Skip to main content

After 10th Class Best Career Tips: ‘పది’ తర్వాత పదిలమైన కెరీర్‌కు సోపానాలు.. అందుకోండిలా..

పదో తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే విద్యార్థి భవిష్యత్తును నిర్దేశిస్తుంది. ఉన్నత విద్య దిశగా ముందుకెళ్లేందుకు, ఉద్యోగాలపై దృష్టి సారించేందుకు ఇదే సరైన తరుణం.
10th Class Students
10th Class Students Best Tips

ఇంటర్‌లో చేరి, తర్వాత ఇంజనీరింగ్, మెడికల్, కామర్స్ కోర్సుల దిశగా అడుగులు వేయాలని భావిస్తున్నా; జీవితంలో త్వరగా స్థిరపడేందుకు ఐటీఐ లేదా పారామెడికల్ కోర్సుల్లో చేరాలన్నా సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయమిదే. ఇప్పుడు తీసుకునే నిర్ణయమే మన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది. కాబట్టి పదోతరగతి తర్వాత ఏయే కోర్సుల్లో చేరితే ఎలాంటి అవకాశాలు లభిస్తాయి? అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలేమిటి? వంటి వాటిపై విశ్లేషణ...

ఇంటర్మీడియెట్ : 
పదో తరగతి పూర్తయిన విద్యార్థుల తక్షణ లక్ష్యంగా నిలుస్తున్న కోర్సు ఇంటర్మీడియట్. ఇంటర్‌లో ఉన్న గ్రూపులు, ఆ తర్వాత అందుబాటులో ఉండే కోర్సుల గురించి తెలుసుకుందాం.

ఎంపీసీ :
కెరీర్ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ గ్రూప్‌లో చేరాలనుకునేవారికి కంప్యుటేషనల్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్ ఉండాలి. వివిధ వస్తువుల పనితీరు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి.

ఉన్నత విద్య అవకాశాలు:
ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్ పూర్తయ్యాక ఇంజనీరింగ్ చేయవచ్చు. ఇందుకోసం ఎంసెట్, జేఈఈ తదితర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు రాయాలి. ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం వంటి పరీక్షల ద్వారా డిఫెన్స్ రంగంలో కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసి ఆ తర్వాత పలు రీసెర్చ్ కోర్సులు చేయవచ్చు.

బైపీసీ
ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో చేరాలనుకునే వారికి ప్రధాన వేదికగా నిలుస్తున్న కోర్సు బైపీసీ. లైఫ్ సెన్సైస్‌పై సహజ ఆసక్తి, పర్యావరణ స్పృహ ఉన్నవారు ఈ గ్రూప్‌ను ఎంపిక చేసుకోవాలి. ఓర్పు, సహనం అనేవి బైపీసీ విద్యార్థులకు ఉండాల్సిన ఇతర ముఖ్య లక్షణాలు.

బైపీసీతో ఉన్నత విద్య అవకాశాలు:
ఎంసెట్ ద్వారా లేదా జాతీయ స్థాయిలో నిర్వహించే ఎయిమ్స్ ఎంట్రన్స్, ఏఎఫ్‌ఎంసీ ఎంట్రన్స్, జిప్‌మర్, ఏఐపీఎంటీ వంటి ఇతర మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌ల్లో మంచి ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు అభ్యసించొచ్చు.

వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్ వంటి విభాగాల్లోనూ ఉన్నత విద్య అభ్యసించవచ్చు. లైఫ్ సెన్సైస్, బయోలాజికల్ సెన్సైస్‌లో కెరీర్ కోరుకునేవారు బీఎస్సీలో చేరవచ్చు.

సీఈసీ
కామర్స్ కెరీర్స్‌కు వ్యాపార, వాణిజ్య రంగాల్లో కెరీర్ కోరుకునే వారికి సరితూగే గ్రూప్ సీఈసీ. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్ట్‌ల కలయికగా ఉండే ఈ గ్రూప్‌లో చేరేవారికి కాలిక్యులేషన్ స్కిల్స్, గణాంకాల విశ్లేషణ నైపుణ్యాలు, సూక్ష్మ స్థాయి పరిశీలన నైపుణ్యాలు ఉండాలి.

