Skip to main content

సముద్ర భూతలం

భూఉపరితలంపై సుమారు 71 శాతం సముద్రాలు ఆక్రమించి ఉన్నాయి. దక్షిణార్ధ గోళంలో సముద్ర భూభాగం వాటా 80.9 శాతం కాగా, ఉత్తరార్ధగోళంలో ఇది 60.7 శాతం. అందువల్ల దక్షిణార్ధగోళాన్ని సముద్ర అర్ధగోళంగా వ్యవహరిస్తారు.
సముద్ర భూతలం నాలుగు రకాలు..
సముద్ర భూతల నైసర్గిక స్వరూపం ఖండ నిమ్నోన్నతాల కంటే వైవిధ్యంగా ఉంది. నైసర్గిక స్వరూపాన్ని అనుసరించి సముద్ర భూతలాన్ని.. ఖండ తీరపు అంచు, ఖండ తీరపు వాలు, ఖండతీరపు ఉన్నతి, ఆభిసల్ మైదానంగా విభజించవచ్చు. తీరరేఖను ఆనుకుని ఉన్న సముద్ర భూతల భాగాన్ని ఖండ తీర అంచుగా వ్యవహరిస్తారు. ఇది తిన్నని వాలు (<1°) కలిగి ఉంటుంది. ఇది చాలా తక్కువ లోతు (< 200 మీ.) ఉండే సముద్ర ప్రాంతం. ఈ ప్రాంతం స్వభావ రీత్యా ఖండ భాగాలకు చెందింది. అంటే సముద్ర ముంపునకు గురైన ఖండ భాగం. అందువల్ల ఇది ఖండ భాగాలకు చెందిన సియూలిక్ భూ పటలాన్ని కలిగి ఉంది. ఖండతీర అంచు తర్వాత అకస్మాత్తుగా సముద్ర భూతలం వాలు నిటారుగా (3°-5°) మారుతుంది. ఈ ప్రాంతాన్ని ఖండతలపు వాలుగా పిలుస్తారు. ఈ భాగంలో సముద్ర లోతు 200 మీ. నుంచి 2500 మీ.కు వేగంగా పెరుగుతుంది. మొత్తం సముద్ర భూతలంలో ఖండతీరపు వాలు ప్రాంతం సుమారు 8.5 శాతం. సముద్ర తీరపువాలులో అనేక సముద్ర అంతర్గత అగాధ దరులు (Submarine Canyons) ఏర్పడ్డాయి. ఖండతీరపు వాలు, ఆబిసల్ మైదానం మధ్య ఉన్న సంధి మండలమే ఖండతీరపు ఉన్నతి. ఈ ప్రాంతంలో వాలు మధ్యస్తంగా (1°-3°) ఉంటుంది. ఆబిసల్ మైదానం విశాలమైన సమతల మైదానం. ఈ ప్రాంతంలో లోతు 2500-6000 మీటర్లు. ఈ లోతైన సముద్ర భాగంలో అనేక సముద్ర కొండలు, గయోట్లు విస్తరించి ఉన్నాయి. సముద్ర కొండలు అగ్నిపర్వత తరగతికి చెందినవి. వీటి ఎత్తు 1000 మీ. -2000 మీ. ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో సుమారు పది వేల అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఆబిసల్ మైదానంపై సమతల శిఖరాలు ఉన్న కొండలే గయోట్లు. ఈ సముద్ర కొండలను వేరు చేస్తూ విశాలమైన లోతట్టు హరివాణాలు ఉన్నాయి. మొత్తం సముద్ర భూతల వైశాల్యంలో ఆబిసల్ మైదానం వాటా సుమారు 80 శాతం. అట్లాంటిక్ మహాసముద్రంలో ఆబిసల్ మైదానం వాటా 60 శాతం మాత్రమే. లోతైన సముద్ర భాగాల్లో అఖాతాలు ఉంటాయి. ఫసిఫిక్ మహాసముద్రంలో అఖాతాలు ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఇవి సాధారణంగా ద్వీపకల్ప వక్రతల సమీపంలో ఏర్పడతాయి. పోర్టారికో, బార్లెటెకైమాన్, శాండ్‌విచ్‌లు అట్లాంటిక్ మహాసముద్రంలో ముఖ్య అఖాతాలు. హిందూ మహాసముద్రంలోని ముఖ్య అఖాతం జావా లేదా గ్రేటర్ సుండా .

పసిఫిక్ మహాసముద్రంలోని ముఖ్య అఖాతాలు

1) మెరియూనా

(11,176 మీ.)

2) కుర్లీ-కామాచాట్క

(10,542 మీ.)

3) ఫిలిప్పైన్

(10,539 మీ.)

4) కెర్మాడక్

(10,822 మీ.)

5) టాంగా

(10,850 మీ.)

