TSPSC Group 1 & 2: తెలంగాణ ఎకానమీ నుంచి 50 మార్కులు... రిఫరెన్స్ బుక్స్, వెయిటేజీ వివరాలు
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్–1,2,3,4, ఎస్‌ఐ–కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో.. ఆయా అన్ని పరీక్షల్లో ముఖ్యంగా గ్రూప్1, గ్రూప్2లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యం ఉంది. టీఎస్‌పీఎస్సీ విడుదల చేసే గ్రూప్1, గ్రూప్2లో ఎకానమీపై 150 మార్కులతో ప్రత్యేకంగా ఒక పేపర్ ఉంటుంది. ఈ పేపర్‌లో ఒక సెక్షన్‌గా తెలంగాణ ఎకానమీ 50 మార్కులకు ఉంటుంది. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ఎకానమీకి ఎలా సిద్ధం కావాలో తెలుసుకుందాం...
తెలంగాణ ఎకానమీ సిలబస్: 50 మార్కులు
1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ(1956–2014)
2. భూసంస్కరణలు–తెలంగాణ
3. తెలంగాణలో వ్యవసాయం–అనుబంధ రంగాలు
4. తెలంగాణలో పరిశ్రమలు మరియు సేవారంగం
- తెలంగాణ ఎకానమీలో 50 మార్కులకు గాను సుమారుగా 45 మార్కులకుపైగా సులభంగా పొందవచ్చు.ఎలా పొందాలో తెలుసుకుందాం..
- గ్రూప్–1 ప్రాథమిక పరీక్ష, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు రాసేవారికి ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. గత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే.. 99 శాతం సిలబస్ పరిధిలోనే ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థి దానికి అనుగుణంగా సిలబస్‌పై అవగాహన పెంచుకోవాలి.
యూనిట్–1
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ(1956–2014). ఈ మొదటి యూనిట్‌ను చదివేటప్పుడు అభ్యర్థి తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను మిళితం చేసి చదవాలి. ఇలా చదవడం ద్వారా సమయం ఆదా అవుతుంది. ఈ యూనిట్ ప్రధానంగా నీళ్లు–నిధులు–నియామకాలు అనే అంశంపై ఆధారపడి ఉంది.
చదవండి: APPSC, TSPSC గ్రూప్స్ లో Mental Ability నుంచి 16-20 ప్రశ్నలు... టాప్ స్కోర్ సాధించడమెలా?
జల వనరుల తరలింపు
- బచావత్ కమిటీ, బ్రిజేష్ కుమార్ కమిటీ
- తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ప్రవహించే ప్రధాన అంతరాష్ట్ర నదుౖలñ న గోదావరి, కృష్ణా నదుల ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి క్షుణ్నంగా చదవాలి.
- ఈ నదుల ద్వారా నీళ్ల పంపకంపై ఏర్పాటు చేసిన బచావత్ కమిటీ, బ్రిజేష్ కుమార్ కమిటీ సిఫార్సులు ప్రధానమైనవిగా చదవాలి.
ఉదాహరణ
- కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్–మధ్య కృష్ణా జలాల పంపిణీకి కేంద్రం 1969 ఏప్రిల్ 10న ఒక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసింది.
- కృష్ణా నది ట్రిబ్యునల్ అధ్యక్షుడు: ఆర్.ఎస్. బచావత్; సభ్యులు: డి.ఎం.బండారీ, షంషేర్ బహదూర్.
- ఆర్.ఎస్.బచావత్ కమిటీ సూచనల మేరకు కృష్ణా నదీ జలాలు–రాష్ట్రాలకు కేటాయింపులు:
రాష్ట్రం | నీటి కేటాయింపులు | మిగులు జలాలు | మొత్తం (టీఎంసీలలో) |
1. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ | 800 | 11 | 811 |
2. మహారాష్ట్ర | 560 | 25 | 585 |
3. కర్ణాటక | 700 | 34 | 734 |
- ఈ నదీ పరీవాహక ప్రాంతాన్ని బట్టి కృష్ణా జలాలు తెలంగాణకు ఎక్కువగా కేటాయించాలి. కానీ వివక్ష కారణంగా ఆంధ్రాకు తరలించారు.
