Tenth Exams 2024 : పదో తరగతి పరీక్షల్లో పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి
నరసరావుపేటఈస్ట్: పదో తరగతి ఫలితాల్లో జిల్లా మొదటి స్థానం సాధించడమే లక్ష్యంగా పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో మరి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 251 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిధిలో 25,247 మంది విద్యార్థులు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నారు. వీరంతా వచ్చే మార్చి నెలలో పరీక్షలు రాయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికలు రచించి అమలు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో గతేడాది 24,147 మంది పరీక్షలకు హాజరుకాగా కేవలం 16,793 మంది(63.47 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో మంచి ఫలితాలు వస్తాయని అధికారులు, ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 25,247మంది విద్యార్థులు చదువుతుండగా, వీరిలో ఇప్పటికే 23,958 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. సప్లిమెంటరీ విద్యార్థులు 5,594మంది ఉండగా 4,084మంది పరీక్ష ఫీజు చెల్లించారు.
Also Read : Mathematics Study Material
ప్రత్యేక తరగతులు...
జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే దాదాపు 95శాతం సిలబస్ పూర్తవగా, మరో వారం, పది రోజులలో మొత్తం పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎఫ్‌ఏ–1, ఎఫ్‌ఏ–2 పరీక్షలు నిర్వహించి విద్యార్థులు ఏఏ సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, మెరుగైన ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దనున్నారు. సబ్జెక్టు టీచర్లు వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.
- మెరుగైన ఫలితాల సాధనకు ప్రత్యేక శ్రద్ధ
- ఉదయం, సాయంత్రం సబ్జెక్టు టీచర్లతో ప్రత్యేక తరగతులు
- జగనన్న విద్యా జ్యోతి పేరిట ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ
- జిల్లాలో ప్రభుత్వ విద్యార్థులు 25,247 మంది అంతర్గత పరీక్షల ఫలితాల ఆధారంగా ప్రతి విద్యార్థిపై దృష్టి
ఉదయం, సాయంత్రం రెండు పూటల స్టడీ ఆవర్‌లు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారిని మెరుగుపరుస్తున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం సబ్జెక్టుల వారీగా రివిజన్, స్లిప్ టెస్టులు నిర్వహించనున్నారు. కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలు, గురుకుల సంక్షేమ పాఠశాలల్లో ప్రత్యేకంగా రాత్రి తరగతులు నిర్వహించనున్నారు. వీరితోపాటు సప్లిమెంటరీ విద్యార్థులకు సైతం రెమిడియల్ తరగుతులు ఏర్పాటు చేసి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తున్నారు.