Good News for Unemployed Youth: ప్రభుత్వ కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితి పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో ప్రభుత్వ కొలువుల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఫిబ్ర‌వ‌రి 12న‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందుకోసం తెలంగాణ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్విస్‌ రూల్స్‌–1996కి అనుబంధంగా ఓ తాత్కాలిక నిబంధన(అడ్‌హక్‌ రూల్‌)ను అమల్లోకి తీసుకొచ్చారు. రెండేళ్లపాటు వయోపరిమితి పొడిగింపు అమల్లో ఉండనుంది.

పోలీసు, ఎక్సైజ్, ఆబ్కారీ, అగ్నిమాపక, అటవీ, జైళ్ల శాఖ వంటి యూనిఫార్మ్‌ సర్విసు పోస్టులకు ఈ వయోపరిమితి పొడిగింపు వర్తించదు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్లు మాత్రమే.

చదవండి: TSPSC Group 1 & 2 Success Plan : ఇవి ఫాలో అయితే.. గ్రూప్‌-1 & 2 పోస్టు మీదే..

నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ 2022 మార్చి 19న ఉత్తర్వులు జారీచేసింది. వచ్చే నెల 18తో ఈ ఉత్తర్వుల అమలు గడువు ముగిసిపోనుంది.

నిరుద్యోగుల నుంచి మళ్లీ వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని ఈసారి మరో 2 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో గరిష్ట వయోపరిమితి పెంపునకు ప్రాధాన్యత సంతరించుకుంది.

#Tags