ప్రాంతం | పరీవాహక ప్రాంతం | నీటి కేటాయింపులు | శాతం (టీఎంసీలు) |
తెలంగాణ | 68.5% | 277.86 | 34.26% |
రాయలసీమ | 18.39% | 144.70 | 17.84% |
కోస్తాంధ్ర | 13.11% | 388.44 | 47.90% |
బచావత్ కమిటీ తెలంగాణకు నీటి కేటాయింపులు (టీఎంసీ)
ప్రాజెక్ట్ | టీఎంసీ |
నాగార్జున సాగర్ | 106.20 |
శ్రీశైలం రిజర్వాయర్ | 11 |
జూరాల ప్రాజెక్ట్ | 17.84 |
రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ | 15.90 |
- బచావత్ ట్రì బ్యునల్ సిఫార్సుల మేరకు న్యాయమైన జల వనరుల పంపిణీ జరగలేదు. కృష్ణా నది పరివాహక ప్రాంతం 68.5శాతం ఉన్న తెలంగాణ ప్రాంతానికి 277.86 టీఎంసీల వాటా అంటే సుమారుగా 35శాతం మాత్రమే కేటాయించి తీవ్ర వివక్ష చూపించారు.
నదీ జలాలపై గ్రూప్2– 2016 ప్రశ్నలు గమనిస్తే
- తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల మధ్య కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి 1969లో భారత ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ చైర్మన్ ఎవరు?(బి)
ఎ. కె.ఎల్.రావు బి. ఆర్.ఎస్.బచావత్
సి. బి.ఎన్.కృష్ణ డి. కుమార్ లలిత్ - తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నీటి పరిమాణం ఎంత? (సి)
ఎ. 20.5 టీఎంసీ బి. 11.5 టీఎంసీ
సి. 17.5 టీఎంసీ డి. 19.5 టీఎంసీ - నదీ జలాల వివాద ట్రిబ్యునల్(రెండో) చైర్మన్ ఎవరు?(బి)
ఎ. ఆర్.ఎస్.బచావత్ బి. బ్రిజేష్ కుమార్
సి. జగదీశ్ భగవతి డి. ఎస్.పి.శ్రీవాత్సవ - అభ్యర్థి నదీ జలాల తరలింపు అనే అంశం చదివేటప్పుడు తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీని మిళితం చేసుకొని చదవడం ద్వారా సమయం ఆదా చేయడంతో పాటుగా, స్మార్ట్ స్టడీస్‌ని అధ్యయనం చేయవచ్చు. ఈ విధంగా అభ్యర్థి మొత్తం మార్కులు పొందవచ్చు.
చదవండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్
నిధులు–నియామకాలు
- నిధుల తరలింపు ఒకే అంశం చదివేటప్పుడు ముఖ్యంగా నాలుగు కమిటీల సిఫార్సులను చదవాలి. అవి.. కుమార్ లలిత్ కమిటీ, వశిష్ట భార్గవ కమిటీ, పెద్ద మనుషుల ఒప్పందంలోని, తెలంగాణ రీజనల్ కమిటీ అంశాలు.
ఉద్యోగాల కల్పన –తరలింపునకు సంబంధించి చదవాల్సిన ముఖ్యాంశాలు
- జీఓ నెం.36, 6 సూత్రాల పథకం, వాంఛూ కమిటీ, ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1975 (జీఓనెం.674), జీఓనెం.675,జయ భారత్‌రెడ్డి కమిటీ/ఆఫీసర్స్ కమిటీ, జీఓ.610,గిర్–గ్లానీ కమిషన్, శ్రీకృష్ణ కమిటీ.
- అభ్యర్థి నిధుల తరలింపు, నియామకాలు అనే అంశం చదివేటప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రను,తెలంగాణ ఎకానమీలోని మొదటి యూనిట్‌ను మిళితం చేసి చదవాలి.
