TS Job Calendar 2024-25 Released: గ్రూప్‌ పరీక్షలతో పాటు వివిధ నోటిఫికేషన్లు, పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సాక్షి, హైదరాబాద్‌: వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీల భర్తీ ప్రక్రియకు సంబంధించిన జాబ్‌ కేలండర్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

ఆగ‌స్టు 2న‌ సాయంత్రం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్‌ కేలండర్‌ను శాసనసభకు సమర్పించారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన నోటిఫికేషన్లు, పోస్టుల కేటగిరీలు, నోటిఫికేషన్లు జారీ చేసే నెలలు, పరీక్షలు నిర్వహించే నెలలు (తాత్కాలిక ఖరారు), రిక్రూటింగ్‌ ఏజెన్సీలు, పోస్టులకు అర్హతలను కేలండర్‌లో సవివరంగా తెలియజేశారు.

ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసిన గ్రూప్‌ పరీక్షల వివరాలతో పాటు భవిష్యత్తులో విడుదల చేయబోయే గ్రూప్‌ పరీక్షల వివరాలు, వివిధ సంస్థల్లో ఇంజనీరింగ్‌ పోస్టులు, టీచర్లు, లెక్చరర్లు ఎస్‌ఐలు తదితర పోస్టుల భర్తీ, టెట్‌ నిర్వహణకు సంబంధించిన వివరాలను ప్రకటించారు.

అయితే విభాగాల పేర్లను పేర్కొన్నప్పటికీ ఖాళీల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. కాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సభలో దీనిపై క్లుప్తంగా ప్రకటన చేశారు.  

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం 

‘నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు జాబ్‌ కేలండర్‌ ప్రకటిస్తామని ముందే చెప్పాం. ఆ విధంగానే సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో జాబ్‌ కేలండర్‌ విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు రావడం, రద్దు కావడం లేదా వాయిదా పడటం, పరీక్షలు జరిగితే ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల తేదీలు ఓవర్‌లాప్‌ లాంటి వాటితో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వ పాలనలో గ్రూప్‌–1 పరీక్ష రెండుసార్లు రద్దయింది.
2023 మార్చి 17న పేపర్‌ లీక్‌ కావడంతో, 2024 ఫిబ్రవరి 19న అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకపోవడంతో హైకోర్టు తీర్పు మూలంగా రద్దు అయింది. అధికారంలోకి రాగానే రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి.. యూపీఎస్సీ చైర్మన్‌ను సంప్రదించారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో కూడిన కమిటీ యూపీఎస్సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానాలను  అధ్యయనం చేíసింది. అనంతరం కమిషన్‌ను ప్రక్షాళన చేశాం.
గ్రూప్‌–1 నోటిఫికేషన్‌లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేశాం. ఫలితాలు ప్రకటించాం. ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేశాం. మొత్తంగా 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశాం.
అదనంగా 13,505 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుంది. 11,022 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశాం. గ్రూప్‌–1, గ్రూప్‌ 2, గ్రూప్‌–3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్‌–2 పరీక్షలు డిసెంబర్‌కు వాయిదా వేశాం. ఈ నెల 1వ తేదీన జరిగిన కేబినెట్‌ సమావేశంలో జాబ్‌ కేలండర్‌ గురించి చర్చించి ఆమోదించాం..’ అని డిప్యూటీ సీఎం తెలిపారు.  

#Tags