులను నిర్ణీత కాలపట్టిక ప్రకారం పూర్తి చేయించాలని భావిస్తున్నాం. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అదే రోజు రాత్రి లేదా మరునాడు ప్రకటిస్తాం. రెండు లేదా మూడు వారాల్లోపు ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటిస్తాం. అనంతరం మెయిన్స్ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి ఏప్రిల్ నెలాఖరున మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తాం. ఆపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్‌కల్లా ఫలితాలు విడుదల చేస్తాం. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వూ్యలు నిర్వహిస్తాం. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయిస్తాం. అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మరో కొత్త గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేస్తాం. ప్రాథమిక కీపై అభ్యంతరాల సంఖ్య వేలల్లో ఉంటున్నందున ప్రశ్నకు రూ.100 చొప్పున చెల్లించాలన్న నిబంధన పెట్టాం. సరైన అభ్యంతరమైతే ఆ మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తాం.
ఇంటర్వ్యూలకు మూడు బోర్డులు
గ్రూప్–1లో ఇంటర్వ్యూలను గతంలో వద్దనుకున్నా ప్రజలతో నేరుగా సంబంధాలు నెరిపి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన క్యాడర్ పోస్టులు కాబట్టి అభ్యర్థుల పర్సనాలిటీకి సంబంధించిన అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్వూ్యలను పునరుద్ధరించారు. గతంలో ఒకే బోర్డుతో ఈ ఇంటర్వూ్యలు నిర్వహించగా.. ఇప్పుడు మూడు వరకు బోర్డులతో చేపడుతున్నాం. ఇందులో కమిషన్ చైర్మన్, సభ్యుడితో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులైన వీసీ లేదా సీనియర్ ప్రొఫెసర్లు, రిటైర్డు ప్రొఫెసర్లను బోర్డులో నియమిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా కేవలం మెరిట్ ప్రాతిపదికనే ఎంపికలు ఉంటాయి. కనుక ఏ ఒక్కరూ బయట వ్యక్తులు, మధ్యవర్తుల మాటలు విని మోసపోవద్దు.
గ్రూప్–2 సిలబస్‌ను హేతుబద్ధీకరిస్తాం
గ్రూప్–2 పోస్టుల భర్తీపైనా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నోటిఫికేషన్ ఇస్తాం. గ్రూప్–2కు సంబంధించి సిలబస్ విధానంలో మార్పులు తీసుకురానున్నాం. సిలబస్‌లో రేషనలైజేషన్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే రకమైన సిలబస్‌ను అనుసరిస్తున్నందున దానిని హేతుబద్ధం చేస్తాం. గ్రూప్–2 స్కీమ్, ప్యాట్రన్‌లో మాత్రం ఎలాంటి మార్పులుండవు.