Intermediate Practical Examinations2024 : ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి....
యలమంచిలి రూరల్: వచ్చే నెలలో జరగబోయే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి బి.సుజాత అధ్యాపకులకు సూచించారు. సోమవారం యలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాకు చెందిన సైన్సు సబ్జెక్టుల అధ్యాపకులకు నిర్వహించిన ప్రయోగ పరీక్షల ఓరియంటేషన్ తరగతులను ఆమె ప్రారంభించారు. ప్రయోగ పరీక్షల నిర్వహణ సమయంలో పాటించాల్సిన నిబంధనలు, ఇంటర్మీడియట్ విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాల గురించి వివరించారు. పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్ధులంతా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చూడాల్సిన బాధ్యత ఎగ్జామినర్లుగా నియమించబడే అధ్యాపకులపై ఉంటుందని చెప్పారు. జవాబు పత్రాల మూల్యాంకనం నిబంధనల ప్రకారం చేపట్టాలన్నారు.
Also Read : Free Coaching: NEET & JEE విద్యార్థులకు ఈ ప్రభుత్వం వరం!!
ఐఎఫ్‌పీలకు ప్రారంభోత్సవం
సర్కారు కళాశాలల్లో ప్రభుత్వం డిజిటల్ విద్య ప్రవేశపెట్టడం శుభపరిణామమని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి బి. సుజాత అభిప్రాయపడ్డారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వం సమకూర్చిన కొత్త ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్)లను ఆమె ప్రారంభించారు. ఐఎఫ్‌పీ ప్యానెళ్లతో బోధన మరింత సులభంగా,విద్యార్ధులకు అర్ధమయ్యేరీతిలో ఉంటుందన్నారు. పోటీ ప్రపంచంలో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్ధులు వెనుకబడకుండా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కళాశాలలో 11తరగతులకు ఐఎఫ్‌పీ ప్యానెళ్లను అమర్చారు. యలమంచిలి, లాలంకోడూరు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు బి.భాగ్యబతి, ఎం.వెంకట స్వామినాయుడు, చక్రధర్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.