Cleaning Contractor Daughter Gets 203 Rank In UPSC CSE Exam: క్లీనింగ్ కాంట్రాక్టర్ కూతురికి సివిల్స్‌లో 203వ ర్యాంకు, సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ 2023 పరీక్ష తుది ఫలితాల్లో క్లీనింగ్ కాంట్రాక్టర్ కూతురు తరుణ కమల్ సత్తా చాటింది. తొలి ప్రయత్నంలోనే ఆల్ ఇండియాలో స్థాయిలో 203వ ర్యాంకు సాధించింది. హిమాచల్‌ప్రదేశ్ మండి జిల్లాలోని బల్హ్ వ్యాలీకి చెందిన తరుణ కమల్ ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది.
సాధారణ మధ్య తరగతి కుటుంబం
ఆమె తండ్రి అనిల్ క్లీనింగ్ కాంట్రాక్టర్ కాగా తల్లి నార్మాదేవి గృహిణి. చిన్నప్పటి నుంచి చదువులో మెరుగ్గా ఉన్న తరుణ ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు కుటుంబసభ్యులు కూడా తోడుగా నిలిచారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని రట్టిలో మోడరన్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన ఆమె చండీగఢ్‌లో వెటర్నరీ కోర్సును అభ్యసించింది.
ఆ తర్వాత పూర్తిస్థాయిలో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యింది. అలా తొలి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ పరీక్షలో 203వ ర్యాంకును సాధించి సత్తా చాటింది. అంకితభావం, పట్టుదల, విశ్వాసం ఉంటే ఎంత గొప్ప కలల్ని అయినా నిజం చేసుకోవచ్చని నిరూపించింది.
ఎంతో మందికి ఆదర్శం..
ఫలితాల అనంతరం తరుణ కమల్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఒక సాధారణ క్లీనింగ్ కాంట్రాక్టర్ కూతురు తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మండి జిల్లాలో తరుణ ఎంతో మంది ఆదర్శంగా నిలిచిందని పలువురు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.