Intermediate Practical Exams 2024: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): విద్యార్థి జీవితంలో ఇంటర్‌మీడియెట్ విద్య అత్యంత కీలకం. ఇంటర్ పరీక్షల్లో సాధించే మార్కులు పైచదువులకు అండగా ఉంటాయి. సైన్స్ విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు అత్యంత కీలకం. ప్రాక్టికల్స్‌పై మనస్సు పెడితే ప్రతి సబ్జెక్ట్‌లో 30కి 30 మార్కులు తేలికగా సాధించొచ్చని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రయోగ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నెల ఐదు నుంచి 20వ తేదీ వరకూ ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించి ఈ నెల ఐదో తేదీ నుంచి 20వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. సైన్స్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలు 11 నుంచి 20వ తేదీ వరకూ కొనసాగుతాయి.
Also Read : AP Inter 1st Year Chemistry study Material
కృష్ణాజిల్లాలో..
కృష్ణాజిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి 17,659 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 77 కళాశాలల్లో 131 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఎంపీసీకి సంబంధించిన 10,530 మంది, బైపీసీకి సంబంధించి 5,620 మంది మొత్తం 16,150 మంది, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం విద్యార్థులు 734 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 775 మంది చొప్పున మొత్తం 17,659 మంది ప్రాక్టికల్ పరీక్షలకు హాజరవుతారు. ఒకేషనల్ ప్రాక్టికల్స్ కోసం 16 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో..
ఎన్టీఆర్ జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలకు 78,509 మంది విద్యార్థులు హాజరవుతారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 70,200 మంది, 8,309 విద్యార్థులు ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. జనరల్ ప్రాక్టికల్ పరీక్షలకు 134 పరీక్ష కేంద్రాలను, ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు 20 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు.
ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్..
జనరల్, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ ప్రాక్టికల్స్ జరుగుతాయి. ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కొ సబ్జెక్టుకు 30 మార్కుల చొప్పున 60 మార్కులు ఉంటాయి. బైపీసీ విద్యార్థులకు నాలుగు సబ్జెక్టుల్లో 30 మార్కుల చొప్పున 120 మార్కులు కేటాయిస్తారు.
Also Read :1st Year Botany Study Material
20వ తేదీ వరకూ ఒకేషనల్ ప్రాక్టికల్స్ సైన్స్ విద్యార్థులకు 11వ తేదీ నుంచి..
పూర్తిస్థాయిలో పర్యవేక్షణ
రెండు జిల్లాల్లో ఈ నెల ఐదో తేదీ నుంచి జరిగే ప్రయోగ పరీక్షలకు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కొనసాగే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే ఆయా కేంద్రాలకు సంబంధించి సూచనలు చేశాం. సంబంధిత పర్యవేక్షకులకు సంబంధించి కట్టుదిట్టమైన ఆదేశాలు సైతం అందించాం.
– పెద్దప్రోలు రవికుమార్, ఆర్‌ఐఓ, ఉమ్మడి కృష్ణాజిల్లా
విస్తృత ఏర్పాట్లు..
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాల ఎంపికతో పాటుగా వాటికి బాధ్యులను కేటాయించడం, పరీక్ష సామగ్రి తరలించటం వంటి కార్యక్రమాలను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు జిల్లా ఒకేషనల్ విద్యాశాఖాధికారి సీఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.