Skip to main content

APPSC Group 1 Results: గ్రూప్‌–1లో విజయకేతనం

appsc group 1 results topper

రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గ్రూప్‌–1 ఫలితాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉన్నత ఉద్యోగాలు సాధించారు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా భార్గవ్‌
రాజాం సిటీ: పట్టణ పరిధి సారథి గ్రామానికి చెందిన వావిలపల్లి భార్గవ్‌ గ్రూప్‌–1 ఫలితాల్లో స్టేట్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఎంపికయ్యాడు. ఆయన 1 నుంచి 10వ తరగతి వరకు రాజాంలోని శారదా కాన్వెంట్‌లో చదివి 557 మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్‌ విద్యను స్థానిక వేదగాయత్రి కళాశాలలోను, ఇంజినీరింగ్‌ విద్యను జీఎంఆర్‌ ఐటీలో పూర్తిచేశాడు. స్టేట్‌బ్యాంకు క్యాషియర్‌గా ఉద్యోగం సాధిస్తూ గ్రూప్స్‌కు సిద్ధమై విజయం సాధించాడు. సివిల్స్‌ సాధించడం లక్ష్యమని, ఆ దిశగా చదువుతు న్నట్టు భార్గవ్‌ తెలిపాడు. ఆయన తల్లి ఈశ్వరమ్మ గృహిణికాగా, తండ్రి విష్ణు జి.సిగడాం మండలం పాలఖండ్యాం యూపీ పాఠశాలలో హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు.

నెల్లిమర్ల రూరల్‌: ప్రాథమిక విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాలలోనే.. పట్టు విడవని సంకల్పం, పుస్తకాలతో నిరంతర కుస్తీ.. వెరసి ఆమెను తొలి ప్రయత్నంలోనే ఉన్నత ఉద్యోగిరాలిగా నిలబెట్టాయి. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించిన కెల్ల ఉదయపావని నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. నెల్లిమర్ల మండలంలోని మారుమూల గ్రామమైన అలుగోలుకు చెందిన పావని తండ్రి నారాయణప్పలనాయుడు రేషన్‌ షాపు డీలర్‌కాగా, తల్లి భారతి అంగన్‌వాడీ టీచర్‌. పావని పదో తరగతి వరకు గ్రామంలోని ఉన్నత పాఠశాలలోనే విద్యనభ్యసించారు. పదో తరగతి టాపర్‌గా నిలిచి విశాఖలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యను పూర్తి చేశారు. అనంతరం కాకినాడ జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేసి.. ఉద్యోగ సాధనలో నిమగ్నమయ్యారు. సివిల్స్‌ సాధనే లక్ష్యంగా చదువులు సాగిస్తున్న పావని.. 2022లో సివిల్స్‌లో 14 మార్కుల కటాఫ్‌తో ఉద్యోగానికి దూరమయ్యారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–1 పరీక్షలో విజేతగా నిలిచి డీఎస్పీ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఉంటూ సివిల్స్‌ సాధనకు శిక్షణ పొందుతున్నారు. ఆమె ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ... తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా ఎంపికకావడం సంతోషంగా ఉందని, సివిల్స్‌లో రాణించి కలెక్టర్‌ కావడమే లక్ష్యమన్నారు.

చదవండి: APPSC Group 1: గ్రూప్‌–1లో మెరిసిన సిక్కోలు బిడ్డలు

కెల్ల ఉదయ పావని జిల్లా రిజిస్ట్రార్‌గా మూర్తి
గుర్ల: మండలంలోని నాగళ్లవలసకు చెందిన అట్టాడ వెంకట రమ ణ మూర్తి గ్రూప్‌–1 ఫలితాల్లో విజేతగా నిలిచి జిల్లా రిజిస్ట్రార్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కుమారుడు ఉన్నత ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు అప్పలనాయుడు, పద్మావతి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

Published date : 19 Aug 2023 03:16PM

Photo Stories