స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం
ముఖ్యాంశాలు:
నేపాల్ రాజ్యాంగ నేపథ్యం
- 1959లో రాజు మహేంద్ర జారీ చేసిన రాజ్యాంగం ప్రకారం నేపాల్‌లో మొదటి ఎన్నికలు జరిగాయి. కాని ఒక సంవత్సరం లోపలే మళ్లీ రాజుకు అధికారం.
- 1991లో ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికలు జరిగాయి. కాని రాజు అధికారాలు పూర్తిగా తొలగించలేదు. కమ్యూనిస్టుల ఆందోళన.
- 2007లో రాచరికం రద్దయింది.
- 2007 లోనే నేపాల్‌లో రాజ్యాంగ నిర్మాణ ప్రక్రియ మొదలైంది. కాని 2014 వరకు కూడా పూర్తి కాలేదు.
భారత రాజ్యాంగ నిర్మాణం:-
- భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించి, ఆమోదించింది.
- 1946లో రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి.
- 1946లో బ్రిటిష్ ప్రభుత్వం పంపించిన ‘క్యాబినెట్ మిషన్’ ప్రణాళిక ప్రకారం రాజ్యాంగ సభ ఏర్పడింది.
- రాజ్యాంగ సభకు అన్ని రాష్ట్రాల నుంచి 292 మంది సభ్యులను ఎన్నుకోగా స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది నియమితులయ్యారు.
- అప్పటి జనాభాలో 10% ప్రజలకే రాష్ట్ర శాసన సభలకు ఓటువేసే హక్కు ఉండేది.
- రాజ్యాంగ సభలో అనేక కమిటీలు ఏర్పడ్డాయి. అందులో అతి ముఖ్యమైనది ముసాయిదా కమిటీ. దీని అధ్యక్షుడు డా॥అంబేద్కర్.
- ముసాయిదా కమిటీ రూపొందించిన రాజ్యాంగం అనేక సవరణల తర్వాత 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది.
- 1950 జనవరి 26 నుంచి ఇది అమలులోకి వచ్చింది.
- ముసాయిదా రాజ్యాంగం చాలా పెద్ద పత్రం. దీంట్లో 315 అధికరణలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి.
- ముసాయిదా రాజ్యాంగం భారతదేశంలో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతి పాదించింది.
- ఈ విధానంలో దేశాధిపతియైన రాష్ట్రపతి నామమాత్రంగా ఉండి, పార్లమెంట్‌లో సభ్యులైన ప్రధానమంత్రి, అతని మంత్రి మండలి నిజమైన అధికారాలు చెలాయిస్తుంది.
- భారత రాజ్యాంగం ఏకీకృత, సమాఖ్య రాజ్య లక్షణాలు కలిగి ఉంది.
- రాజ్యాంగ ముసాయిదాపై రాజ్యాంగ సభలో చర్చల సందర్భంగా అనేక విమర్శలు కూడా వచ్చాయి.
- మౌలానా హస్రత్ మోహానీ...‘ఇది 1935 చట్టానికి నకలు మాత్రమే’ అని ఆరోపించారు.
- దామోదర్ స్వరూప్ సేధ్ (డి.ఎస్.సేథ్)...‘సోవియట్ రాజ్యాంగం నుంచి ఏమీ గ్రహించలేదని, గ్రామాలను విస్మరించారని’ విమర్శించారు.
- భారత రాజ్యాంగం ప్రత్యేకత ప్రాథమిక హక్కులను కలిగి ఉండడం.
- ‘అంటరానితనం నిషేధం’ అనే అంశంపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగింది.
- ప్రొమధ రంజన్ ఠాకూర్, ఎస్.సి. బెనర్జీ, రోిహ ణీ కుమార్ చౌదరి, కె.ఎం. మున్షి, ధీరేంద్ర నాథ్ దత్త మొదలైన వారు ఈ చర్చలో పాల్గొన్నారు.
- సామాజిక మార్పుకు దోహదం చేసే అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. ఉదా: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారికి రిజర్వేషన్లు కల్పించడం.
- ప్రభుత్వాలు నిర్వర్తించవలసిన కర్తవ్యాలు ‘ఆదేశ సూత్రాలు’ విభాగంలో చర్చించారు.
- ఇప్పటి వరకు రాజ్యాంగానికి 100 కు పైగా సవరణలు జరిగాయి.
- పౌరులు నిర్వర్తించవలసిన కర్తవ్యాలు ‘పౌరవిధులు’ విభాగంలో సూచిస్తూ 1976లో 42వ సవరణ చేశారు.
- అదే సవరణలో ప్రవేశిక కు లౌకిక, సామ్యవాద, జాతీయ సమైక్యత అన్న పదాలు చేర్చారు.
- ప్రభుత్వ నిర్మాణం, సమాఖ్య లక్షణం, ఉన్నతమైన రాజ్యాంగం, సర్వసత్తాక దేశం, న్యాయం, సంక్షేమ రాజ్యం వంటిది ఏర్పాటు చేయడం...మన రాజ్యాంగ మౌలిక సూత్రాలు.
4 మార్కుల ప్రశ్నలు
1. రాజ్యాంగ సభ చర్చల నుంచి భారత ప్రభుత్వ ఏకీకృత, సమాఖ్య సూత్రాలను వివరించండి.జ: భారత ప్రభుత్వ ఏకీకృత సూత్రాలు:-
- ఒకే పౌర సత్వము.
- ఒకే న్యాయ వ్యవస్థ.
- పౌర, నేర అంశాలలోని మౌలిక చట్టాలలో సారుప్యత
- దేశమంతటికీ వర్తించే అఖిలభారత సివిల్ సర్వీసు
- అవశిష్ఠాధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉండటం.
- ఒకే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేస్తే కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది.
భారత ప్రభుత్వ సమాఖ్య సూత్రాలు:-
- కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది.
