Ravi Aruna: సైన్స్ ఎక్కడో లేదు... యాసిడ్ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి
‘‘నేను పుట్టింది గుంటూరు జిల్లా అనంతవరప్పాడులో. పెరిగింది మాత్రం మచిలీపట్నంలో. మా నాన్న రావిరంగారావు బీఎస్సీ కాలేజ్ ప్రిన్సిపల్, అమ్మ ప్రభావతి. అమ్మ కూడా టీచరే. ఆ నేపథ్యమే నన్ను బోధనరంగం వైపు మళ్లించి ఉంటుంది. నిజానికి చిన్నప్పుడు నా మదిలో ‘భూమి ఎలా పుట్టింది, గ్రహాలు వలయాకారంలో ఎందుకుంటాయి’ వంటి అనేక ప్రశ్నలు మెదిలేవి. అలాగే సైంటిస్ట్ కావాలనే ఆలోచన కూడా. కానీ ఎందుకో తెలియదు బీఈడీలో చేరిపోయాను. బీఈడీ పూర్తయిన వెంటనే 1996లో ఉద్యోగం వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ విజయవాడలోని ఎనికేపాడులో. అక్కడి తోటి ఉపాధ్యాయుల ప్రభావంతో బోధనను బాగా ఎంజాయ్ చేశాను. చదువు చెబుతూనే చదువుకుంటున్నాను. ఎమ్మెస్సీ, ఎమ్‌ఈడీ, విద్యాబోధనలో ఇన్నోవేటివ్ టీచింగ్ టెక్నాలజీస్ మీద పీహెచ్‌డీ పూర్తయింది. ఇప్పుడు ఫిజిక్స్ లో మరో పీహెచ్‌డీ చేస్తున్నాను.
చదవండి: Famous Personalities: గురువుని మించిన శిష్యులు వీళ్లే..?
ప్రత్యామ్నాయం వెతకాలి!
సైన్స్ అంటే పుస్తకాల్లో ఉండేది కాదు, మన చుట్టూ ఉంటుందని చెప్పడంలో విజయవంతమయ్యాను. పరిశోధన ల్యాబ్‌లో మాత్రమే కాదు, ఇంట్లో కూడా చేయవచ్చని నేర్పించాను. పరిశోధనకు ఒక వస్తువు లేకపోతే ప్రత్యామ్నాయంగా అదే లక్షణాలున్న మరో వస్తువును ఎంచుకోవడం గురించి ఆలోచింపచేశాను. యాసిడ్ లేదని పరిశోధన ఆపకూడదు, నిమ్మరసంతో ప్రయత్నించాలి. అలాగే ఇంట్లో వాడిపారేసే వస్తువులను, ఆఖరుకు కోడిగుడ్డు పెంకులను కూడా స్కూల్‌కి తెప్పించి వాటితోనే పరిశోధన చేయించేదాన్ని. ఒక్కమాటలో చెప్పాలంటే సైన్స్‌ని జీవితానికి అన్వయించుకోవడం ఎలాగో నేర్పిస్తాను. కొంతమంది పిల్లలు పుస్తకంలో ఉన్నదానిని క్షుణ్ణంగా మెదడుకు పట్టించుకుంటారు. కానీ తమ ఎదురుగా ఉన్న విషయం మీద అపై్ల చేయడంలో విఫలమవుతుంటారు. నా స్టూడెంట్స్ అలా ఫెయిల్ కారు. దోమలను పారదోలగలిగేది రెడీమేడ్ మస్కిటో రిపెల్లెంట్ మాత్రమే కాదు బంతిచెట్టు కిటికీలో పెట్టినా ఫలితాన్ని పొందవచ్చని నా విద్యార్థులకు తెలుసు. ఫీల్డ్ ఎడ్యుకేషన్‌కి వాటర్ వర్క్స్‌తోపాటు ప్రతి డిపార్ట్‌మెంట్‌కీ తీసుకుని వెళ్తాం. మా స్కూల్ విద్యార్థులు చేసిన ప్రయోగాలు స్టేట్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రదర్శితమయ్యాయి. నేషనల్ ఇన్‌స్పైర్ మనక్‌లో రెండు ప్రాజెక్టులు ప్రదర్శించాం. ఇస్రో సైన్స్ క్విజ్‌లో రెండేళ్లు పాల్గొనడంతోపాటు మా విద్యార్థులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. తక్కువ వనరులున్న పాఠశాల నుంచి పిల్లలను జాతీయ స్థాయి వేదికల వరకు తీసుకెళ్లగలుగుతున్నందుకు గర్వకారణంగా ఉంది. రేడియో ప్రసంగాల్లో ఎక్కువగా మహిళాసాధికారత గురించి మాట్లాడేదాన్ని. అలాగే ఈ పురస్కారాన్ని దేశానికి ఫస్ట్ సిటిజన్ హోదాలో ఉన్న ఒక మహిళ చేతుల మీదుగా అందుకోవడం సంతోషంగా ఉంది.
– రావి అరుణ, ఫిజిక్స్ టీచర్, జిల్లా పరిషత్ పాఠశాల, కానూరు, కృష్ణాజిల్లా