TSLPRB Constable Recruitment on Hold : తెలంగాణ కానిస్టేబుల్ నియామక ప్రక్రియ నిలిపివేత.. కారణం ఇదే..
రాత పరీక్షలో ప్రశ్నలు తప్పుగా రావడంతో 4 మార్కులు కలపాలని హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఆదేశించినా, నియామక ప్రక్రియ కొనసాగుతోందని పిటిషనర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో మెడికల్ టెస్టులు నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని TSLPRB జిల్లా ఎస్పీలకు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ రాతపరీక్షలో ఇచ్చి ప్రశ్నపత్రంలో 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడాన్ని కానిస్టేబుల్ నియామక బోర్డును హైకోర్టు తప్పుబట్టింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు..
సివిల్ కానిస్టేబుల్కు సంబంధించి 4,965 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే ఇందులో 3 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో సమాధానాలు రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలలో పేర్కొన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు.. ఇంగ్లీషులో ప్రశ్నలుండటంతో గందరగోళానికి గురై సమాధానం రాయలేక నష్టపోయారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.
నియామక ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే..
అయితే.. అవి సరిగానే ఉన్నట్లు పోలీసు నియామక మండలి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఇంగ్లీషు పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. 4 ప్రశ్నలను తొలగించి ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని.. దాని తర్వాత నియామక ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.