DSC 2024: నిరుద్యోగులకు తీపి కబురు.. పోస్టులు సంఖ్య ఇలా..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పాఠశాలల అభివృద్ధితో పాటు, నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించే క్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు భారీగా పదోన్నతులు కల్పించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను నియమిస్తూ వస్తున్న ప్రభుత్వం తాజాగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ–2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఉపాధ్యాయ కొలువుల్లో చేరేందుకు కలలు కంటున్న నిరుద్యోగులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీపి కబురు అందించినట్లయింది. డీఎస్సీ–2024 నోటిఫికేషన్ నిరుద్యోగులకు వరంగా మారింది.
చదవండి: DSC 2008: ఎస్‌జీటీలుగా 2008–డీఎస్సీ అభ్యర్థులు
నోటిఫికేషన్ విడుదల
డీఎస్సీ నోటిఫికేషన్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫిబ్రవరి 7న విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 2,289 స్కూల్ అసిస్టెంట్, 2,280 ఎస్‌జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన 237 పోస్టులు భర్తీ కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్–1–44, ఎస్‌ఏ లాంగ్వేజ్–2–07 స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లిషు–38, ఎస్‌ఏ గణితం–15, ఎస్‌ఏ (పీఎస్)–04, ఎస్‌ఏ (బయాలజీ)–15, ఎస్‌ఏ (సోషల్)–12, ఎస్‌ఏ(ఫిజికల్ ఎడ్యుకేషన్)–102 పోస్టులు ఖాళీలున్నట్లుగా సమాచారం.
చదవండి: DSC/TETలో నెగ్గడానికి ఈ 180 రోజుల ప్లాన్ ఫాలో అవండి
ఎస్‌జీటీ ఖాళీలు ప్రస్తుతం లేనట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. డీఈడీ, బీఈడీ కోర్సులు పూర్తి చేసుకుని డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఉపాధ్యాయ పోస్టులకు అర్హత పరీక్షగా భావించే టెట్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9వ తేదీ వరకు ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
అభ్యర్థుల్లో ఆనందం
డీఎస్సీ నోటిపికేషన్ విడుదల చేయడం, పరీక్షల తేదీలను కూడా ప్రకటించడంతో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం కనిపిస్తోంది. ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీని విడుదల చేశారని ఉపాధ్యాయ పోస్టులకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్సీలో జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి. వాటిలో తాము పోటీ పడుతున్న వాటిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకునే పనిలో అభ్యర్థులు ఉన్నారు. పలువురు అభ్యర్థులు ఉద్యోగాలకు పోటీ ఏ రేంజ్‌లో ఉంటుందో లెక్కలు వేసుకుంటున్నారు.