Software Job: ఇంటర్ చదువుతోనే ఐటీ కొలువు
రాయవరం: ఐటీ కొలువు సాధించాలంటే ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ చదవాలి. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదివిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్ బాట పడుతున్నారు. అయితే కేవలం ఇంటర్ చదువుతోనే ఐటీ కొలువు పొందే అవకాశాన్ని హెచ్‌సీఎల్ టెక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ కల్పిస్తోంది. ఇంటర్మీడియేట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు హెచ్‌సీఎల్ టెక్–బి సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇంటర్ విద్య అనంతరం నేరుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని విద్యార్థులు అందిపుచ్చుకునేలా కార్యక్రమాన్ని రూపొందించింది. ఇంటర్మీడియేట్ బోర్డు, హెచ్‌సీఎల్ టెక్–బి సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఇందులో ఎంపికై న విద్యార్థులు ఉద్యోగం చేసుకుంటూనే ఉన్నత చదువులను ప్రముఖ యూనివర్సిటీల్లో చదువుకునే చక్కటి అవకాశాన్ని కూడా కల్పించింది.
- ఇంటర్‌తో ఐటీ కొలువు
- హెచ్‌సీఎల్ టెక్–బీ,
- ఇంటర్ బోర్డు సంయుక్త ప్రణాళిక
- రిజిస్ట్రేషన్లకు తుది గడువు ఈ నెల 30
ప్రతి విద్యార్థి ప్రయోజకుడు కావాలనే..
ఇంటర్‌లో 75 శాతం మార్కులు సాధించే వారికి ఐటీ కొలువులు కల్పించే బాధ్యతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. విద్యలో ప్రతిభ చూపే విద్యార్థులను ప్రభుత్వం ఇప్పటికే అన్నివిధాలా ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు చిన్న వయసులోనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. రాష్ట్రంలో చదువుతున్న ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదగాలన్నదే లక్ష్యంగా విద్యా సంస్కరణలు ఇప్పటికే అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే హెచ్‌సీఎల్ టెక్–బి సంస్థ ద్వారా ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది.
Also Read : Bank Jobs: 5447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
రెండు విభాగాల్లో..
విద్యార్థులకు రెండు విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. ఇంటర్‌లో మ్యాథ్స్‌తో కూడిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రోల్స్ ఇవ్వబడతాయి. మ్యాథ్స్ లేని సీఈసీ, హెచ్‌ఈసీ, బైపీసీ, ఒకేషనల్ కోర్సులు చదివిన వారికి డిజిటల్ ప్రోసెస్ ఆపరేషన్స్ విభాగం (డీపీఓ)లో ఉద్యోగాలు ఇస్తారు. ఎంపీసీ, ఎంఈసీ చదివిన విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇస్తారు. దీనిలో ఎంపికై న వారికి ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకు సంబంధించి హెచ్‌సీఎల్ సంస్థ బిట్స్ పిలాని, శస్త్ర, అమిటీ (ఏఎంఐటీౖవై), ఐఐఎం నాగ్‌పూర్, కేఎల్ వర్సిటీ, ఐఐటీ గౌహతి, ఐఐఐటీ కొట్టాయంలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల ఫీజులో కొంత మొత్తాన్ని హెచ్‌సీఎల్ కంపెనీ చెల్లించనుంది.
Also Read : Success Story : చదువులో ఫెయిలయ్యా.. కానీ రూ.1,843 కోట్లు సంపాదించానిలా.. ఎలా అంటే..?
ఎవరు అర్హులంటే..
ఇంటర్మీడియేట్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అన్ని గ్రూపుల విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా హెచ్‌సీఎల్ టెక్–బి సంస్థ, ఇంటర్మీడియేట్ బోర్డు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2022, 2023లో ఉత్తీర్ణత సాధించిన వారు, 2024 విద్యా సంవత్సరంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్న వారు దీనికి అర్హులు. సంబంధిత విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ఈ సంస్థలో ఎంపిక కావడానికి విద్యార్థులకు మూడు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు. తొలుత క్యాట్ పరీక్ష ఉంటుంది. అనంతరం ఇంగ్లిష్ నైపుణ్య పరీక్ష నిర్వహించి, చివరిగా ఎంపికై న వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మూడు పరీక్షల్లో నెగ్గుకొచ్చిన విద్యార్థులకు ఏడాది పాటు శిక్షణనిస్తారు. శిక్షణ కాలంలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేల వంతున స్టైఫండ్ అందజేస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వేతనంతో కూడిన ఉద్యోగం లభిస్తుంది.
Also Read : Madhya Pradesh Tiger reserve: దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్‌గా మధ్యప్రదేశ్
ఆన్‌లైన్ పరీక్ష ఎప్పుడంటే..
వచ్చే నెల 11న ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులకు, వచ్చే నెల 12న కాకినాడ జిల్లా, 15న డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఆన్‌లైన్ కాట్ (కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్)కు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుంది. హెచ్‌టీటీపీఎస్://బీఐటీ.ఎల్‌వై/టీఈసీహెచ్‌బీఈఈజీవోఏపీ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కళాశాలల ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మాత్రం పైన తెలిపిన తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్‌లైన్ ద్వారా వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు కంపెనీ నుంచి ఫోన్ వచ్చిన తర్వాత తేదీని ప్రకటిస్తారు.
గొప్ప అవకాశంగా భావిస్తున్నా..
నేను ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెకండియర్ ఎంపీసీ చదువుతున్నాను. చదువుతో పాటు ఉద్యోగం కల్పించే విధంగా హెచ్‌సీఎల్ టెక్ సంస్థ నిర్వహిస్తున్న పరీక్షకు హాజరవుతున్నాను. దీనిని గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను.
– బి.ప్రియాంక, ఇంటర్ సెకండియర్,
ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజోలు
ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలి
అర్హత ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన వారికి విద్య, ఉపాధి ఒకేసారి లభిస్తుంది. అన్ని గ్రూపులకు సంబంధించిన విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాం.
– డి.సాయికిరణ్,
హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ ప్రతినిధి, విజయవాడ
అవగాహన కల్పిస్తున్నాం..
ఇంటర్ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన సమాచారాన్ని జిల్లాలో ఉన్న జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు అందించాం. అధిక సంఖ్యలో విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునేలా ప్రిన్సిపాల్స్ చర్యలు చేపట్టాలి.
– ఎస్‌వీవీ సత్యనారాయణరెడ్డి,
డీవీఈవో, అమలాపురం