APPSC: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ మార్పు
![Gautham Sawang](/sites/default/files/images/2022/11/15/gauthamsawang-1668494080.jpg)
పాలనా కారణాలతో డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామన్నారు. డిసెంబర్ 17 నుంచి 20 తేదీ వరకు బ్యాంకింగ్ పరీక్షలు జరగనున్నందున అభ్యర్థుల మేలు కోసం గ్రూప్–1 పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గ్రూప్–1 పోస్టుల నియామక ప్రక్రియను 9 లేదా 10 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లతో పాటు త్వరలో వెలువరించనున్న వాటికీ నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన నవంబర్ 11న ‘సాక్షి’కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చిన అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశామని గుర్తు చేశారు. వీటిలో కొన్నింటికి పరీక్షలను నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించామని తెలిపారు. ఈ సందర్భంగా సవాంగ్ ఏం చెప్పారంటే..
చదవండి: ఏపీపీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్
పకడ్బందీ ప్రణాళికతో ముందుకు..
గ్రూప్–1తో సహా అన్ని పోస్టుల భర్తీలో ఎక్కడా జాప్యం లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. న్యాయవివాదాలు, పలుమార్లు ఫలితాల వెల్లడి, మెయిన్స్ మూల్యాంకనం రెండుసార్లు నిర్వహించాల్సి రావడం వంటి కారణాలతో 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ చొరవతో ఆ న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కరించి ఆ పోస్టులను భర్తీ చేశాం. సెప్టెంబర్ 30న గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్ ఇచ్చాం. దీనిద్వారా 92 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేస్తాం. గత గ్రూప్–1 నోటిఫికేషన్‌లో భర్తీ కాని పోస్టులు ఈ కొత్త నోటిఫికేషన్‌లో చేరతాయి. దీంతో ప్రస్తుత నోటిఫికేషన్‌లోని పోస్టుల సంఖ్య కొంత పెరిగే అవకాశముంది. కొన్ని పొరపాట్లతో అప్పటి గ్రూప్–1 పోస్టులకు వయోపరిమితి మించిపోయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈసారి అలాంటి వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రూప్–1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 2తో ముగిసినప్పటికీ 5 వరకు అవకాశం ఇచ్చాం. దీంతో 1.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
చదవండి: ఏపీపీఎస్సీ - సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్
అత్యంత ప్రతిభావంతుల ఎంపిక
ఏపీపీఎస్సీ పకడ్బందీ చర్యలతో వివిధ కేడర్ పోస్టుల్లో అత్యంత ప్రతిభావంతులు ఎంపికవుతున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 గ్రూప్–1 పోస్టులకు అత్యంత ప్రతిభావంతులు ఎంపికయ్యారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల డిజిటల్ వ్యాల్యుయేషన్‌పై న్యాయ వివాదం ఏర్పడడంతో హైకోర్టు ఆదేశాల మేరకు మ్యాన్యువల్‌గా 55 రోజుల్లో మూల్యాంకనాన్ని పూర్తి చేయించాం. ఇంటర్వ్యూలను కూడా గతంలో మాదిరి ఒక్క బోర్డుతో కాకుండా మూడు బోర్డులతో నిర్వహించాం. గతంలో కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒకే బోర్డుతో వీటిని నిర్వహించేవారు. ఇప్పుడు మూడు బోర్డుల్లోనూ కమిషన్ సభ్యులతోపాటు ఇద్దరు చొప్పున సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులుగా యూనివర్సిటీ వీసీ/విశ్రాంత వీసీలను నియమించాం. దీంతో 11 రోజుల్లోనే ఇంటర్వ్యూలను పూర్తి చేశాం. ఐఏఎస్‌కు ఎంపికైనవారు నలుగురు, ఐపీఎస్‌కు ఎంపికైనవారు ఇద్దరు ఈ గ్రూప్–1 పోస్టులకు ఎంపికయ్యారు. వీరితోపాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదువుకున్న అభ్యర్థులు మరో 20 మంది కూడా ఉన్నారు.
చదవండి: APPSC Group 1 Preparation Tips: గ్రూప్-1.. గురి పెట్టండిలా!
సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ
ఈసారి గ్రూప్–1 పోస్టులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా న్యాయపరమైన అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందుకు అనుగుణంగా నిర్దిష్ట విధానాలను రూపొందించాం. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయి.
చదవండి: Group 1 Preliminary Exam: 60 డేస్ ప్రిలిమ్స్ ప్లాన్.. సిలబస్, సబ్జెక్ట్ అంశాలు..