స్కూళ్లకు ఈ–కంటెంట్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు అనువుగా ఉండేందుకు ద్విభాషా (బైలింగ్యువల్) పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. ఆంగ్ల మాధ్యమ బోధనకు వీలుగా 1.80 లక్షల మంది టీచర్లకు శిక్షణ కూడా ఇచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వాటిలో బోధనకు వీలుగా ఈ–కంటెంట్‌ను ప్రత్యేకంగా రూపొందించి అందిస్తోంది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని సీమ్యాట్ ద్వారా ఈ కంటెంట్‌ను రూపొందింపచేసి అన్ని స్కూళ్లకు అందుబాటులోకి తెస్తోంది. తొలివిడతగా నాడు–నేడు కింద అభివృద్ధి చేసిన 15,715 స్కూళ్లలోని ఇంగ్లిష్ ల్యాబ్‌లకు ఈ–కంటెంట్‌ను సిద్ధం చేసింది. ఇంతకుముందు 1,729 వీడియో కంటెంట్‌లను అందించగా తాజాగా మరో 2,102 వీడియో కంటెంట్‌లను పాఠశాలలకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూళ్లలో ఇంగ్లిష్ ల్యాబ్‌ల్లో డిజిటల్ డివైస్‌లను ఏర్పాటు చేయించి వాటి ద్వారా విద్యార్థులకు ఈ ఈ–కంటెంట్‌ను సులభమార్గాల్లో బోధన చేయించనుంది.
చదవండి: మనబడి నాడు–నేడుతో సర్వాంగ సుందరంగా సర్కారీ స్కూళ్లు
డిజిటల్ తరగతులకు సన్నాహాలు
మరోవైపు.. నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్న స్కూళ్లలో ఆధునిక విజ్ఞాన బోధనకు వీలుగా డిజిటల్ తరగతుల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో అధికారులు అందుకు అనుగుణంగా సన్నాహాలు చేపట్టారు. మొత్తం 45,328 స్కూళ్లలో రూ. 511.28 కోట్లతో ఈ డిజిటల్ తరగతులను ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తోంది. మూడు దశల్లో ఈ కార్యక్రమం పూర్తి కా>నుంది. తొలిదశలో 15,694 పాఠశాలల్లో ముందుగా ఈ డిజిటల్ తరగతులు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశ కింద 2023–24 విద్యాసంవత్సరంలో 14,331 స్కూళ్లలో, మూడో దశలో 15,303 స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ బోధనకోసం ఈ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానళ్లు, ఏర్పాటు చేయించనున్నారు. డిజిటల్ తరగతులకు అనుగుణంగా ఆయా స్కూళ్లకు ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా ఇప్పటికే ఏర్పాటు చేయించారు. 2,658 స్కూళ్లలో బ్రాడ్ బ్యాండ్, లీజ్డ్ లైన్, టెలిఫోన్ లైన్ విత్ మోడెమ్, యూఎస్‌బీ మోడెమ్, పోర్టబుల్ హాట్‌స్పాట్, వీఎస్‌ఏటీ తదితరాల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు.
చదవండి: ప్రైవేటు స్కూళ్లలో ఉచిత ప్రవేశాల రెండో జాబితా విడుదల