National Maths Day: ‘గణితంలో రాణిస్తే జీవితంలో ఉన్నత స్థానం’
డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించు కుని సిక్కోలు గణిత ఉపాధ్యాయ వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సెమినార్ హాల్‌లో డిసెంబర్ 17న జిల్లాస్థాయి వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన గణిత పోటీ పరీక్షల్లో విజేతలగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా పగడాలమ్మ మాట్లాడుతూ గణితంలో ఎవరు రాణిస్తారో వారు జీవితంలో ఉన్నత స్థాయిలో నిలుస్తారని అన్నారు. భారతీయులు ఎ క్కువగా గణితంపై పట్టు సాధించడం వలనే ప్రపంచంలో ఉన్నతస్థాయిలో రాణించగలుగుతున్నారని శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు అభిప్రాయపడ్డారు. సిక్కోలు గణిత ఉపాధ్యాయ సంఘం చేస్తున్న కృషిని వక్తలు కొనియాడారు.
చదవండి: NCERT: మేథ్స్‌లో మనోళ్లు తగ్గుతున్నారు
ఆకట్టుకున్న గణిత అష్టావధానం..
అంతకుముందు గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్, సిక్కోలు మాథ్స్ లెజెండ్ ఓవీశాస్త్రి చిత్రపటాలకు అథిధులు, అధికారులు ఘనంగా నివాళులర్పించారు. అమలాపురానికి చెందిన గణితావధాని టీఎస్‌వీఎస్ సూర్యనారాయణమూర్తి గణిత అష్టావధానం అద్భుతంగా సాగింది.
కార్యక్రమంలో శ్రీకాకుళం డీవైఈవో ఆర్.విజయకుమారి, డీసీఈబీ సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, సిక్కోలు గణిత ఉపాధ్యాయ వేదిక గౌరవాధ్యక్షులు కెవీఎస్‌ప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి ఎన్.కుమారస్వామి, అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్స్ లియాఖత్ ఆలీఖాన్, ఏపీఎంఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.