6) న్యూహెర్బైడ్స్

సముద్రాల మధ్యభాగాల్లో అగ్నిపర్వత ప్రక్రియ వల్ల పొడవైన రేఖీయ పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి. వీటిని మిడ్ ఓషియూనిక్ రిడ్జ్‌లుగా పిలుస్తారు. అట్లాంటిక్ మహాసముద్రంలో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ విశిష్టమైంది. ఇది ఉత్తర-దక్షిణంగా ఏర్పడి అట్లాంటిక్ మహాసముద్రాన్ని పశ్చిమ, తూర్పు భాగాలుగా వేరుచేస్తోంది. భూమధ్యరేఖ సమీపంలోని రొమాంబ్ లోతు ప్రాంతం మిడ్ అట్లాంటిక్ రిడ్జ్‌ను రెండుగా విభజిస్తోంది. ఉత్తర మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ భాగం ఐస్‌లాండ్ సమీపంలో విశాలమైన పీఠభూమిలా ఏర్పడింది. దీన్ని టెలిగ్రాఫ్ పీఠభూమి అని పిలుస్తారు. ఐరోపా-ఉత్తర అమెరికాలను కలుపుతూ సముద్రం ద్వారా నిర్మించిన టెలిగ్రాఫ్ కేబుళ్లు ఈ పీఠభూమి నుంచే వెళ్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో మిడ్ ఓషియూనిక్ రిడ్జ్‌లు కేవలం ఆగ్నేయ ప్రాంతంలో మాత్రమే విశిష్టంగా ఏర్పడ్డాయి. హిందూ మహాసముద్రంలో లక్షదీవులు-చాగోస్ దీవుల మధ్య ఈ రిడ్జ్ ఏర్పడింది.

లవణీయత
ఇది సముద్ర జలాల ముఖ్య భౌతిక ధర్మం. సముద్ర జలాల్లో నిక్షిప్తమైన వివిధ లవణాల గాఢతనే లవణీయతగా పేర్కొనవచ్చు. సోడియం, పొటాషియం, కాల్షియంల క్లోరైడులు, సల్ఫేటులు, కార్బొనేటులు ముఖ్య లవణాలు. సోడియం క్లోరైడ్ అతిముఖ్య లవణం. అందువల్లే సముద్ర నీటి నుంచి ఉప్పును తయూరు చేస్తారు. ఖండాల మీది శిలలు క్రమక్షయం చెందడంతో ఏర్పడిన శిథిల శిలా పదార్థం.. సముద్రాలను చేరడమే సముద్ర జలాల లవణీయతకు ప్రధాన కారణం. సముద్ర భూతలం మీది అగ్నిపర్వత ప్రక్రియ, రోదసి నుంచి భూమికి చేరే ఉల్కాపాతాలు సముద్ర జలాల లవణీయతకు కారణాలు.
లవణీయతను గ్రా/కి.గ్రా.లలో కొలుస్తారు. సముద్రాల సగటు లవణీయత సుమారు 34.75 గ్రా./కి.గ్రా. అయితే లవణీయత విస్త రణలో ప్రాంతీయ వ్యత్యాసాలున్నాయి. గ్రీన్ లాండ్, ఐస్‌లాండ్‌ల సమీపంలోని ఆర్కిటిక్ సముద్రంలో లవణీయత కనిష్టంగా 5 గ్రా./కి.గ్రా. కంటే తక్కువ. మృత సముద్రంలో లవణీయత గరిష్టంగా 350 గ్రా./కి.గ్రా. కంటే ఎక్కువ. అధిక ఉష్ణోగ్రతల వల్ల భాష్పీభవన రేటు అధికంగా ఉండటంతో ‘ఆయన రేఖ, ఉప ఆయనరేఖ’ ప్రాంతాల్లో సముద్రాల లవణీయత గరిష్టం. ధృవాల వైపు వెళ్లే కొద్దీ లవణీయత క్రమంగా క్షీణిస్తుంది. భూమధ్యరేఖా ప్రాంతం లో ఉష్ణోగ్రత అధికమైనప్పటికీ, అధిక వర్షపా తం వల్ల లవణీయత తక్కువగా ఉంటుంది.
హిమనీ నదాలు కరగడం వల్ల గ్రీన్‌లాండ్, ఐస్‌లాండ్ సమీపంలోని ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటికా ఖండం సమీపంలోని సముద్రం, బాల్టిక్ సముద్రాల్లో లవణీయత తక్కువ. సాధారణంగా ఖండాంతర్భాగాల్లోని సముద్రాల్లో లవణీయత అధికంగా ఉంటుంది. ఉదాహరణకు మధ్యధరా, కాస్పియన్ సముద్రాలు. అయితే డాన్, నీపర్, నీస్టర్ లాంటి పెద్ద నదులు భారీ మొత్తాల్లో మంచి నీటిని తీసుకురావడంతో నల్లసముద్రంలో లవణీయత స్థాయి తక్కువగా ఉంది. నదీ ముఖద్వారాల వద్ద పెద్ద మొత్తాల్లో మంచినీరు చేరడంతో లవణీయత తక్కువగా ఉంటుంది.
Published date : 13 Oct 2015 04:55PM

Photo Stories