Tenth Class Public Exams 2024: ఒత్తిడి జయిస్తేనే విజయం ... సమయ పాలన కీలకం
విశాఖ : పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తొలిసారిగా పబ్లిక్ పరీక్షలు రాస్తున్నామనేసరికి.. విద్యార్థుల్లో ఎక్కడా లేని ఆందోళన కనిపిస్తుంది. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే పోటీతత్వంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. 10వ తరగతి పరీక్షలు కీలకం కావడంతో తల్లిదండ్రుల్లోనూ ఇదే ధోరణి ఉంది. పరీక్షల వేళ ఇది ఎంతమాత్రం మంచిది కాదని విద్యావేత్తలు, మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక అమలు చేసినందున.. విద్యార్థులు భయం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఉపాధ్యాయులు భరోసా కల్పిస్తున్నారు.
ఒత్తిడి జయిస్తేనే విజయం
● ఏడాదంతా చదివిన సబ్జెక్టులే అయినందున, ఒత్తిడి జయించి సమయస్పూర్తితో పరీక్షలు రాస్తే.. విజయం విద్యార్థుల ముంగిటే ఉంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
● ప్రశ్నాపత్రం ఇచ్చిన తర్వాత ఏమాత్రం టెన్షన్ పడకూడదు. కొద్దిసేపు ప్రశాంతంగా దానిని చదివి, బాగా వచ్చిన వాటినే ముందుగా రాయడం ప్రారంభించాలి.
● పరీక్ష రోజుల్లో టీవీ, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటేనే మంచింది. తల్లిదండ్రులు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలి.
సమయ పాలన కీలకం
● ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభ సమయానికి ఒక గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి.
● ప్రతీ సబ్జెక్టులో వంద మార్కులకు జవాబులు రాయాల్సి ఉన్నందున.. ఏ ప్రశ్నకు ఎంత సమయం కేటాయించాలని ముందుగానే గుర్తుంచుకోవాలి. అన్ని ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు రాసేందుకు ప్రయత్నించాలి.
● గణితం నాకు రాదనే ధోరణి వీడాలి. చిన్నపాటి సూత్రాలను జ్ఞాపకం తెచ్చుకుంటే.. ఈజీగానే జవాబులు రాయవచ్చు. ఫిజిక్స్, బయాలజీలకు వేర్వేరుగా పరీక్ష నిర్వహిస్తున్నందున వీటిని సునాయసంగానే ఎదుర్కొవచ్చు.