UPSC Topper List 2024: యూపీఎస్సీ సివిల్స్‌ ఫలితాల్లో టాప్‌–3 వీరే.. టాప్‌–25 ర్యాంకర్లలో ఎంత మంది మహిళలు ఉన్నారో తెలుసా!!

ప్రతిష్టాత్మక సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్–2023 తుది ఫలితాలను యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) ఏప్రిల్ 16వ తేదీ ప్రకటించింది.

అఖిలభారత స్థాయిలో తొలి ర్యాంకును ఆదిత్య శ్రీవాస్తవ, రెండో ర్యాంకును అనిమేశ్‌ ప్రధాన్ సొంతం చేసుకున్నారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన దోనూరు అనన్యరెడ్డి ఆలిండియా మూడో ర్యాంకు దక్కించుకోవడం విశేషం. 

నాలుగు ర్యాంకు పి.కె.సిద్ధార్థ్‌ రామ్‌కుమార్‌కు, ఐదో ర్యాంకు రుహానీకి లభించింది. అఖిలభారత సర్వీసులకు మొత్తం 1,016 మంది ఎంపికయ్యారు. వీరిలో 664 మంది పరుషులు, 352 మంది మహిళలు ఉన్నారు. టాప్‌–5 ర్యాంకర్లలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు.. టాప్‌–25 ర్యాంకర్లలో 15 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన అభ్యర్థుల్లో 30 మంది దివ్యాంగులు ఉన్నట్లు యూపీఎస్సీ వెల్లడించింది.  

UPSC Civil Services 2023 Topper List Out: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ టాపర్స్‌ లిస్ట్‌ 

సివిల్స్‌–2023కి 10.16 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 5.92 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. 14,624 మంది మెయిన్స్కు అర్హత సాధించారు. వీరిలో 2,855 మంది పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు అర్హత సాధించారు. చివరకు 1,016 మందిని కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ ఎంపిక చేసింది. ఇందులో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 347 మంది, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులు 115 మంది, ఓబీసీలు 303 మంది, ఎస్సీలు 165 మంది, ఎస్టీలు 86 మంది ఉన్నారు. సివిల్స్‌–2023 ఫలితాల పూర్తి వివరాలను http:// www.upsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

మెరిసిన ఐఐటీ గ్రాడ్యుయేట్‌..
► సివిల్స్‌ తొలి ర్యాంకర్‌ ఆదిత్య శ్రీనివాస్తవ మెయిన్స్‌లో తన ఆప్షనల్‌గా ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ను ఎంచుకున్నారు. ఆయన ఐఐటీ–కాన్పూర్‌లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీటెక్‌) పూర్తిచేశారు.



► రెండో ర్యాంకర్‌ అనిమేశ్‌ ప్రధాన్ ఐఐటీ–రూర్కెలాలో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ అభ్యసించారు. సివిల్స్‌ మెయిన్స్‌లో ఆప్షనల్‌గా సోషియాలజీని ఎంచుకున్నారు.  

► తెలుగు యువతి, సివిల్స్‌ మూడో ర్యాంకర్‌ దోనూరు అనన్యరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌(ఆనర్స్‌) జాగ్రఫీ చదివారు. సివిల్స్‌ మెయిన్స్ లో ఆమె ఆప్షనల్‌ సబ్జెక్టు ఆంథ్రోపాలజీ.  

UPSC Civil Services Results 2023: సివిల్స్‌ ర్యాంకర్ల మనోగతమిది..

#Tags