- ఉదాహరణ: 2016 గ్రూప్–2లో ప్రశ్నలు:
- అక్టోబర్ 1975లో ఏ జీఓ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టికల్ 371–డిని విడుదల చేసింది?(డి)
ఎ. జీఓ నెం.671 బి. జీఓ నెం.672
సి. జీఓ నెం. 673 డి. జీఓ నెం.674 - దేనిని పరిశీలించుటకు గిర్ గ్లానీ కమిటీని నియమించారు?(బి)
ఎ. రైతుల ఆత్మహత్యలు బి. 610 జీఓ ఉల్లంఘనలు
సి. తెలంగాణ మిగులు నిధులు డి. రాజకీయ పార్టీల పాత్ర - ఆరు సూత్రాల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? (డి)
ఎ. 1975 బి. 1972 సి. 1974 డి. 1973 - అల్పాభివృద్ధి తెలంగాణ: తెలంగాణలో మానవ అభివృద్ధి నివేదికను పరిశీలించాలి.
యూనిట్–2: భూ సంస్కరణలు–తెలంగాణ
- ఈ అంశమును చదివేటప్పుడు నాలుగు అంశాలుగా విభజించుకొని చదవాలి.
1. మధ్యవర్తుల తొలగింపు
2. కౌలు సంస్కరణలు
3. భూగరిష్ట పరిమితి
4. షెడ్యూల్డ్ ప్రాంత భూముల పరాధీనత.
మధ్యవర్తుల తొలగింపు
- ఎ) తెలంగాణ ప్రాంత మధ్యవర్తులు: జాగీర్దార్లు, సంస్థానాలు, ఇనాందార్లు, సర్పేఖాస్‌లు, రైత్వారీ లేదా ఖల్సా, ఇతర దళారులు.
- బి) తెలంగాణ ప్రాంత మధ్యవర్తుల తొలగింపు: జమీందారీ రద్దు చట్టం, జాగిర్దారీ రద్దు చట్టం–1949, తెలంగాణ ఇనాం రద్దు చట్టం, సవరణ–1955
కౌలు సంస్కరణలు
- కౌలు పరిమాణం,భద్రత,యజమాన్యపు హక్కులు
- హైదరాబాద్ కౌలుదార్ల గెంటివేత నిరోధక చట్టం
- మల్–ఘజారీ ల్యాండ్–రెవెన్యూ చట్టం
- తెలంగాణ కౌలు వ్యవసాయ భూముల చట్టం (గల్లామక్తా, బెతాయి, సర్ఫేఖాస్, షక్మీదార్, ఆసామీ షక్మీదార్)
భూగరిష్ట పరిమితి
- భూగరిష్ట పరిమితి చట్టాల ప్రాధాన్యత అంశాలు–చట్టాలు
- భూసంస్కరణలు–ప్రాధాన్యత–వైఫల్యానికి కారణాలు
- కొనేరు రంగారావు కమిటీ సిఫార్సులు(2004–06)
షెడ్యూల్డ్ ప్రాంత భూముల పరాధీనత
- హైదరాబాద్ గిరిజన ప్రాంతం రెగ్యులేషన్ చట్టం; భూమి బదలాయింపు చట్టం–1959; భూగరిష్ట పరిమితి చట్టం–1973; ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టం–1977; అటవీ హక్కుల చట్టం–1969; అటవీ హక్కుల చట్టం–2006
- అభ్యర్థి తెలంగాణ భూసంస్కరణలపై పూర్తి పట్టు సాధించాలి. ఈ చట్టాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని చదవాలి.
