AP Inter Hall Tickets Released: ఇంటర్ హాల్‌టికెట్స్ విడుదల, ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచింది. పరీక్ష ఫీజు చెల్లించిన మొత్తం 10,52,221 మంది విద్యార్థుల హాల్‌టికెట్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా, అదేవిధంగా ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్‌సైట్ https://bieap.apcfss.in/ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.
హాల్‌టికెట్స.. ఇలాడౌన్‌లోడ్ చేసుకోవచ్చు
2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,73,058 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు.మొదటి సంవత్సరం విద్యార్థులు వెబ్‌సైట్‌లో తమ పుట్టిన తేదీని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పుట్టిన తేదీ లేదా తమ మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, నేరుగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకావొచ్చని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌గౌర్ ప్రకటించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్స్..
ఎవరికైనా హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకపోతే ఆ విద్యార్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదిస్తే స్కాన్ చేసి ఫొటోతో కూడిన హాల్‌టికెట్‌ను ఇస్తారని వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి మొదటి సంవత్సరం, రెండో తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్‌లైన్ ద్వారా తీసుకోనున్నారు.
ప్రైవేటు యాజమాన్యాల వేధింపులకు చెక్
గతంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేసేవి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యేవారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డుకు కూడా అనేక ఫిర్యాదులు అందేవి. ఇప్పుడు ఎటువంటి వేధింపులు లేకుండా విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు పబ్లిక్ డొమైన్‌లోనే అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఎక్కడి నుంచి అయినా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించింది.