Tenth Class Public Exams 2024: పదవతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు
నరసరావుపేట ఈస్ట్: పదవతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పల్నాడు జిల్లా విద్యాశాఖ యంత్రాంగం సన్నద్ధమైంది. పరీక్షల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థుల నామినల్ రోల్స్, పరీక్ష కేంద్రాల గుర్తింపు, ఆయా కేంద్రాలలో మౌలిక వసతులు, నోడల్ పాయింట్ వంటి ప్రాథమిక అంశాలలో ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తిచేశారు. పది పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనే లక్ష్యంతో ఏడాది పొడవునా చదివి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఎటువంటి ఒత్తిడులకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా ఫర్నీచర్, గాలి, వెలుతురు ప్రసరించేలా అన్ని వసతులు ఉన్న పరీక్ష కేంద్రాలను అధికారులు గుర్తించారు. విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు ఉండే కేంద్రాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
జిల్లాలో 127 పరీక్ష కేంద్రాలు...
మార్చినెల 18వ తేదీనుంచి 30 వరకు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పదిపబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. పల్నాడుజిల్లాలో అన్ని యాజమాన్యాలలోని 433 పాఠశాలల నుంచి 29,244 మంది విద్యార్థులు ఈఏడాది పది పబ్లిక్ పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో 25,206 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా, 4,038 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. బాలురు 15,152 మంది, బాలికలు 14,092 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లాలోని 127 పరీక్ష కేంద్రాలకు 127మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను నియమిస్తున్నారు. డివిజన్ల వారీగా పరిశీలిస్తే జిల్లా పరిధిలోని నరసరావుపేట డివిజన్ నుంచి 19,054మంది, సత్తెనపల్లి డివిజన్ నుంచి 10,190మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న పాఠశాలల్లో సగానికి పైగా ప్రభుత్వ పాఠశాలలే ఉన్నాయి. ప్రభుత్వం మనబడి నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించింది. తరగతి గదుల్లో ఆధునిక ఫర్నీచర్, విద్యుద్ధీకరణ, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాగునీరు వంటి వసతులు పూర్తిస్థాయిలో కల్పించటంతో ప్రభుత్వ పాఠశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయటంలో అధికారులు అధిక ప్రాధాన్యతనిచ్చారు.
Also Read : AP Telugu Study Material
సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాలు..
జిల్లాలో సమస్యాత్మకంగా గుర్తించిన ఆరు పదవ తరగతి పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి మాల్‌ప్రాక్టీస్‌కు తావివ్వకుండా ఆయా కేంద్రాలలోని అన్ని పరీక్షా గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
స్టడీ అవర్స్ నిర్వహణ...
పది పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం అదనపు తరగతులను నిర్వహిస్తూ ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులకు టైం టేబుల్ వేసుకొని తమ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
పది పబ్లిక్ పరీక్షలలో అధికశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించేలా పరీక్షలకు సన్నద్ధమయ్యేలా హెచ్‌ఎంలకు సూచనలు ఇచ్చాం. గతంలో కంటే అధికశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. పది పరీక్షలను అందరి సహకారంతో పకడ్బందీగా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం.వెంకటేశ్వర్లు, డీఈఓ, పల్నాడు జిల్లా