ఉదాహరణకు
- హైదరాబాద్ కౌలు వ్యవసాయ చట్టం చేసిన సంవత్సరం(సి)
ఎ. 1948 బి. 1950 సి. 1956 డి. 1975 - 1946లో హైదరాబాద్ రాష్టం చేసిన గిరిజన ప్రాంతాల క్రమబద్దీకరణ ఫస్లీ 1356 చట్టం ద్వారా.. అన్ని గిరిజన భూముల తగాదాలను ఎవరికి అప్పగించింది? (సి)
ఎ. గిరిజన కమిటీలు బి.గిరిజన కమ్యూనిటీలు
సి. గిరిజన పంచాయతీలు డి. గిరిజన కమీషన్ - గిరిజనుల నుంచి గిరిజనేతరులు రిజిస్టర్ కాని తెల్ల పేపర్‌పై లీజు పత్రాలను స్వీకరిస్తే ఏమంటారు? (ఎ)
ఎ. సాదాబైనామాలు బి. స్టాంప్ పేపరు
సి. అమ్మక పత్రం డి. సాదా బినామీ - ధరణి పోర్టల్‌ను సీఎం కె.చంద్రశేఖర్ రావు ఎప్పుడు ప్రారంభించారు? (బి)
ఎ. 2020 సెప్టెంబర్ 22 బి. 2020 అక్టోబర్ 29
సి. 2021 అక్టోబర్ 29 డి. 2020 సెప్టెంబర్ 29
తెలంగాణలో వ్యవసాయ–అనుబంధ రంగాలు
- 3వ, 4వ యూనిట్‌లను చదివేటప్పుడు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చే సిన తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం–2022ను ఆధారం చేసుకొని చదవాలి. ఈ యూనిట్‌లో తెలంగాణ స్థూల ఆర్థిక గణాంకాలు,తెలంగాణ వ్యవసాయ–అనుబంధ రంగాల గణాంకాలు, పంటలు–రకాలు, తెలంగాణలో భూ వినియోగం తీరు, తెలంగాణలో గల వ్యవసాయ వాతావరణ మండలాలు, తెలంగాణ భూకమతాలు, వ్యవసాయ ఆధారిత జనాభా,వ్యవసాయం–నీటిపారుదల, తెలంగాణలో ప్రాజెక్ట్‌లు, వ్యవసాయ పరపతి, పశు సంపద, మత్స్య సంపద, అటవీ సంపద.
- అభ్యర్థి వీటిని చదివేటప్పుడు రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ ఆర్థిక గణాంకాలను, ప్రస్తుత ఆర్థిక సర్వే(2021–22)ను ఆధారంగా చేసుకొని చదవాలి.
- ఉదాహరణకు: తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం–2022 ప్రకారం– తెలంగాణ రాష్ట్ర స్థూల రాష్ట్ర జోడింపు విలువ(జీఎస్‌వీఏ)లో వాటా శాతం.
రంగాలు | 2014–15 | 2021–22 |
1. వ్యవసాయ అనుబం«ధ రంగాల వాటా | 16.3 | 18.3 |
2. పారిశ్రామిక రంగం వాటా | 22.4 | 20.4 |
3. సేవారంగం వాటా | 61.3 | 61.3 |
- తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం–2022 ప్రకారం– వ్యవసాయ–అనుబంధ రంగాల వాటా 2014–15లో 16.3 శాతం నుంచి 2021–22లో 18.3 శాతమునకు పెంచుకుంది. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు భీమా పథకాలను ప్రవేశపెట్టడంగా భావించాలి.
చదవండి: TS Economy
తెలంగాణలో పరిశ్రమలు, సేవారంగం
- 2021–22 సామాజిక ఆర్థిక చిత్రం ప్రకారం పరిశ్రమల గణాంకాలు, TS-iPASS, T-IDEA, MSME, TS-PRIDE, T-Hub, We-Hub, PLFS 2019-20 ప్రకారం పారిశ్రామిక ఉపరంగాలో ఉపాధి, తెలంగాణ విద్యుత్ రంగం–ప్రస్తుత పరిస్థితిపై దృష్టిపెట్టాలి.
- తెలంగాణలో సేవారంగం: 2021–22 ఆర్థిక సర్వే ప్రకారం–తెలంగాణ సేవారంగ గణాంకాలు; రోడ్డు రవాణా, పర్యాటక రంగం, ఐటీ సేవలు.
ఉదాహరణకు
- 2021–22(ఎ.ఇ) రాష్ట్ర జీఎస్‌వీఏలో సేవారంగ వృద్ధి రేటు 18.32 శాతం అయితే.. ఇదే కాలంలో భారత జీవీఏలో సేవారంగ వృద్ధి రేటు 17.57 శాతంతో పోలిస్తే.. తెలంగాణ సేవారంగ వృద్ధిరేటు ఎక్కువ.