- భారతదేశానికి లిఖిత రాజ్యాంగం ఉంది.
- స్వతంత్రమైన న్యాయ వ్యవస్థ ఏర్పాటు.
- రాష్ట్రాలలో శాంతి భద్రతల సమస్య లేనంత వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదు.
2.ఆనాటి రాజకీయ ఘటనలను రాజ్యాంగం ఎలా ప్రతిబింబిస్తుంది? స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ఇంతకు ముందు అధ్యాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి.జ: భారత స్వాతంత్య్ర పోరాట కాలంలో సంభవించిన అనేక రాజకీయ ఘటనలు భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రతిబింబించాయి. ఆనాటి సమాజంలో ఉన్న వ్యవస్థలను తొలగిస్తూ, కొన్నిటినీ సవరిస్తూ రాజ్యాంగంలో అనేక అంశాలు చేరాయి.
- వంశ పారంపర్యంగా వచ్చే రాచరిక పాలన కాకుండా ప్రజలు ఎన్నుకునే విధంగా రాజ్యాంగ ప్రవేశికలో ప్రజాస్వామ్యము, గణతంత్రం అన్న పదాలు చేర్చారు.
- ఇకపై మనదేశం ఏదేశానికి లొంగి ఉండాల్సిన అవసరం లేదని ‘సర్వసత్తాక’ పదం సూచిస్తుంది.
- భారత ప్రజలు అంతవరకు అనుభవించిన అన్యాయాలు, నిర్బంధాలు దూరం చేయడానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు చేరాయి.
- 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేస్తూ ‘లౌకిక’ ‘సామ్యవాద’ ‘జాతీయ సమైక్యత’ అన్న పదాలను ప్రవేశికలో చేర్చారు. దీని ఉద్దేశం భారతదేశంలో మత భేదాలు, ఆర్థిక తారతమ్యాలు లేని దేశంగా చేయడం.
- ప్రాచీన కాలం నుంచి బ్రిటిష్ వారి కాలం వరకు భారతీయులు అనుభవించిన సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాలను తొలగించడానికి ‘ప్రాథమిక హక్కులు’ చేరాయి.
- అంతకు ముందు ప్రజలందరికీ ఓటుహక్కు లేదు. కాని రాజ్యాంగం ‘సార్వత్రిక వయోజన ఓటు హక్కు’ కల్పించింది.
- గాంధీజీ సూచించిన అనేక ఆదర్శాలను ‘ ఆదేశ సూత్రాల’ విభాగంలో చేర్చారు. ఉదా: గోహత్యని నిషేధించడం, మద్యపాన నిషేధం, గ్రామ పంచాయితీల ఏర్పాటు మొదలైనవి.
- పౌరులు హక్కులు పొందడమే కాకుండా దేశంలో ఒక పౌరునిగా వారు నిర్వర్తించాల్సిన విధులను కూడా ‘ప్రాథమిక విధులు’ అనే అంశంలో చేర్చారు.
- అల్పసంఖ్యాక వర్గాలు, అణగారిన వర్గాల ప్రయోజనాలు కాపాడటానికి అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి.
3. రాజ్యాంగ సభను సార్వత్రికవయోజన ఓటు హక్కుతో ఎన్నుకుని ఉంటే రాజ్యాంగాన్ని రూపొందించడంలో అది ఎలాంటి ప్రభావాన్ని చూపించి ఉండేది?జ: రాజ్యాంగ సభ ఎన్నికలు సార్వత్రిక వయోజన ఓటు హక్కు ప్రాతిపదికన జరగలేదు. రాజ్యాంగ సభ సభ్యులను అప్పటికే ఎన్నికైన రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. అంటే ఇది పరోక్ష ఎన్నిక. ఆ శాసన సభ సభ్యులు కూడా సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో ఎన్నిక కాలేదు. అప్పటికి ప్రజలలో 10% మందికే ఓటు హక్కు ఉంది.
ఒకవేళ రాజ్యాంగ సభను సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో ఎన్నుకొని ఉంటే అది క్రింది విధంగా ప్రభావాన్ని చూపేది.
- 1946లో ఎన్నికైన రాజ్యాంగ సభలో నిపుణులైన, నిష్ణాతులైన అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వారు ఉన్నారు. అన్ని రంగాల్లో ఆరితేరిన వారున్నారు. సార్వత్రిక వయోజన ఓటు హక్కు పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే ఈ విధంగా నిపుణులు ఎన్నికయ్యే అవకాశం ఉండేది కాదేమో.
- అల్ప సంఖ్యాక వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మొదలైన వర్గాల నుంచి కూడా రాజ్యాంగ సభకు ఎన్నికైన వారిలో ఉన్నారు. రాజ్యాంగ నిర్మాణంలో వీరు అయా వర్గాల ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇచ్చారు. సార్వత్రిక పద ్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే ఇలా జరిగేది కాదు.
- సార్వత్రిక వయోజన ఓటు హక్కు పద ్ధతిలో ఎన్నికలు జరిగి ఉంటే అన్ని ప్రాంతాలు వారు అన్ని వర్గాల వారు ఎన్నికల్లో పాల్గొనేవారు. వారికి ఒక సంతోషం ఉండేది.
- కాని ప్రలోభాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉండేవి.
- అప్పుడు నిరక్షరాస్యత ఎక్కువ కాబట్టి ప్రజలకు సరియైన అవగాహన ఉండేది కాదు. నిపుణులైన వారు కాకుండా ఇతరులు ఎన్నికయ్యే అవకాశం ఉండేది.
4. భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల గురించి చిన్న వ్యాసం రాయండి?జ: సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పును ఇస్తూ దేశ మనుగడ కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని వాదించింది. ఏవి మౌలిక సూత్రాలన్న విషయంలో న్యాయమూర్తులలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ క్రింది వాటిపై ఏకాభిప్రాయం కుదిరింది.