ఉన్నత విద్య అవకాశాలు:
సీఈసీ తర్వాత బీకాంలో చేరవచ్చు. బీకాం చదువుతూనే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించవచ్చు. తద్వారా కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ తదితర ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. లేదా డిగ్రీ పూర్తయ్యాక ఐసెట్ రాసి ఎంబీఏ చేయవచ్చు. ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ పూర్తి చేస్తే అకౌంటింగ్ రంగంలో రాణించవచ్చు. ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ కోసం క్యాట్, మ్యాట్, జీమ్యాట్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఎంఈసీ
మెరుగవుతున్న అవకాశాలు ఇటీవల కాలంలో ఇంటర్మీడియెట్‌లో ఆదరణ పొందుతున్న గ్రూప్ ఎంఈసీ. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్ట్‌ల కలయికగా ఉండే ఈ గ్రూప్‌ను ఎంపిక చేసుకుని ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధిస్తే మ్యాథమెటిక్స్ అర్హతగా ప్రవేశం లభించే బీఎస్సీ కోర్సుల్లోనైనా.. కామర్స్ అర్హతగా ప్రవేశం లభించే బీకాం కోర్సుల్లోనైనా చేరే వీలుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సుల్లో రాణించేందుకు వీరికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కంప్యుటేషనల్, కాలిక్యులేషనల్ స్కిల్స్ ఉన్నవారు, ఏకాగ్రత, ఒక పనిపై సుదీర్ఘ సమయం వెచ్చించే ఓర్పు, సహనం ఉన్న విద్యార్థులకు ఎంఈసీ గ్రూప్ సరైంది.

ఉన్నత విద్య అవకాశాలు:
సంప్రదాయ బీకాం, బీఎస్సీ కోర్సులు అభ్యసించొచ్చు. వీటితోపాటు సీఏ, ఐసీడబ్ల్యుఏఐ, సీఎస్ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. డిగ్రీ తర్వాత ఎంబీఏ, ఎంకామ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

హెచ్‌ఈసీ
హయ్యర్ టార్గెట్స్‌కు ఫస్ట్ స్టెప్ సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ తదితర ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకున్న వారికి అనుకూలించే గ్రూప్ హెచ్‌ఈసీ. ఈ గ్రూప్‌లో ఉండే హిస్టరీ, ఎకానమీ, కామర్స్ సబ్జెక్టుల్లో పట్టు సాధిస్తే ఉద్యోగ పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించవచ్చు. హెచ్‌ఈసీ అకడమిక్ సిలబస్, పోటీ పరీక్షల సిలబస్ దాదాపు ఒకటి కావడమే ఇందుకు కారణం. హెచ్‌ఈసీ అర్హతగా ప్రవేశం లభించే బీఏ కోర్సులోనూ ఇటీవల కాలంలో పలు జాబ్ ఓరియెంటెడ్ గ్రూప్ కాంబినేషన్స్ (ఉదా: సోషల్ సెన్సైస్, ఆర్కియాలజీ, ఆంత్రోపాలజీ..) అందుబాటులోకి వస్తున్నాయి. ఈ గ్రూప్ సబ్జెక్ట్స్‌తో బీఏ పూర్తి చేసిన వారికి ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగావకాశాలు విస్తృతమవుతున్నాయి.

ఒకేషనల్ కోర్సులు
ఇంటర్మీడియెట్‌లో భాగమైన ఒకేషనల్ కోర్సులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్‌షిప్ నుంచి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వరకు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఇంటర్ నుంచే నైపుణ్యాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్మీడియెట్ బోర్డ్‌లు.. అగ్రికల్చర్; బిజినెస్ అండ్ కామర్స్; ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ; హోం సైన్స్; హ్యుమానిటీస్; పారా మెడికల్ విభాగాలుగా మొత్తం 27 ఒకేషనల్ కోర్సులను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగంలోని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్; రూరల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ కోర్సులు పూర్తి చేస్తే.. ఎలాంటి ప్రవేశ పరీక్షలు అవసరం లేకుండానే సంబంధిత బ్రాంచ్‌లో నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో చేరొచ్చు.

రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు
ఇంటర్మీడియెట్‌లో చేరాలనుకునే వారికి రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు బెస్ట్ ఎవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఈ కళాశాల్లో పూర్తి స్థాయి రెసిడెన్షియల్ విధానంలో బోధన ఉంటుంది. విద్యార్థులను ఎంసెట్, సీఏ సీపీటీ తదితర ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం చేసేలా ప్రత్యేక శిక్షణ సైతం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో పది రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలున్నాయి. ఏపీఆర్‌జేసీ సెట్ ద్వారా వీటిలో ప్రవేశం కల్పిస్తారు. 
వివరాలకు వెబ్‌సైట్: aprs.cgg.gov.in
వెబ్‌సైట్: tsrjdc.cgg.gov.in

పాలిటెక్నిక్
మూడేళ్ల డిప్లొమా కోర్సులుగా పేర్కొనే ఈ కోర్సులను పూర్తి చేస్తే సంబంధిత పరిశ్రమల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. పాలిటెక్నిక్ డిప్లొమా అర్హతతో ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈ-సెట్) నిర్వహిస్తారు. ఇందులో ర్యాంకు ఆధారంగా నేరుగా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశం పొందవచ్చు.
వెబ్‌సైట్: www.apecet.org
వెబ్‌సైట్: www.tsecet.in

ఐటీఐలు
పదో తరగతి అర్హతగా వృత్తి విద్య శిక్షణనందించి విద్యార్థులను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్. ఐటీఐల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ తదితర బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రవేశాలకు సాధారణంగా ఏప్రిల్‌లో నోటిఫికేషన్ వెలువడుతుంది.
వెబ్‌సైట్: www.iti.nic.in

పదో తరగతితో.. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు
ఇండియన్ రైల్వేస్ నుంచి ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ వరకు.. ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ వరకు పలు కేంద్ర ప్రభుత్వ కొలువులు, రాష్ట్ర స్థాయిలోనూ పలు ఉద్యోగావకాశాలు పదో తరగతి ఉత్తీర్ణులకు అందుబాటులో ఉన్నాయి. అవి..

ఇండియన్ రైల్వేస్
ఆర్‌ఆర్‌బీ గ్రూప్-డి ఉద్యోగాలకు పదో తరగతి/ఐటీఐ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.rrbsecunderabad.nic.in

పోస్టల్ శాఖ
పోస్టల్ శాఖలో పోస్ట్‌మెన్, మెయిల్ గార్డ్ ఉద్యోగాలు. ఆయా రాష్ట్రాలను సర్కిళ్లుగా విభజించి సర్కిళ్ల వారీగా ఖాళీలను భర్తీ చేస్తారు. కాబట్టి పోటీ రాష్ట్ర స్థాయిలోనే ఉంటుంది.

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్స్
రైల్వే రక్షణ దళంలో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం జాతీయ స్థాయిలో నోటిఫికేషన్ వెలువడుతుంది.
వివరాలకు వెబ్‌సైట్: www.rpfonlinereg.in

ఆర్మీలో..
సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్‌మన్, నర్సింగ్ అసిస్టెంట్
వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్స్
వివరాలకు వెబ్‌సైట్: www.bsf.nic.in
ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
వెబ్‌సైట్: www.itbpolice.nic.in
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్
వెబ్‌సైట్: www.cisf.gov.in
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
వెబ్‌సైట్: www.crpf.nic.in
మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (గ్రూప్ - సి, ఎల్‌డీసీ, స్టెనో గ్రేడ్-3 పోస్ట్‌లు)
వెబ్‌సైట్: www.mes.gov.in
పైన పేర్కొన్న విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏటా కచ్చితంగా వెలువడుతాయి. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు అవసరం. ఫిజికల్ టెస్ట్, రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాష్ట్ర ప్రభుత్వంలోనూ..
రోడ్డు రవాణా సంస్థలో బస్ డ్రైవర్లు:
పదో తరగతి అర్హతతోపాటు హెవీ వెహికిల్ డ్రైవింగ్ లెసైన్స్, నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
కండక్టర్లు: పదో తరగతి అర్హత
సీసీఎల్‌ఏ పరిధిలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులు.
అటవీ శాఖలో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు. జిల్లా ఒక యూనిట్‌గా అటవీ శాఖ ఈ నియామకాలు చేపడుతుంది.
రాష్ట్ర స్థాయిలో జువెనైల్ వెల్ఫేర్ అండ్ కరెక్షనల్ సబ్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో సూపర్‌వైజర్, మ్యాట్రన్ పోస్టులు. రాష్ట్ర స్థాయిలో సర్వీస్ కమిషన్ గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా వీటి నియామకం చేపడుతుంది.

Published date : 27 Jan 2022 03:30PM

Photo Stories