Skip to main content

భూగోళశాస్త్రం - శాస్త్రవేత్తలు

భూగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో జాగ్రఫీ అంటారు. జియో అంటే భూమి అని, గ్రఫీ అంటే వర్ణన లేక అధ్యయనం అని అర్థం.
ఎరిటోస్తనీస్: కీ.పూ.296-194లో జాగ్రఫీ అనే పదాన్ని మొదటిసారి ఉపయోగించిన గ్రీకు గణిత శాస్త్రవేత్త. జాగ్రఫియా అనే గ్రంథం రాశాడు. భూమి చుట్టుకొలతను తొలిసారి శాస్త్రబద్ధంగా లెక్కించాడు. ఇతణ్ని భూగోళశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు.

హెకటేవియస్ (క్రీ.పూ.550): గ్రీకు చరిత్రకారుడు. ఇతను కూడా భూగోళ శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధి పొందాడు. ప్రపంచ పటాలను రూపొందించడానికి నోమస్ అనే పరికరాన్ని ఉపయోగించాడు.

రిచర్డ్‌ హార్ట్షోర్న్‌: ఇతడు అమెరికన్ భూగోళ శాస్త్రవేత్త. 1959లో పర్‌స్పెక్టివ్ నేచర్ ఆఫ్ జియోగ్రఫీ అనే గ్రంథం రాశాడు. ఇతని నిర్వచనం ప్రకారం అస్తిర స్వభావం, లక్షణం గల భూ తలానికి కచ్చితమైన, క్రమబద్ధమైన వర్ణన, వివరణలను సమకూర్చడమే భూగోళ శాస్త్రజ్ఞుల ఉద్దేశం.

ఆధునిక భూగోళశాస్త్ర పితామహులు
అలెగ్జాండర్ వాన్ హంబోల్డ్ (1769-1859): కాస్మోస్ అనే గ్రంథాన్ని రాశాడు. జర్మనీ శాస్త్రవేత్త. అలాగే కార్‌‌ల రిట్టర్ కూడా జర్మనీకి చెందిన శాస్త్రవేత్త.

ఫ్రెడరిక్ రట్జెల్ (జర్మనీ): ఆధునిక మానవ భూగోళ శాస్త్ర పితామహుడు. ఈయన నిర్వచనం ప్రకారం భూతలానికి, మానవ సంఘాలకు మధ్య ఉన్న అనుబంధం గురిం చిన అధ్యయనమే మానవ భూగోళ శాస్త్రం.

హంటింగ్‌టన్: ఇతని నిర్వచనం ప్రకారం భౌతిక పరిస్థితులకు, పర్యావరణానికి మానవ ప్రతిస్పందనలను అధ్యయనం చేసేదే మానవ భూగోళశాస్త్రం.

డబ్ల్యు.ఎం.డేవిస్: భూస్వరూపశాస్త్ర పితామహుడు. భూమిపై వివిధ స్వరూపాలను వివరించాడు. నదులకు బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలు ఉంటాయని పేర్కొన్నాడు.

పాట్రిక్ గడెజ్ (స్కాట్లాండ్): సర్వ శాస్త్రాల సమ్మేళనమే భూగోళమని పేర్కొన్నాడు.

ఇమ్మాన్యుయేల్ కాంట్ (జర్మనీ): చరిత్రకు ఆధారం భూగోళం అని పేర్కొన్నాడు.

విశ్వం
విశ్వం గురించి అధ్యయనం చేసేదే ఖగోళ శాస్త్రం. దీన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, అమెరికన్ భాషలో ఆస్ట్రానమీ అని అంటారు.
విశ్వం అంటే వివిధ నక్షత్ర మండలాలు, అందులోని సౌర కుటుంబాలు, ఇతర నక్షత్రాల సమూహం.

టాలమి: గ్రీకు ఖగోళ శాస్త్రవేత్త (క్రీ.పూ.140). విశ్వం అంతటికీ భూమి కేంద్రం అనే భూకేంద్ర సిద్ధాంతాన్ని (Geocentric Theory) ప్రతిపాదించాడు. ఆల్మాగెస్ట్ అనే గ్రంథం రాశాడు.

కోపర్నికస్ (1473-1543): పోలెండ్ దేశస్తుడు. విశ్వానికి సూర్యుడు కేంద్రమనే సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని(Heliocentric Theory)ప్రతిపాదించాడు. On the Revolutions of the Celestial Spheres అనే గ్రంథం రాశాడు.

జోహన్నెస్ కెప్లర్ (జర్మనీ): గ్రహాల వృత్తాకార కక్ష్య గురించి తెలిపిన శాస్త్రవేత్త.

న్యూటన్ (1642-1726): Philosophiæ Naturalis Principia Mathematica అనే గ్రంథాన్ని రాశాడు. గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది ఖగోళశాస్త్రంలోనే గొప్ప మలుపు.

ఎడ్విన్ హబుల్: అమెరికా శాస్త్రవేత్త. విశ్వాన్ని టెలిస్కోప్ సాయంతో శోధించి, విశ్లేషించాడు. నక్షత్ర వీధులన్నీ వేటికవే దూరంగా విహరిస్తున్నాయని, సూర్యుడు పాలపుంత అనే నక్షత్ర వీధిలో ఓ నక్షత్రమని 1929లో ప్రతిపాదించాడు.

విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు
1.బిగ్ బ్యాంగ్ థియరీ:
1370 కోట్ల ఏళ్ల కిందట ఒక హైడ్రోజన్ మేఘం ఉండేది (అంతరిక్ష పదార్థం ఒక ముద్ద లాగ). ఉష్ణోగ్రతలు పెరగడం, సంపీడనం వల్ల విస్ఫోటనం జరగడంతో ఆ పదార్థమంతా ముక్కలుగా విశ్వాంతరాళం లోకి విస్తరించింది. అలా విడివడిన పదార్థ భాగాలు విశ్వాంతరాళంలో నిరంతరం వేగంగా సంచరిస్తూ నక్షత్ర మండలంగా ఏర్పడి, నిర్ణీత కక్ష్యలో కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి.
ఈ సిద్ధాంతాన్ని బెల్జియం శాస్త్రవేత్త జార్జెస్ అబె లెమిటియర్ (1927) ప్రతిపాదించాడు.
ఈ సిద్ధాంతానికి సంబంధించిన ప్రయోగాన్ని 2008, సెప్టెంబర్ 10న ఫ్రాన్‌‌స-స్విట్జర్లాండ్ సరిహద్దులోని తోరా-బోరా పర్వతాల్లో చేశారు.

2. నిరంతర సృష్టి సిద్ధాంతం
పదార్థం నిరంతరం ఉత్పత్తవుతూ విశ్వం విస్తరిస్తుందని థామస్ గోల్డ్, హెర్మాన్ బాండీ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.

3. డోలనా సిద్ధాంతం
విశ్వం కొన్ని కోట్ల ఏళ్లు సంకోచించి, కొన్ని కోట్ల ఏళ్లు వ్యాకోచిస్తుందని డోలనా సిద్ధాంతం తెలుపుతుంది. దీన్ని బ్రిటన్ శాస్త్రవేత్త అలెన్ శాండజ్ ప్రతిపాదించాడు.
నక్షత్రాలు వేడి వాయువులతో కూడిన ఖగోళ వస్తువుల (నీహారిక) నుంచి ఆవిర్భవించాయని హ్యూజెన్‌‌స అనే శాస్త్రవేత్త పేర్కొన్నాడు.

నక్షత్ర వీధులు: కేంద్రకం ఆకర్షణలో పరిభ్రమిస్తూ (పెద్ద సమూహాలుగా) ఏర్పడిన కొన్ని కోట్ల నక్షత్ర సముదాయాలను నక్షత్ర మండలం అంటారు. నక్షత్ర వీధులు మూడు భాగాలు.
1. సర్పిలాకార నక్షత్ర వీధి (స్పైరల్) - 80%
2. దీర్ఘవృత్తాకార నక్షత్ర వీధి (ఎలప్టికల్) - 17%
3. అసంఘటిత నక్షత్ర వీధి - (ఇర్రిలవెంట్)- 3%
రెండు గెలాక్సీల మధ్య దూరం సుమారు 20 వేల కాంతి సంవత్సరాలు.

పాలపుంత
గెలా అనేది గ్రీకు పదం. దీనికి సమానార్థం పాలు.
కొన్ని గెలాక్సీల సముదాయాన్ని క్లస్టర్ అంటారు.
సూర్యుడు, గ్రహాలు ఉన్న గెలాక్సీ పాలపుంత (పాలవెల్లి). ఇది సర్పిలాకార నక్షత్ర వీధి. సూర్యుడు ఈ నక్షత్ర వీధిలోనే ఉన్నాడు.
అంతరిక్ష నక్షత్ర మండల సమూహంలో పాలపుంత ఒకటి. ఇది కేంద్రకం నుంచి 32 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
పాలపుంత అనే గెలాక్సీకి దగ్గరలో గల గెలాక్సీ ఆండ్రోమెడ. విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా.
గ్రీకులు పాలపుంతను స్వర్గానికి దారిగా భావించారు. భారతీయులు ఆకాశ గంగ అన్నారు.
పాలపుంతను తెల్లని బూడిద మార్గం అని ఎస్కిమోలు పేర్కొన్నారు.
పాలపుంతను చైనీయులు ఖగోళ నదులు అని, హిబ్రూలు కాంతి నదులు అని అన్నారు.
విశ్వంలో ఎక్కువగా ఉన్న మూలకం హైడ్రోజన్. భూమిపై అధికంగా ఉన్నది నైట్రోజన్.

