Skip to main content

భారతదేశం మధ్యగా కర్కటక రేఖ (23బీని ఉత్తర అక్షాంశం) ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతోంది?

భారతదేశం– భూ స్వరూపాలు :
తీరమైదానాలు:

దక్కను పీఠభూమికి ఇరువైపులా అరేబియా సముద్రం, బంగాళాఖాతం వెంబడి తీర మైదానాలున్నాయి. అవి:
1. పశ్చిమ తీర మైదానం
2. తూర్పు తీర మైదానం
వీటి వెడల్పులు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉన్నాయి.

పశ్చిమ తీరమైదానం :
ఇది దక్కను పీఠభూమికి పశ్చిమం వైపున అరేబియా సముద్రం మధ్య వ్యాపించి ఉంది. ఈ మైదానం సన్నగా,అసమానంగా అక్కడక్కడ కొండల భూ భాగంతో ఉంది. ఇది గుజరాత్‌ తీరంలోని రాణా ఆఫ్‌ కచ్‌ నుంచి కేరళ తీరం వరకు విస్తరించి ఉంది. ఈ తీరం చాలా తక్కువ వెడల్పు (10 – 25 కి.మీ) కలిగి ఉంది. దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తున్నారు.
1. మహారాష్ట్ర, గోవా– కొంకణ్‌ తీరం
2. కర్ణాటక – కెనరా తీరం
3. కేరళ – మలబార్‌ తీరం
  • ఈ తీరమైదానంలో ఎక్కువ సంఖ్యలో నదీ ముఖద్వారాలున్నాయి. వీటిలో నర్మద, తపతి ముఖ్యమైనవి. వీటికి ఉత్తరంగా సబర్మతి, మహి మొదలైన నదుల వల్ల గుజరాత్‌ మైదానం ఏర్పడింది.
  • కర్ణాటక మైదానం ద్వారా శరావతి నది ప్రవహిస్తోంది. ఈ నదిపై దేశంలోనే అతి ఎత్తయిన∙జలపాతం జోగ్‌ (జర్సోప్పా) ఉంది. దీని ఎత్తు 275 మీ.
  • దీంట్లో మలబారు తీరం ఉప్పు నీటి సరస్సులకు ప్రసిద్ధి. వీటినే ‘లాగూన్‌’లు అని కూడా అంటారు. వీటిలో ముఖ్యమైనవి అష్టముడి, వెంబనాడు సరస్సులు.
తూర్పుతీర మైదానం :
ఈ మైదానం దక్కను పీఠభూమికి తూర్పున, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది. ఈ మైదానం పశ్చిమ తీరమైదానంలా కాకుండా బల్లపరుపుగా, ఎక్కువ వెడల్పుతో ఉంది. దీని సరాసరి వెడల్పు 120 కి.మీ. ఈ తీరానికి కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లు ఉన్నాయి.
1. పశ్చిమబెంగాల్‌ – వంగ తీరం
2. ఒడిశా – ఉత్కళ్‌ తీరం
3. ఉత్తర ఆంధ్ర – సర్కార్‌ తీరం
4. తమిళనాడు – కోరమాండల్‌ తీరం

ఈ తీరంలో ఉన్న ముఖ్యమైన సరస్సులు:

చిలకా సరస్సు: ఇది ఉప్పునీటి సరస్సు. ఒడిశా తీరంలో ఉంది.
కొల్లేరు సరస్సు: ఇది మంచినీటి సరస్సు. కృష్ణా, గోదావరి డెల్టాల మధ్య ఉంది.
పులికాట్‌ సరస్సు: ఇది ఉప్పునీటి సరస్సు. ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తమిళనాడు సరిహద్దులో ఉంది.
  • పులికాట్‌ సరస్సులో శ్రీహరికోట అనే దీవి ఉంది. దీని నుంచి రాకెట్లను ప్రయో గిస్తారు. దీన్ని సతీష్‌ధావన్‌ రాకెట్‌ ప్రయోగ కేంద్రంగా పిలుస్తారు. ఈ సరస్సును ఆనుకొని నేలపట్టు పక్షి సంరక్షణా కేంద్రం ఉంది.
  • ఈ తీరప్రాంతం నాలుగు ప్రధాన డెల్టాలకు నిలయంగా ఉంది.
అవి:
1. మహానది డెల్టా – ఒడిశా,
2. కృష్ణా, గోదావరి డెల్టాలు – ఆంధ్రప్రదేశ్,
3. కావేరి డెల్టా – తమిళనాడు.
  • ఇది వ్యవసాయ రంగానికి చాలా అనుకూలమైంది.
ఎడారులు :
భారత ఉపఖండంలో అతిపెద్ద ఎడారి థార్‌. దీన్ని భారతదేశ గొప్ప ఎడారి అంటారు. ఇది ఆరావళి పర్వతాలకు వాయవ్యంగా ఉంది. దీని విస్తీర్ణం సుమారు 2 లక్షల చ.కి.మీ.
  • ఈ ఎడారి రాజస్థాన్‌లో అధిక భాగం, హర్యానాలో కొంతభాగం, పాకిస్థాన్‌లో అతికొద్ది భాగం విస్తరించి ఉంది.
  • థార్‌ ఎడారిలో వార్షిక వర్షపాతం అతి తక్కువ. ఇక్కడ వర్షపాతం 10 సెం.మీ. నుంచి 50 సెం.మీ. వరకు ఉండటం వల్ల ఎక్కువగా ముళ్లపొదలతో కూడిన ఉద్భిజ్జాలు ఉన్నాయి.
  • థార్‌ ఎడారి ప్రాంతంలోని జోథ్‌పూర్, బికనీర్, జైసల్మీర్‌ భారతదేశ జనపదాల్లో ముఖ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి.
మాదిరి ప్రశ్నలు :
1. భారతదేశం మధ్యగా కర్కటక రేఖ (23బీని ఉత్తర అక్షాంశం) ఎన్ని రాష్ట్రాల ద్వారా పోతోంది?
1) 9
2) 3
3) 8
4) 10
Published date : 13 Jul 2019 01:57PM

Photo Stories