Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం...విద్యార్థుల ఉత్తీర్ణతకు ప్రణాళిక
రాయచోటి: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి 30 వరకు నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై డీఈఓ కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, పోలీస్, విద్యుత్, వైద్య, రవాణా తదితర శాఖల అధికారుల సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద చిన్నపాటి సంఘటన తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.
హాల్ టికెట్ ఆధారంగా ఆర్టీసీ బస్సులలో విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. పరీక్షలు రాసిన తర్వాత వెళ్లేటప్పుడు కూడా ఉచిత ప్రయాణం ఉండేలా జిల్లా కలెక్టర్ ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు. జిల్లాలో 129 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు.శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు తర్పీదు ఇచ్చారన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులూ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేశామన్నారు.
Also Read: Telugu Study Material
జిల్లాలో మొత్తం 492 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 25522 మంది విద్యార్థులు పది పరీక్షలు రాసేందుకు సన్నద్ధమయ్యారని చెప్పారు. వారిలో 22466 మంది రెగ్యులర్, 3056 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. 11254 మంది బాలురు, 11212 మంది బలాఇకలు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. వారి కోసం 129 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఇందులో ఏ–కేటగిరీ కేంద్రాలు 58, బీ–కేటగిరీ 55, సి–కేటగిరీ 16 ఉన్నాయన్నారు.విద్యార్థులు ప్రశాంతంగా ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. జిల్లా పరీక్షల అబ్జర్వర్‌గా సర్వశిక్షా అభియాన్ అధికారి మస్తానయ్య నియమితులయ్యారన్నారు.
129 కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ల నియామకం పూర్తి చేశామని, అలాగే డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించామన్నారు. అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులు, ఆరుగురు ఫ్లయింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షణ ఉంటుందన్నారు. మరో 66 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లుగా వ్యవహరిస్తారని చెప్పారు. పరీక్షల నిర్వహణకు 1200 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. అవసరమైతే మేజర్‌మండల కేంద్రాల పరిధిలో 10 నుంచి 20 మంది ఇన్విజిలేటర్లను సిద్ధంగా పెట్టుకోవాలని మండల విద్యా శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. పరీక్ష పత్రాలను భద్రపరచడానికి 31 స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేశామన్నారు.
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటి తప్పనిసరిగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులు ఉదయం 8:50 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను అనుమతించమని శివప్రకాష్‌రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో డీఈఓ కార్యాలయం ఏడీ ప్రసాద్‌బాబు కూడా పాల్గొన్నారు.