నక్షత్రాలు
స్వయం ప్రకాశక శక్తి గల ఖగోళ వస్తువులను నక్షత్రాలు అంటారు. ఇవి ఏర్పడటానికి కావాల్సిన ఉష్ణోగ్రతలు 10 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్.
నక్షత్రాల్లో ఉష్ణం, కాంతి, శక్తి జనించడానికి కారణం కేంద్రక సంలీనం.

నక్షత్ర దశలు
ఎ. న్యూట్రాన్ నక్షత్రాలు: నాడి కొట్టుకునే రీతిలో విద్యుదయస్కాంత శక్తిని విడుదలచేసే నక్షత్రాలు.
బి. అర్ధ నక్షత్రాలు: పూర్తిస్థాయి నక్షత్ర దశను పొందకముందే శక్తి జనక ప్రక్రియ ప్రారంభమయ్యే నక్షత్రాలు.
సి. అస్థిర నక్షత్రాలు: ఇంధనం అయిపోయిన తర్వాత నిర్దిష్ట కాల వ్యవధిలో కాంతి ప్రకాశతలో మార్పునకు లోనయ్యే నక్షత్రాలు. వీటినే చంచల నక్షత్రాలు అంటారు.
డి. స్థిర నక్షత్రాలు: కేంద్రక సంలీనం ప్రారంభమైన తర్వాత నిలకడగా ఒకే విధంగా ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రాలు.
ఇ. తాత్కాలిక నక్షత్రాలు: బాహ్య పొర పేలినట్లు కనిపించే నక్షత్రాలు. వీటి పేర్లు.. నోవా, సూపర్ నోవా.

అరుణ మహాతార
హైడ్రోజన్ వాయువు బాహ్య పొరలను ఆక్రమించి పరిమాణంలో, ప్రకాశతలో పూర్తిస్థాయి వృద్ధి పొందిన నక్షత్ర దశను అరుణ మహాతార (రెడ్ జెయింట్) అంటారు.
ప్రస్తుతం సూర్యుడు రెడ్ జెయింట్ దశలో ఉన్నాడు.

నోవా, సూపర్ నోవా
హైడ్రోజన్ వల్ల ఎక్కువ శక్తి (20 రెట్లు) ఉత్పత్తి అయి, దాని ప్రభావానికి నక్షత్ర బాహ్య ప్రదేశం లోనైతే దాన్ని నోవా అంటారు. నక్షత్రం మొత్తం ఆ ప్రభావానికి లోనైతే సూపర్ నోవా అంటారు.

బ్లాక్ హోల్స్
వీటి గురించి ఊహించింది ఐన్‌స్టీన్.
బ్లాక్‌హోల్స్ అనే పదాన్ని అమెరికాకు చెందిన జాన్ వీలర్ 1967లో ఉపయోగించాడు.
బ్లాక్‌హోల్స్ గురించి 1974లో స్టీఫెన్ హాకింగ్ వివరించాడు. వీటిపై పరిశోధనకు భారతీయ శాస్త్రవేత్త సుబ్రమణ్యం చంద్రశేఖర్ 1983లో నోబెల్ బహుమతి పొందారు.
సూర్యుడి కంటే 1.4 రెట్లు అధిక ద్రవ్యరాశి గల నక్షత్రమే బ్లాక్‌హోల్‌గా మారుతుంది.

కాంతి సంవత్సరం
ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణం చేసే దూరాన్ని కాంతి సంవత్సరం అంటారు.
కాంతి సంవత్సరం = 9.46073×1012 కి.మీ.
కాంతి వేగం సెకన్‌కు 2,99,793 కి.మీ. (3 లక్షల కి.మీ.) పార్సెక్ అంటే 3.26 కాంతి సంవత్సరాలు. దీన్ని కనుగొన్నది హెర్బర్ట్ హాల్‌టర్నర్
ఖగోళంలో దూరాలను కొలిచే పెద్ద ప్రమాణం పార్సెక్.


మాదిరి ప్రశ్నలు

1. సర్వ శాస్త్రాల సమ్మేళనమే భూగోళశాస్త్రం అని పేర్కొన్నవారు?
  1) టాలమి 
  2) కాంట్
  3) పాట్రిక్ గడెజ్ 
  4) డేవిస్

Published date : 09 Mar 2017 11:44AM

Photo Stories