Hari Krishna: గ్లోబల్ టీచర్ ప్రైజ్ రేసులో ఐలవరం ఉపాధ్యాయుడు
యునెస్కోతో కలిపి వార్కే ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా మారుమూల గ్రామాలు/ పట్టణాల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తూ మార్పుకోసం కృషిచేస్తోన్న ఛాంపియన్లయిన టీచర్లను గ్లోబల్ టీచర్ ప్రైజ్‌కు ఎంపిక చేస్తుంది. తొలుత 50 మందిని షార్ట్‌లిస్టు చేస్తుంది. తర్వాత వీరిలో 10 మందిని, చివరగా ఒకరిని ఎంపికచేసి ప్రైజ్ మనీగా రూ.7.35 కోట్లు అందజేస్తారు. ఈ రేసులో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వేలాది దరఖాస్తుల్లో ఎంపిక ప్రక్రియ అనంతరం టాప్ 50లో ఏపీలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు హరికృష్ణ ఒక్కరే ఉండటం విశేషం.
2005 నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న హరికృష్ణ స్వగ్రామం మంగళగిరి. 2017లో ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. స్వతహాగా ఇంగ్లిష్ టీచర్ అయినందున తన నైపుణ్యాన్ని పెంచుకునేందుకు ఇతర దేశాల ఉపాధ్యాయులతో సామాజిక మాధ్యమంలో ఒక గ్రూపును ప్రారంభించారు. అందులో విద్యార్థులను భాగస్వాములను చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆశించారు.
ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ ప్రోత్సాహంతో ఆచరణలోకి తెచ్చారు. 2018 నుంచి దాదాపు 70 పైగా దేశాల్లోని వందలాది పాఠశాలల టీచర్లు, విద్యార్థులతో సంభాషించేలా చేయగలిగారు. ఆ అలవాటు ఇంగ్లిష్‌పై భయాన్ని పోగొట్టి, సులువుగా మాట్లాడేలా చేసింది. కలం స్నేహితులతో రాతప్రత్యుత్తరాలు చేస్తున్నారు. ఆసక్తికర అంశాలను పరస్పర మార్పిడి చేసుకుంటున్నారు.
విదేశాల్లోని కొందరు ఇక్కడి పేద విద్యార్థుల్ని దత్తత తీసుకున్నారు కూడా. తన కృషికి గుర్తింపుగా హరికృష్ణ, 2020లో అమెరికాలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ అఫైర్స్ పర్యవేక్షించే, ‘ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్స్‌లెన్స్ అండ్ ఎచీవ్‌మెంట్’ ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. అమెరికాలోని ఆర్కాన్సా వర్సిటీలో 45 రోజుల ఫెలోషిప్‌ను పూర్తిచేశారు. ఈ ఫెలోషిప్‌కు భారత్ నుంచి ఆరుగురు ఎంపిక కాగా, ఏపీ నుంచి హరికృష్ణ ఒక్కరికే అవకాశం లభించింది.