KGBV: ఇంటర్వ్యూలు కట్.. మెరిట్‌కే మార్కులు
అభ్యంతరాలకు 4 రోజుల పాటు అవకాశం
కేజీబీవీల్లో మొత్తం 958 పోస్టుల భర్తీకి సమగ్ర శిక్ష నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ 8తో ముగియగా డిసెంబర్ 9న పరిశీలన నిర్వహించారు. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం లాంటి అంశాల ప్రాతిపదికగా ప్రొవిజినల్ మెరిట్ జాబితాను డిసెంబర్ 10న ఆయా జిల్లాల్లో ప్రకటించనున్నారు. ప్రతి అభ్యర్థి వివరాలను అందులో పొందుపర్చనున్నారు. వీటిపై ఎవరికైనా సందేహాలున్నా, అభ్యంతరాలున్నా అప్పీళ్లకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. 11వ తేదీ నుంచి 14వ తేదీవరకు నాలుగు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.
మొత్తం 100 మార్కులు
అర్హతలు, అనుభవం తదితర అంశాలకు 100 మార్కులను కేటాయించారు. అభ్యర్థులకు వచ్చే గరిష్ట మార్కులను బట్టి మెరిట్‌ను నిర్ణయించనున్నారు. గరిష్ట మార్కులు సాధించిన వారు అగ్రభాగాన నిలువనున్నారు. కేజీబీవీల్లో రెండేళ్లు ఆపై పనిచేసిన వారికి నియామకాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్లు ప్రకటించినా వారికి మార్కులు కేటాయించలేదు. అర్హతలు, అనుభవం తదితర అంశాల్లో ఇతర అభ్యర్థులతో సమాన స్థాయిలో నిలిచిన వారికి కేజీబీవీల్లో పనిచేసిన అనుభవం ఉంటే మెరిట్ లిస్టులో ప్రాధాన్యం ఇస్తారు.
సమాన మార్కులు వస్తే?
అర్హతలు, అనుభవం అంశాలలో సమానంగా ఉన్న వారి విషయంలో ఎక్కువ వయసు వారికి ప్రాధాన్యమిస్తారు. అందులోనూ సమానంగా ఉంటే వరుస క్రమంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ–ఏ, బీ, సీ, డీ, తదుపరి ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు. విద్యార్హతల పరంగా వరుసగా పీజీ, గ్రాడ్యుయేషన్, ఇంటర్, టెన్త్ మార్కులను అనుసరించి మెరిట్ నిర్ణయిస్తారు. విద్యార్హతల్లో సమానంగా ఉంటే ప్రొఫెషనల్ అర్హతల్లో మెరిట్‌ను ఆధారంగా చేసుకొని ఎంపిక చేస్తారు.
గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు
గత సర్కారు కేజీబీవీల్లో ఎంపిక ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతో దరఖాస్తులు తీసుకొని ఇంటర్వ్యూలు నిర్వహించి జాబితాను జిల్లా అధికారులతో కూడిన కమిటీకి అప్పగించాయి. ఈ వ్యవహారంలో ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడ్డాయి. నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చెల్లించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాయి. ఒక్కో పోస్టును రూ.లక్షల్లో విక్రయించాయి. డబ్బులిచ్చిన వారికి ఇంటర్వూ్యలలో ఎక్కువ మార్కులు కేటాయించి మెరిట్ జాబితాలో చోటు కల్పించారు. ఈ అక్రమాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏజెన్సీల విధానాన్ని రద్దు చేశారు. అవుట్‌సోర్సింగ్ నియామకాలకు ప్రత్యేకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. తాజాగా కేజీబీవీల్లో కాంట్రాక్టు విధానంలో టీచర్ల నియామకాలు పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఇప్పుడు పూర్తి పారదర్శకంగా టీచర్ల నియామకాలను చేపట్టినట్లు కేజీబీవీ కార్యదర్శి ఆర్.నరసింహారావు తెలిపారు.
చదవండి:
KGBV: పోస్టుల భర్తీకి పక్కా రూల్స్