- ప్రభుత్వ నిర్మాణం
- సమాఖ్య లక్షణం
- ఉన్నతమైన రాజ్యాంగం
- సర్వసత్తాక దేశం
- న్యాయం
- సంక్షేమ రాజ్యం
- ప్రభుత్వ నిర్మాణం: కేంద్ర, రాష్ట్రాలలో ప్రభుత్వ నిర్మాణం ‘‘పార్లమెంటరీ వ్యవస్థ’’ తరహాలో ఉండాలని రాజ్యాంగం సూచించింది. అంటే రాష్ట్రపతి లేదా గవర్నర్లు నామమాత్రంగా ఉండి ప్రధానమంత్రి లేక ముఖ్యమంత్రి వాస్తవ అధికారాలు చెలాయిస్తారు.
- సమాఖ్య లక్షణం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు స్పష్టంగా విభ జించింది. కేంద్రజాబితాలో అధికారాల పంపిణీ జరిగింది. స్వతంత్రమైన వ్యవస్థ ఉంది. లిఖిత రాజ్యాంగం ఉంది.
- ఉన్నతమైన రాజ్యాంగం: భారత రాజ్యాంగం చాలా ఉన్నతమైనది. దేశంలో కెల్లా అతి ప్రధానమైన చట్టాలలో ముఖ్యమైనది భారత రాజ్యాంగం చట్టం.
- సర్వసత్తాక దేశం: ఆంతరంగిక, బాహ్య విషయంలో భారతదేశం సర్వసత్తాక అధికారం కలిగి ఉంది. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదు.
- న్యాయం: వెనుకబడిన వర్గాల వారికి న్యాయం కల్పించాలి. రాజ్యాంగ ప్రవేశిక రాజకీయ, ఆర్థిక,సామాజిక అనే మూడు న్యాయాలను సూచిస్తుంది.
- సంక్షేమరాజ్యం: షెడ్యూల్డ్ కులాలు, షెల్యూల్డ్ తెగలు, వెనుక బడిన వర్గాలు, పేదలు, మైనారిటీలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లలు, మహిళలు మొదలైన వారి సంక్షేమం కోసం రాజ్యాంగం అనేక సూచనలు చేసింది.
ఇవే కాకుండా రాజ్యాంగ ప్రవేశిక సూచించిన లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం మొదలైనవి కూడా రాజ్యాంగ మౌలిక సూత్రాలుగా తెలుపవచ్చు.
5. దేశంలోని రాజకీయ వ్యవస్థలను రాజ్యాంగం ఎలా నిర్వచించింది. వాటిని ఎలా మార్చింది?
జ: దేశంలోని రాజకీయ వ్యవస్థలను రాజ్యాంగం ఈ క్రింది విధంగా నిర్వచించింది.
- రాష్ట్రపతి: రాష్ట్రపతి దేశానికి అధిపతి (అధ్యక్షడు) అయితే ఇతనికి అమెరికా అధ్యక్షుని వలె సర్వాధికారాలు ఉండవు. కేవలం నామమాత్రపు అధికారాలు మాత్రమే ఉంటాయి. దేశ పరిపాలన రాష్ట్రపతి పేరు మీదగానే జరుగుతుంది.
- ప్రధానమంత్రి - మంత్రి మండలి: రాష్ట్రపతికి పరిపాలనలో సహకరించడానికి ప్రధానమంత్రి నాయకత్వంలో ఒక మంత్రి మండలి ఉంటుంది. వీరు నిజమైన కార్యనిర్వాహకులుగా ఉంటారు. వీరు పార్లమెంట్‌లో ఏదో ఒక సభలో సభ్యులై ఉంటారు.
- పార్లమెంట్: రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ ఈ మూడు వ్యవస్థలను కలిపి పార్లమెంట్ అంటారు. లోక్ సభ దిగువసభ, రాజ్యసభ ఎగువసభ.
- పార్లమెంటరీ వ్యవస్థ: దేశాధిపతి అయిన రాష్ట్రపతికి నామమాత్రపు అధికారాలు, పార్లమెంట్‌లో సభ్యులైన ప్రధానమంత్రి, అతని మంత్రి మండలికి నిజమైన అధికారాలు ఉండటం.
- గవర్నర్: గవర్నర్ ఒక రాష్ట్రానికి అధిపతి, రాష్ట్ర పరిపాలన ఇతని పేరు మీదుగానే జరుగుతుంది. అయితే ఇతను రాష్ట్రపతి లాగా నామ మాత్రపు అధికారాలు మాత్రమే కలిగి ఉంటాడు.
- ముఖ్యమంత్రి: ఒక రాష్ట్రంలో గవర్నర్‌కు పరిపాలనలో సహకరించడానికి ముఖ్యమంత్రి నాయకత్వాన మంత్రి మండలి ఉంటుంది. ఇది కేంద్ర మంత్రి మండలిని పోలి ఉంటుంది. వీరు రాష్ట్రంలోని శాసనసభలో తప్పనిసరిగా సభ్యులై ఉండాలి.
- శాసనసభ: రాష్ట్ర స్థాయిలో చట్టాలు రూపొందించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ, కొన్ని రాష్ట్రాల్లో రెండు సభల విధానం ఉంది. శాసనసభ, శాసన మండలి ఉంటాయి.
- ఏకీకృత న్యాయ వ్యవస్థ: దేశ మంతటికి వర్తించే ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయ స్థానం. ఒక రాష్ట్రంలో హైకోర్టు అత్యున్నతమైనది.
- సమాఖ్య వ్యవస్థ: కేంద్ర, రాష్ట్రాల మధ్య స్పష్టమైన అధికారాల విభజన ఉంది. ఈ సమాఖ్య వ్యవస్థ అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది.కాని అమెరికా సమాఖ్యకు, భారతదేశ సమాఖ్యకు చాలా తేడాలు ఉన్నాయి. అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం ఉండగా భారతదేశంలో ఏక పౌరసత్వము ఉంది. అమెరికాలో రాష్ట్రానికి, రాష్ట్రానికి వేరే వేరే న్యాయ చట్టాలు ఉండగా భారత దేశంలో దేశ మంతటికీ ఒకే న్యాయ చట్టం అమలు అవుతుంది.
6. రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు ఉంటాయి. అయితే ప్రజలు వ్యవస్థతో తలపడినపుడే సామాజిక మార్పు వస్తుంది. ఈ వ్యాఖ్యతో మీరు ఏకీభవిస్తారా?జ: రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు ఉంటాయి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సమాఖ్య వ్యవస్థ, సంక్షేమ రాజ్యం, సర్వ సత్తాక రాజ్యం మొదలైనవి మౌలిక సూత్రాలు అయితే వీటి అమలుకు ప్రజలు పోరాడవలసి వస్తుంది. ఈ వ్యాఖ్యతో నేను ఏకీభవిస్తాను.
కారణాలు:
- న్యాయం అనే అంశం కింద రాజ్యాంగం ద్వారా ప్రజలకు సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయాలను అందించాలని సూచించింది.
- సామాజిక న్యాయాన్ని అందించడానికి షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల వారికి రిజర్వేషన్లు కల్పించారు. అయితే అవి అంత సులభంగా జరగలేదు. వారి పోరాటాల వల్లనే అన్ని రంగాల్లో వీరికి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. విద్య, ఉద్యోగాలే కాకుండా ప్రమోషన్లలో కూడా వీరికి రిజర్వేషన్లు కల్పించారు. అలాగే అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు, వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించారు.
- ఆర్థిక న్యాయం అందించడానికి ‘సామ్యవాదం’ అన్నపదం 1976లో 42వ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికకు చేర్చారు. అలాగే 1978లో 44వ సవరణ ద్వారా ‘ఆస్తిహక్కు’ను ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.
- రాజకీయ న్యాయం కోసం ‘సార్వత్రిక వయోజన ఓటు హక్కు’ ప్రవేశపెట్టారు.
- స్వేచ్ఛ, సమానత్వం మొదలైనవి సాధించుకోవడానికి బడుగు, బలహీన వర్గాలు, మహిళలు అనేక పోరాటాలు చేయవలసి వచ్చింది.
- సమాఖ్య వ్యవస్థ కాపాడుకోవడానికి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో తలపడుతూనే ఉన్నాయి.
- సర్వసత్తాక రాజ్యంగా మనదేశాన్ని నిలుపుకోవడానికి ఇతర దేశాలతో తలపడవలసి వస్తుంది.
- భారత రాజ్యాంగంలోని 17వ ప్రకరణను అనుసరించి అంటరానితనం నేరం. కాని దానిని అమలు చేయడానికి అనేక సంవత్సరాలుగా పోరాటం చేయవలసి వచ్చింది.
- బాలల హక్కుల పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన తర్వాతే వారి కోసం విద్యాహక్కు చట్టం, 2009 అమలులోకి వచ్చింది.
-
ఎన్ని పోరాటాలు చేసినా చట్ట సభల్లో మహిళలకు ఇప్పటికీ రిజర్వేషన్లు కల్పించలేదు.
ఇచ్చి పాఠ్యాంశాన్ని చదివి, వ్యాఖ్యానించడం:-
7. క్రింది విషయాన్ని చదివి నీ అభిప్రాయాన్ని తెలుపుము.
సమాఖ్య వ్యవస్థలోని ద్వంద్వ రాజ ్యతంత్రంలో ద్వంద్వ న్యాయవ్యవస్థ ద్వంద్వ న్యాయ సూత్రాలు, ద్వంద్వ సివిల్ సర్వీసులు అనివార్య పరిణామంగా ఉంటాయి. అమెరికాలో సమాఖ్య న్యాయవ్యవస్థ, రాష్ట్ర న్యాయవ్యవస్థ రెండూ వేరు, వేటికవి స్వతంత్రమైనవి. భారత సమాఖ్యలో ద్వంద్వ రాజ్య తంత్రాలు ఉన్నప్పటికీ, ద్వంద్వ న్యాయ వ్యవస్థలు లేనే లేవు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం. రాజ్యాంగ చట్టం, పౌరచట్టం నేర చట్టాల కింద అన్ని విషయాలలో వీటి పరిధి ఉండి న్యాయం చేకూర్చవచ్చు. న్యాయం చేకూర్చే విధానంలో వైవిధ్యత లేకుండా చేయడానికి ఇలా చేశారు. దీనికి కెనడా దేశం ఒక్కటే చాలా వరకు సమీప పోలిక కలిగి ఉంది. ఆస్ట్రేలియా విధానం, ఇదీ ఒకటే అనిపిస్తాయి. కానీ ఒకటి కావు.
జ:
- ఏదేశ రాజ్యాంగమైనా ఏకీకృత వ్యవస్థ గాని, సమాఖ్య వ్యవస్థ గాని సూచిస్తుంది.
- సమాఖ్య వ్యవస్థలో ద్వంద్వ రాజ్యతంత్రాలు ఉంటాయి. అలాగే ద్వంద్వ న్యాయవ్యవస్థ, ద్వంద్వ న్యాయ సూత్రాలు, ద్వంద్వ సివిల్ సర్వీసులు ఉంటాయి.
- దీనికి మంచి ఉదాహరణ అమెరికా దేశం. అక్కడ దేశం మొత్తానికి సమాఖ్య న్యాయవ్యవస్థ ఉంటుంది. అలాగే ప్రతీ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర న్యాయవ్యవస్థ ఉంటుంది.
- అయితే భారతదేశం సమాఖ్యగా ప్రకటించినప్పటికీ ద్వంద్వ రాజ్యాతంత్రాలు ఉన్నాయి. కాని ద్వంద్వ న్యాయవ్యవస్థలు లేవు.