- 2015–16, 2021–22 మధ్య రాష్ట్ర జీఎస్‌వీఏలో.. సేవారంగ సమగ్ర వార్షిక వృద్ధి రేటు(సీఏజీఆర్) 12.13 శాతం కాగా.. ఇదే కాలానికి భారత జీవీఏలో సేవారంగ సమగ్ర వార్షిక వృద్ధిరేటు(సీఏజీఆర్) 9.53 శాతం మాత్రమే.
- ఈ ప్రధాన 4 యూనిట్లతో పాటుగా తెలంగాణ మానవ వనరులు, తెలంగాణ విధానాలను పరిశీలించాలి. తెలంగాణ ప్రభుత్వ పథకాలలో ముఖ్యంగా దళితబంధు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పెన్షన్‌లు, కళ్యాణ లక్ష్మీ, ధరణీ పోర్టల్‌పై అవగాహన పెంచుకోవాలి.
డేటాను ఏవిధంగా చదవాలి?
- ప్రధానంగా అభ్యర్థులు ఎకానమీలో మార్కులు స్కోరు చేయకపోవడానికి ప్రధాన కారణం.. డేటాను విశ్లేషణ పూర్వకంగా చదవకపోవడమేనని చెప్పొచ్చు.
- ప్రస్తుత తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం–2022 ఆధారంగా చేసుకొని.. తెలుగు అకాడమీలో ఉన్న భావనలకు ఈ డేటాను అన్వయించుకుంటూ చదవాలి.
- గత ప్రశ్నాపత్రాలు పరిశీలిస్తే.. పరీక్షలలో డేటాపై మొత్తం ప్రశ్నలలో 10 శాతం మించకుండా ప్రశ్నలు ఉంటాయి. ఈ డేటాను బట్టీపట్టకుండా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయడం, విభజన రూపంలో చదవడం వల్ల విద్యార్థిలో నైపుణ్య శక్తి బయటపడుతుంది. ఇలా ప్రశ్నకు జవాబును సులభంగా గుర్తించవచ్చు.
తెలంగాణ ఎకానమీ వెయిటేజీ
గ్రూప్–1 ప్రిలిమినరీ | 10–15 మార్కులు |
గ్రూప్–1 మెయిన్స్ | 50 మార్కులు |
గ్రూప్–2 | 50 మార్కులు |
గ్రూప్–3 | 50 మార్కులు |
ఎస్‌ఐ+కానిస్టేబుల్ | 10–15 మార్కులు |
ఇతర పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్ | 15–20 మార్కులు |
చదవండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్టడం ఎలా? ఎలాంటి బుక్స్ చదవాలి..?
ఏ పుస్తకాలు చదవాలి
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ–పోటీ పరీక్షల ప్రత్యేకం–తెలుగు అకాడమి
- తెలంగాణ రాష్ట్ర గణాంకాల అబ్‌స్ట్రాక్–2021
- తెలంగాణ సామాజిక ఆర్థిక చిత్రం–2022
స్మార్ట్ వర్క్ ముఖ్యం
పోటీ పరీక్షలకు సన్నద్దం అయ్యే అభ్యర్థులు, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విజయాన్ని సాధించడం అంత సులువు కాదు. హార్డ్‌వర్క్ అనే విధానాన్ని విడనాడి.. ఆధునిక విశ్లేషణ పద్ధతులను అన్వేషిస్తూ స్మార్ట్ వర్క్‌ను పెంపొందించుకోవాలి. ప్రధానంగా అభ్యర్థి గమనించవలసింది.. ఒక మార్కుతో ఉద్యోగాన్ని కోల్పోయే వారి సంఖ్య పెరుగుతోంది. కాబట్టి అభ్యర్థి సిలబస్‌కు అనుగుణంగా పట్టికలు, పటాల రూపంలో విజ్ఞానాన్ని పెంపొందించుకొంటూ.. సిలబస్‌లో ప్రతి యూనిట్‌లోని టాపిక్స్‌ను సూక్ష్మ స్థాయిలో పరిశీలించాలి. ఇలా చదవడం ద్వారా పరీక్షలో మెరుగైన మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
– రవికుమార్ వల్లభాయ్, సబ్జెక్ట్ నిపుణులు