CM Revanth Reddy: మాజీ డీఎస్పీ నళినికి ఉద్యోగమివ్వండి 

డిసెంబ‌ర్ 15న‌ సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినికి పోలీసుశాఖలో అదే ఉద్యోగం ఇవ్వడానికి ఇబ్బంది ఏమిటని ఉన్నతాధికారులను సీఎం ప్రశ్నించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే చేర్చుకోవాలని సీఎస్, డీజీపీలకు సూచించారు. పోలీస్‌ శాఖలో ఉద్యోగానికి సంబంధించి అవరోధాలేమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

చదవండి: DSP Success Story : నాలుగు నెల‌లు.. నాలుగు ప్ర‌భుత్వ‌ ఉద్యోగాలు సాధించానిలా.. అయినా కూడా నా లక్ష్యం మాత్రం ఇదే..
గతంలో ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చాలా మంది తిరిగి ఉద్యోగాల్లో చేరిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఈ సమీక్ష సమావేశాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ఉద్యోగానికి న్యాయం చేయలేను: మాజీ డీఎస్పీ నళిని

ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ తనను గుర్తుంచుకుని.. తన కోసం గొంతు వినిపిస్తుండటాన్ని చూసి నళిని స్పందించారు. నా మనసులో మాట.. అంటూ సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు చేశారు. ప్రస్తుతం తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకున్నా దానికి న్యాయం చేయలేనని మాజీ డీఎస్పీ నళిని స్పష్టం చేశారు.


ప్రస్తుతం తాను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, యజ్ఞ బ్రహ్మగా, వేద ప్రచారకురాలిగా, ఆర్ష కవయిత్రిగా తపోమయ జీవనం గడుపుతున్నట్టు తెలిపారు. ఉద్యోగానికి రాజీనామా చేసి 12 ఏళ్లు గడిచిపోయ‌య‌ని, ఇన్నాళ్ల తరువాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకోవడం సంతోషం కలిగించిందన్నారు.


రుమటైడ్ ​ఆర్థరైటీస్​ వల్ల ఫిజికల్ ​ఫిట్‌నెస్​ కోల్పోయినట్టు తెలిపారు. రాజీనామా చేసి చాలా రోజులైన నేపథ్యంలో పోలీస్ ​ఆటిట్యూడ్‌ను కూడా కోల్పోయానన్నారు. ఇక, పోలీస్​ సర్వీస్ ​రూల్స్ ​కూడా నా నియామకాన్ని ఒప్పుకోవన్నారు.

 

#Tags