- హైకోర్టుగాని, సుప్రీంకోర్టు గాని ఒకే సమగ్ర న్యాయవ్యవస్థలో భాగం.
- దేశం మొత్తంలో న్యాయం చేకూర్చే విధానంలో తేడా లేకుండా ఉండటానికి ఇలా చేశారు. ఈ వ్యవస్థ కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
- ఆస్ట్రేలియాలో ఉన్న విధానం ఇలాగే కనబడినా చాలా తేడా ఉంది. అక్కడ రాష్ట్ర కోర్టులు ఇచ్చిన తీర్పులను దేశ ఉన్నత న్యాయస్థానం మార్చలేదు.
- కాని భారత దేశంలో రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై దేశ ఉన్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే అంతిమ తీర్పు.
8. అంశాన్ని చదివి నీ అభిప్రాయాన్ని తెలియజేయుము.
సామాజిక మార్పుకు దోహదం చేసే అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. అంటరానితనాన్ని నిషేధించటం గురించి మీరు చదివారు. దీనికి ఒక మంచి ఉదాహరణ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వేషన్లు కల్పించటం. ఈ వర్గాలు తరతరాలుగా ఎదుర్కొన్న అన్యాయాలను అధిగమించడానికి, వారి ఓటు హక్కుకు సరైన అర్థాన్ని ఇవ్వడానికి కేవలం సమానత్వపు హక్కు ఇస్తే సరిపోదని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. వాళ్ల ప్రయోజనాలను ప్రోత్సాహించేందుకు ప్రత్యేక రాజ్యాంగ చర్యలు అవసరం. అందుకనే షెడ్యుల్డ్ తెగల, షెడ్యుల్డ్ కులాల ప్రయోజనాలను కాపాడటానికి శాసనసభా స్థానాల రిజరే ్వషన్ వంటి అనేక ప్రత్యేక అంశాలను రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. ఈ వర్గాలకు ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో రిజర్వేషన్లకు కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది.
జ:
- అనాది వెనుక బాటు తనానికి గురియైన బడుగు, బలహీన వర్గాలను ఉన్నతిలోకి తీసుకొని రానంత వరకు దేశాభివృద్ధి జరగదు.
- వీరి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినపుడే వారు ఉన్నతిలోకి వస్తారు. అప్పుడు మాత్రమే సామాజిక మార్పు సాధ్యమవుతుంది.
- మనం రూపొందించుకున్న రాజ్యాంగంలో సామాజిక మార్పు కోసం అనేక అంశాలు చేర్చబడ్డాయి.
- దీనికి ఒక మంచి ఉదాహరణ రాజ్యాంగంలో షెడ్యూల్డు కులాలు,షెడ్యూల్డుతెగలకు రిజర్వేషన్లు కల్పించడం.
- కేవలం సమానత్వపు హక్కును ఇచ్చినంత మాత్రాన వీరికి జరిగిన అన్యాయం సమసిపోదని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.
- షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డుతెగల వారికి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించారు.
- పార్లమెంట్, శాసనసభల్లో కొన్ని సీట్లు వీరికోసం కేటాయించడం జరిగింది.
- ఉద్యోగాల్లోనే కాకుండా ప్రమోషన్లలో కూడా వీరికి రిజర్వేషన్లు ఉన్నాయి.
- వీరి పిల్లలు చదువు కోవడానికి విద్యాలయాల్లో రిజర్వేషన్లు కల్పించడమే గాక, ప్రత్యేక హాస్టల్ సదుపాయాలు కల్పిస్తున్నారు.
- కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వీరి అభ్యున్నతి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.
ఉదా: తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన ‘భూమి పంపిణీ కార్యక్రమం’,‘కల్యాణ లక్ష్మీ’ కార్యక్రమం - అయితే ఈ ప్రత్యేక సౌకర్యాలు ఎంతకాలం కొనసాగాలనేదిపై ఒక కాలపరిమితి ఉండాలి.
- రాజ్యాంగ నిర్మాతలు 10 సంవత్సరాల కాలపరిమితి విధించారు. కాని రాజ్యాంగం ఏర్పడి 60 సంవత్సరాలు దాటినా ఇవి కొనసాగుతూనే ఉన్నాయి.
- దీని వల్ల ఇతర వెనుక బడిన వర్గాలు, ఉన్నత వర్గాల్లో పేదలు సమాన అవకాశాలను కోల్పోతున్నారు.
- రిజర్వేషన్లు ఉపయోగించుకున్న కుటుంబాలే మళ్లీ మళ్లీ ఉపయోగించుకుంటూ కొంతమందే పైకి వస్తున్నారు తప్ప మిగతా వారు వెనుకబడుతున్నారు. కావున దీనికి పరిమితులు విధించాల్సిన అవసరం ఉంది.
సమాచార నైపుణ్యాలు:
9. క్రింది సమాచారాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయండి.
1946 జూలై | రాజ్యాంగ సభకు ఎన్నికలు |
1946 డిసెంబర్ 13 | రాజ్యాంగ సభలో జవహర్‌లాల్ నెహ్రూ ముఖ్యమైన ప్రకటన (ఆశయాల తీర్మాణం) |
1947 ఆగస్టు 14 | దేశ విభజన |
1947 ఆగస్టు 29 | ముసాయిదా కమిటీ ఏర్పాటు |
1948 నవంబర్ 4 | రాజ్యాంగ సభలో బి.ఆర్ అంబేద్కర్ చే ముసాయిదా రాజ్యాంగం సమర్పణ, ప్రసంగం |
1949 నవంబర్ 26 | ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించడం. |
1950 జనవరి 26 | భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. |
1. రాజ్యాంగ సభలో ఆశయాల తీర్మాణాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు? ఎప్పుడు?
2. రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పడింది? దాని అధ్యక్షుడు ఎవరు?
3. రాజ్యాంగ సభలో ముసాయిదా రాజ్యాంగాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? ఎప్పుడు?
4. ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన తర్వాత ఎంత కాలానికి అమలు లోకి వచ్చింది?
జ: 1. జవహర్ లాల్ నెహ్రూ, 1946 డిసెంబర్ 13
2. 1947 ఆగస్టు 29, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
3. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, 1948, నవంబర్ 4
4. రెండు నెలలు
10. క్రింది గ్రాఫ్‌ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు వ్రాయుము.
గ్రాఫ్ వేయాలి
1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటి నుంచి 2013 వరకు చేసిన రాజ్యాంగ సవరణలు.
1. ఏ దశాబ్దంలో రాజ్యాంగ సవరణలు తక్కువగా ఉన్నాయి.?
2. 1971-80లో రాజ్యాంగ సవరణలు ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి?
3. రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి 2013 వరకు మొత్తం ఎన్ని సవరణలు జరిగాయి?
4. మొదటి మూడు దశాబ్దాలలో జరిగిన సవరణలకు, చివరి మూడు దశాబ్దాలలో జరిగిన సవరణలకు తేడా ఎంత?
జ: 1. 1951- 60
2. 1971-81లో రాజ్యాంగానికి కీలకమైన సవరణలు చేశారు. ప్రవేశికకు లౌకిక, సామ్యవాద, జాతీయ సమైక్యత అనే పదాలు చేర్చడం, ఆస్తి హక్కును తొలగించడం మొదలైనవి.
3. 99
4. 11
2 మార్కుల ప్రశ్నలు
1. నేపాల్ రాజ్యాంగం నిర్మాణ చరిత్ర తెలపండి.
జ: నేపాల్ రాజ్యాంగ నిర్మాణ చరిత్ర:
- 1959లో రాజు మహేంద్ర జారీ చేసిన రాజ్యాంగం కింద నేపాల్‌లో మొదటి ఎన్నికలు జరిగాయి. అయితే ఒక సంవత్సరం లోపలే తిరిగి రాజరికం పునరుద్ధరించింది.
- 1991లో ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. అయితే రాజరికం రద్దు కాలేదు.
- చివరికి 2007 రాజరికం రద్దు చేయడంతో నూతన రాజ్యాంగ నిర్మాణం ప్రారంభమైంది.
- కాని 2014 నాటికి కూడా రాజ్యాంగం పూర్తి కాలేదు. దీనికి ప్రధాన కారణం అక్కడి రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం.
2. రాజ్యాంగం నిర్వహించే రెండు ముఖ్యమైన విధులు ఏవి?జ: రాజ్యాంగం నిర్వహించే రెండు ముఖ్యమైన విధులు:
- పౌరుల హక్కులు, బాధ్యతలను పేర్కొనడం, ప్రభుత్వం దాని అంగాలైన కార్యనిర్వాహక, శాసన, న్యాయ శాఖలు వంటి వాటి నిర్మాణం అధికారాలను పేర్కొనడం.
- ప్రభుత్వం, సమాజం కలిసి నిర్మించాల్సిన భవిష్యత్తు సమాజ స్వభావాన్ని సూచించడం. అంటే దేశం ముందుకు వెళ్లడానికి ప్రస్తుత అంశాలను ఎలా మార్చాలో రాజ్యాంగం సూచిస్తూ ప్రధానంగా భవిష్యత్ చట్రాన్ని పేర్కొంటుంది.
3. భారత రాజ్యాంగ నిర్మాణంలోని నాలుగు ముఖ్య ఘటనలు తెలుపండి.జ:
- 1946 లో రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి.
- 1947 ఆగస్టులో ముసాయిదా కమిటీ ఏర్పాటు. దీని అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
- 1948 నవంబర్‌లో ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశ పెట్టారు.
- 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది.
4. పార్లమెంటరీ వ్యవస్థ అనగా నేమి?జ: పార్లమెంటరీ వ్యవస్థ:
- దేశాధిపతి అయిన రాష్ట్రపతి నామ మాత్రపు అధికారాలు ఉంటాయి.
- దేశాధ్యక్షుడు అయిన రాష్ట్రపతి దేశానికి అధిపతి కాని కార్య నిర్వాహక వర్గానికి కాదు.
- దేశ పరిపాలన అధ్యక్షుని పేరు మీదుగా జరిగినప్పటికి అతడు నిజమైన పాలకుడు కాదు.
- ప్రధానమంత్రి, మంత్రులు పార్లమెంట్‌లో తప్పకుండా సభ్యులై ఉండాలి.
5. అమెరికా రాజ్యాంగానికి, భారత రాజ్యాంగానికి ముఖ్యమైన పోలిక ఏమిటి?జ:
- భారత రాజ్యాంగంలో సూచించిన ద్వంద్వ రాజ్యతంత్ర విధానం అమెరికాలోని ద్వంద్వ రాజ్య తంత్ర విధానాన్ని పోలి ఉంటుంది.
- అమెరికాలో కేంద్ర ప్రభుత్వాన్ని ఫెడరల్ ప్రభుత్వం అని, రాష్ట్రాల్లో ఉన్న వాటిని రాష్ట్ర ప్రభుత్వం అని అంటారు. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా పిలుస్తారు.
- అమెరికా రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ ప్రభుత్వం కేవలం రాష్ట్రాల కూటమి కాదు, అలాగే, రాష్ట్రాల పాలనా అంగాలు ఫెడరల్ ప్రభుత్వ శాఖలు కాదు.
- అలాగే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కూటమి కాదు, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ శాఖలు కావు. దేనికదే స్వతంత్రమైనవి.
6. భారత రాజ్యాంగంలోని ఏకీకృత రాజ్యా లక్షణాలు ఏవి?జ: భారత రాజ్యాంగంలోని ఏకీకృత రాజ్య లక్షణాలు:
- భారత దేశం అంతటికి ఒకే రాజ్యాంగం ఉంది.
- ఒకే పౌరసత్వం అమలులో ఉండడం.
