Skip to main content

Inter Exams 2024: ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఒంగోలు: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌, థియరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని ఆర్‌ఐవో ఎ.సైమన్‌ విక్టర్‌ తెలిపారు. స్థానిక ఆంధ్రకేసరి విద్యాకేంద్రం ఆవరణలో మంగళవారం ఇంటర్మీడియెట్‌ పరీక్షల నిర్వహణపై ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Andhrakesari Vidyakendram Intermediate Exams    Preparation for Intermediate Exams by RIO A. Simon Victor   Intermediate Exam Conducted by RIO A. Simon Victor  Intermediate Exams 2024 in Andhra Pradesh  Prakasam district education   Prakasam students set to appear for March Intermediate Exams  Students preparing for Prakasam Intermediate Public Exams

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 2న ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు నైతికత, మానవ విలువలు, 3వ తేదీ పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ రెండు పరీక్షలు ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు వారు చదివే కాలేజీలోనే తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందన్నారు. గతంలో విద్యాభ్యాసం చేసి పరీక్షలకు గైర్హాజరై ఉంటే వారు కూడా రాయవచ్చని చెప్పారు.

ఒకేషనల్‌ కోర్సుల ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు మూడు విడతల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో మొత్తం 46 జూనియర్‌ కాలేజీల్లో ఈ ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు బ్యాచ్‌లుగా పరీక్షలు ఉంటాయన్నారు. ప్రథమ సంవత్సరం 2395 మంది, ద్వితీయ సంవత్సరం 2501 మంది ఒకేషనల్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఎగ్జామినర్లను ఇంటర్‌ బోర్డు నియమిస్తుందని చెప్పారు.

చదవండి: AP Inter 1st Year Study Material

సైన్స్‌ విద్యార్థులకు ప్రాక్టికల్‌ పరీక్షలు జనరల్‌ కోర్సులైన ఎంపీసీ, బైపీసీ రెండో సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 11 నుంచి 20వ తేదీ వరకు రెండు విడతల్లో నిర్వహించాలన్నారు. 50 మందికి తక్కువగా ఉన్న పక్షంలో ఆ కాలేజీ విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ కేంద్రానికి కేటాయిస్తారని, అనుభవం ఉన్న సైన్స్‌ అధ్యాపకులను బోర్డు నియమిస్తుందని చెప్పారు. సైన్స్‌ ప్రాక్టికల్స్‌లో భాగంగా మైనర్‌ సబ్జక్టుగా ఉన్న జాగ్రఫీ ప్రాక్టికల్‌ పరీక్ష కేంద్రంగా గిద్దలూరు ఎస్‌వీ జూనియర్‌ కాలేజీని ఎంపిక చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా సైన్స్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు 13827 మంది హాజరుకావాల్సి ఉందన్నారు.

ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం థియరీ ఒకేషనల్‌, జనరల్‌ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని జూనియర్‌ కాలేజీలో తాగునీరు, ఫర్నిచర్‌, టాయిలెట్లు, సీసీ కెమెరాలు, భద్రత వంటి సదుపాయాలతో పరీక్షల నిర్వహణలో సమర్థతను చాటిన, గతంలో ఎటువంటి సమస్య వ్యక్తంకాని 69 కాలేజీలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేశారన్నారు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమిస్తారని, పరీక్షలను నియమ నిబంధనలతో కట్టుదిట్టంగా నిర్వహించేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. సమావేశంలో జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు అయిన కె.ఆంజనేయులు, కె.స్వరూపారాణి, జి.మనోహర్‌రెడ్డి, జిల్లా ఇంటర్‌ విద్య అధికారి ఐ.శ్రీనివాసరావు తదితరులు పలు సూచనలు చేశారు. నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా ఆయా కాలేజీలు, సిబ్బందిపై కఠినమైన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Published date : 01 Feb 2024 10:04AM

Photo Stories