Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి
పాడేరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేలా కలెక్టర్ విజయ సునీత చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో 65 పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. అన్నిచోట్ల బెంచీల సౌకర్యం కల్పించారు, ఫ్యాన్లు, సురక్షిత ప్యాన్లు, సురక్షిత తాగునీటిని అందుబాటులోకి తెచ్చారు. ప్రతి పరీక్ష కేంద్రం ఆవరణలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.
హాల్‌టికెట్ల పంపిణీ పూర్తి
జిల్లాలోని 65 పరీక్షా కేంద్రాల్లో 12,051మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరికి ఇప్పటికే హాల్ టికెట్లు అందజేశారు. వీరిలో 10,986 మంది రెగ్యులర్, 1065 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. బాలికలు 5,920 మంది, 5,066 మంది బాలురు ఉన్నారు.
● జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 65 పరీక్ష కేంద్రాల్లో 64 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖ నియమించింది. పది రూట్లుగా విభజించి నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, మరో 65 మంది డీవోలను ఏర్పాటుచేసింది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలను అమర్చారు.
హల్‌టికెట్ చూపిస్తే ప్రయాణం ఉచితం
జిల్లాలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ సంస్థ ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి కలెక్టర్, సబ్‌కలెక్టర్లు, పాడేరు ఆర్టీసీ డీఎంకు ఆదేశాలు ఇచ్చారు. మండల కేంద్రాల్లోని ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల విద్యార్థులకు రవాణా సౌకర్యం ఏర్పాటుచేశారు. హాల్ టికెట్‌ను చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారవర్గాలు తెలిపాయి.
నేటి నుంచి ప్రారంభం జిల్లావ్యాప్తంగా 65 కేంద్రాల ఏర్పాటు 12,051 మందికి హాల్ టికెట్ల పంపిణీ పూర్తిస్థాయిలో బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు
కంట్రోల్ రూం నంబర్లు: 9490204585, 9493426468
కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
టెన్త్ పబ్లిక్, ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చి సాయం పొందవచ్చు. – బ్రహ్మాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి, పాడేరు