- ఒకే న్యాయ వ్యవస్థ ఉంది.
- ముఖ్యమైన పదవులలో నియమించడానికి దేశ మంతటికీ వర్తించే అఖిల భారత సివిల్ సర్వీస్ (ఉదా॥ IAS,IPS)
7. భారత రాజ్యాంగంలో సామాజిక మార్పుకు దోహదం చేసే అంశాలు ఏమి ఉన్నాయి?జ: సామాజిక మార్పుకు దోహదం చేసే రాజ్యాంగంలోని అంశాలు:
- అంటరానితనాన్ని నిషేధించడం (17వ అధికరణ)
- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డు తెగలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కల్పించడం.
- అల్ప సంఖ్యాల వారికి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. వారి సంస్కృతిని కాపాడుకోవడానికి, విద్యకోసం ప్రత్యేక విద్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
- మహిళలు, పిల్లల రక్షణ కొరకు అనేక ఏర్పాట్లు ఉన్నాయి.
8. కేశవానంద భారతి కేసు దేనికి సంబంధించింది? ఈ కేసులో సుప్రీం కోర్టు ఏమి వ్యాఖ్యానించింది?
జ:
- కేశవానంద భారతి కేసు ప్రాథమిక హక్కులకు సంబంధించింది.
- ఈ కేసులో తీర్పును ఇస్తూ సుప్రీం కోర్టు క్రింది విధంగా వ్యాఖ్యానించింది.
- భారత రాజ్యాంగంలోని కొన్ని మౌలిక అంశాలను ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి వీలు లేదు.
- దేశ మనుగడ ఈ మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.
1 మార్కు ప్రశ్నలు
1. నేపాల్ రాజ్యాంగ నిర్మాణాల 2007లోనే ప్రారంభమైనప్పటికి 2014 వరకు కూడా అది ఎందుకు పూర్తికాలేదు?
జ: నేపాల్‌లోని కొన్ని మౌలిక అంశాలపై అక్కడి రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం.
2. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అనగానేమి?
జ: సార్వత్రిక వయోజన ఓటు హక్కు:
1. స్త్రీ, పురుష , ధనిక, పేద, కుల, మత విచక్షణ లేకుండా నిర్ణీత వయస్సు పూర్తి చేసుకున్న దేశ పౌరులందరికి ఓటు హక్కు కల్పించే విధానమే సార్వత్రిక వయోజన ఓటు హక్కు.
2. మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఈ హక్కు లభిస్తుంది.
3. రాజ్యాంగ సభ అందరికీ ప్రాతినిధ్యం వహించలేదు. కొన్ని అన్ని రకాల అభిప్రాయాలను తీసుకుంది. ఏ విధంగా?
జ:1. రాజ్యాంగ సభ ప్రజలలోని అందరికీ ప్రాతినిధ్యం వహించనప్పటికీ ప్రజలలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది.
2. ముసాయిదా రాజ్యాంగాన్ని ప్రజలు చదువుకోవడానికి బహిరంగంగా ఉంచారు. వారి అభిప్రాయాలను ఉత్తరాలు, వార్తా పత్రికల ద్వారా సేకరించారు.
4. భారత రాజ్యాంగ రచన చేసిన కమిటి ఏది? దాని అధ్యక్షుడు ఎవరు?
జ:1. భారత రాజ్యాంగ రచన చేసిన కమిటి ముసాయిదా కమిటి.
2. దీని అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్.
5. ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి మనం గ్రహించిన అంశాలకు రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జ:1. పార్లమెంటరీ వ్యవస్థ - ఇంగ్లండ్
2. సమాఖ్య వ్యవస్థలోని ద్వంద్వ రాజ్యతంత్రం - అమెరికా
3. ఆదేశ సూత్రాలు - ఐర్లాండ్
4. ప్రాథమిక హక్కులు - అమెరికా
6. ముసాయిదా రాజ్యాంగంపై వచ్చిన రెండు విమర్శలు తెలపండి.
జ:1. ‘ఇది 1935 చట్టానికి నకలు మాత్రమే’ - మౌలానా హస్రత్ మొహానీ
2. ‘భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామ పరిపాలనను విస్మరించారు’
దామోదర్ స్వరూప్‌సేథ్ (డిఎస్ సేథ్)
7. భారత రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు ఏవి?
జ: 1. సమానత్వపు హక్కు
2. స్వాతంత్య్రపు హక్కు
3. మత స్వాతంత్య్రపు హక్కు
4. పీడనాన్ని నిరోధించే హక్కు
5. విద్యా, సాంస్కృతిక హక్కు
6. రాజ్యాంగ పరిహారపు హక్కు
నోట్: ఏవైనా రెండు రాస్తే సరిపోతుంది.
8. సామాజిక మార్పు అంటే ఏమిటి?
జ:సామాజిక మార్పు:-
సామాజికంగా చాలా కాలంగా వెనుక బాటు తనానికి గురైన బడుగు, బలహీన వర్గాల వారికోసం ప్రత్యేక ఏర్పాటు చేసి వారి జీవితాలలో మార్పు తీసుకురావడం.
9. ఆదేశ సూత్రాలలోని రెండు సూత్రాలను తెలపండి.
జ:ఆదేశ సూత్రాలు:-
1. గోహత్య, మద్యపానం నిషేధించాలి.
2. 14 సంవత్సరంలోపు పిల్లల చేత కఠినమైన పనులు చేయించరాదు.
10. భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంది? ఇప్పటి వరకు సుమారు ఎన్ని సవరణలు జరిగాయి?
జ:1. భారత రాజ్యాంగాన్ని సవరించడానికి భారత పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది.
2. ఇప్పటివరకు సుమారు 100 పైగా సవరణ జరిగాయి.
బహుళైచ్చిక ప్రశ్నలు (1/2 మార్కు)
1. నేపాల్ మధ్యంతర రాజ్యాంగం ఏ సంవత్సరంలో రూపొందించారు? ( )
ఎ)1959 | బి)1991 | సి)2007 | డి)2014 |
2. జపాను రాజ్యాంగం ఏ సంవత్సరంలో తయారు చే శారు? ( )
ఎ)1945 | బి)1946 | సి)1948 | డి)1950 |
3) నేపాల్‌లో మొదటి ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? ( )
ఎ)1950 | బి)1952 | సి)1991 | డి)1959 |
4. ‘క్యాబినెట్ మిషన్’ ను భారతదేశానికి పంపిన బ్రిటిష్ ప్రధానమంత్రి..( )
ఎ) విన్‌స్టన్ చర్చిల్ | బి) క్లెమెంట్ అట్లి | సి) మార్గరెట్ థాచర్ | డి) స్టాఫర్డ్ క్రిప్స్ |
5. పాకిస్తాన్ రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పడింది? ( )
ఎ)1946 డిసెంబర్ | బి)1947 ఫిబ్రవరి | సి)1947 ఆగస్టు | డి)1948 మార్చి |
6. భారత రాజ్యాంగ సభ్యుల ఎన్నిక ఏ విధంగా జరిగింది? ( )ఎ) రాష్ట్రాల శాసన సభ సభ్యులచే పరోక్షంగా...
బి) సార్వత్రిక వయోజన ఓటు హక్కు పద్ధతి ద్వారా ప్రత్యక్షంగా..
సి) బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది
డి) రాష్ట్రంలోని అధికార పార్టీ వారు నియమించారు.
7. రాజ్యాంగ సభలో జవహర్ లాల్ నెహ్రూ ముఖ్యమైన ప్రకటన
(ఆశయాల తీర్మాణం ప్రవేశపెట్టడం) చేసిన రోజు ( )
ఎ)1946 డిసెంబర్ 13 | బి)1946 డిసెంబర్ 8 | సి)1947 ఆగస్టు 29 | డి) 1948 నవంబర్ 4 |
8. రాజ్యాంగ సభ (రాజ్యాంగ పరిషత్) అధ్యక్షులు ఎవరు? ( )
ఎ)డా॥అంబేద్కర్ | బి)డా॥బాబు రాజేంద్రప్రసాద్ |
సి) సర్దార్ వల్లభాయి పటేల్ | డి) జవహర్‌లాల్ నెహ్రూ |
9. రాజ్యాంగ ముసాయిదా కమిటి అధ్యక్షులు ఎవరు? ( )
ఎ)డా॥అంబేద్కర్ | బి)డా॥బాబు రాజేంద్రప్రసాద్ |
సి) కె.ఎమ్ మున్షి | డి) డి.ఎస్. సేథ్ |
10. భారత రాజ్యాంగం రాజ్యాంగ సభ ఆమోదం పొందిన రోజు..( )
ఎ)1948 నవంబర్ 4 | బి)1948 డిసెంబర్ 26 | సి)1949 నవంబర్ 26 | డి)1950 జనవరి 26 |
11. భారత రాజ్యాంగం ముసాయిదాను బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ సభలో ఏ రోజున ప్రవేశ పెట్టారు?
ఎ)1947 డిసెంబర్ 4 | బి)1948 ఫిబ్రవరి 28 | సి)1948 ఆగస్టు 29 | డి)1948 నవంబర్ 4 |
12. భారత రాజ్యాంగంలోని ఎక్కువ అంశాలు ఈ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది. ( )
ఎ)1919 భారత ప్రభుత్వ చట్టం | బి)1909 భారత ప్రభుత్వ చట్టం |
సి)1935 భారత ప్రభుత్వ చట్టం | డి)1947 భారత స్వాతంత్య్ర చట్టం |
13. భారత రాజ్యాంగం ఏ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. ( )
ఎ) 1950 జనవరి 26 | బి)1949 నవంబర్ 26 |
సి)1949 డిసెంబర్ 26 | సి)1950 నవంబర్ 26 |
14. రాజ్యాంగ ముసాయిదా ప్రకారం భారత సమాఖ్య అధిపతిగా ఎవరు ఉంటారు? ( )
ఎ )అధ్యక్షుడు | బి) ప్రధానమంత్రి | సి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి | డి) లోక్‌సభ స్పీకర్ |
15. ముసాయిదా రాజ్యాంగం ప్రకారం భారత అధ్యక్షుడు ఈ క్రింది వారిలో ఎవరిని పోలి ఉంటాడు. ( )
ఎ) అమెరికా అధ్యక్షుడు | బి) కెనడా అధ్యక్షుడు | సి) రష్యా అధ్యక్షుడు | డి) బ్రిటిష్ రాజు |
16. భారత దేశంలో ఇది అమలులో లేదు.....( )
ఎ) ద్వంద్వ రాజ్యతంత్రము | బి) ద్వంద్వ పౌర సత్వము |
సి) ద్వంద్వ సభా విధానము | డి) ద్వంద్వ వివాహ చట్టం |
17. ‘కుల వ్యవస్థని నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో ఆలోచించడం లేదు’ అని రాజ్యాంగ సభ చర్చలో విమర్శించింది ఎవరు? ( )
ఎ) ప్రొమథ రంజన్ కుమార్ | బి) ఎస్.సి.బెనర్జి |
సి) రోహిణి కుమార్ చౌదరి | డి) కె.ఎం. మున్షి |
18. రాజ్యాంగ ప్రవేశికలో ‘లౌకిక’, సామ్యవాద’ పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు? ( )
ఎ)1970 | బి)1972 | సి)1976 | డి)1978 |
జవాబులు:
1)సి |
2)బి |
3)డి |
4)బి |
5) సి |
6)ఎ |
7)ఎ |
8)బి |
9)ఎ |
10)సి |
11)డి |
12)సి |
13)ఎ |
14)ఎ |
15)డి |
16)బి |
17)ఎ |
18)సి |