IIIT Basara Admissions 2024 :బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరంలో తగ్గిన పోటీ
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో 2024–25 విద్యా సంవత్సరంలో 1500 సీట్ల భర్తీ కోసం దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా జూన్ 1 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా విద్యార్థుల జాబితాను రూపొందించారు. మెరిట్ విద్యార్థుల జాబితాను బుధవారం క్యాంపస్‌లో విడుదల చేయనున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు బుధవారం వెల్లడిస్తామని ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. గతంలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య ఎప్పటికప్పుడు తెలిపేవారు. కానీ ఈ సారి ఆ సంఖ్య వివరాలను గోప్యంగా ఉంచుతూ దాదాపుగా 15 వేలు వచ్చాయని చెప్తున్నారు. దరఖాస్తుల సంఖ్య వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారనే విషయం తెలియడం లేదు.
విద్యావిధానం...
ఆరేళ్ల సమీకృత ఇంజనీరింగ్ ఆధారంగా బాసర ట్రిపుల్‌ఐటీలో బోధన కొనసాగుతుంది. మొదటి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ కోర్సును నేర్పిస్తారు. అనంతరం మెరిట్ ఆధారంగా మరో నాలుగేళ్ల ఇంజనీరింగ్ సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. పీయూసీ విద్య అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్ల బీటెక్‌లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు. మొదటి రెండేళ్ల పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగానే బీటెక్‌లో కోర్సులు కేటాయిస్తారు. ఎంపికై న విద్యార్థులకు బాసర ట్రిపుల్‌ఐటీ అధికారులు ప్రభుత్వం తరపున వసతులు కల్పిస్తారు. ల్యాప్‌టాప్, ఒకే రకమైన దుస్తులు, షూస్ అందిస్తారు. హాస్టల్, భోజన వసతి కల్పిస్తారు.
పర్యవేక్షణ కరువు...
అంతా బాగున్న బాసర ట్రిపుల్‌ఐటీలో అధికారుల పర్యవేక్షణ కరువైంది. అన్ని శాఖల్లో పూర్తిగా విఫలమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చదివే విద్యార్థులు సమస్యలు చెప్పుకోలేకపోతున్నారు. స్టూడెంట్ కమిటీని కూడా ఎన్నుకోకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రిపుల్‌ఐటీలో ఏంజరిగినా బయటకు చెప్పకూడదని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఏ విషయం బయటకు వచ్చినా అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అక్కడంతా బాగుంటే బయట సమాజానికి ఏం చెప్పకపోయినా నష్టమేం ఉండదు. కానీ హాస్టల్ వసతి మొదలుకుని భోజనాల వరకు విద్యార్థులు ఇబ్బందులు పడుతునే ఉన్నారు. హాస్టల్ గదుల్లో, చాలా చోట్ల పెచ్చులూడుతున్నాయి. రంగులు లేక భవనాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి.
Also Read: ఆర్టీసీలో బారీగా ఉద్యోగాలు.. కేటగిరీల వారీగా భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు ఇలా..
విద్యుత్ వైర్లు సరిచేయడంలేదు. చాలా చోట్ల హాస్టల్ గదులకు నీళ్లు రావడం లేదు. ఫ్యాన్‌లు తిరగడంలేదు. ఫర్నిచర్ సరైన రీతిలో లేదు. ఇక మెస్‌లలో భోజన వసతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు సరిహద్దు మహారాష్ట్రలో ఉన్న ఆల్కాహాల్ ఫ్యాక్టరీ దుర్గందం క్యాంపస్‌ను కమ్మేస్తుంది. విష వాయువులతో నిండిన గాలినే విద్యార్థులు పీలుస్తున్నారు. ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. గత ప్రభుత్వంలో విద్యార్థుల నిరవధిక నిరసనలతో అప్పటి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్ క్యాంపస్‌కు వచ్చి విద్యార్థులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి కృషి చేస్తామని హామి ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారినా ఇక్కడి సమస్యలు మాత్రం తీరలేదు. ట్రిపుల్‌ఐటీ సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనైనా ట్రిపుల్‌ఐటీ సమస్యలు లేకుండా చూడాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
గతంతో పోలిస్తే...
బాసర ట్రిపుల్‌ఐటీకి మూడేళ్లుగా వచ్చిన దరఖాస్తులను పోల్చిచూస్తే ఈ ఏడాది అధికారులు చెప్పిన సంఖ్య సగానికి తగ్గిందనే చెప్పవచ్చు. 2020–21లో 32 వేలు, 2021–22లో 20,178, 2022–23లో 31,432, 2023–24లో 32,635 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఈ విద్యాసంవత్సరంలో కేవలం 15వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. బాసర ట్రిపుల్‌ఐటీలో సీట్ల కోసం గతంలో వందలాది మంది విద్యార్థులు పోటీపడేవారు. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తులను బట్టిచూస్తే ఒక్కో సీటుకు పది మంది మాత్రమే పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
నేడు ఎంపిక...
గ్రామీణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థుల జీపీఏ, సా మాజిక వర్గం, ఇలా అన్నింటినీ లెక్కలోకి తీసుకుని సీట్లు కేటాయించనున్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను అధికారుల బృందం పూర్తిస్థాయిలో ప ర్యవేక్షించింది. ఇందులో మెరిట్ ఆధారంగా సీట్ల కే టాయింపు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను విడుదల చేస్తామని, ఆన్‌లైన్‌లో వివరాలు ఉంచుతామని అధి కారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా ట్రిపుల్‌ఐటీ విడుదలచేసే జాబితా కోసం ఎదురుచూస్తున్నారు. జాబితా విడుదలైతే ట్రిపుల్‌ఐటీలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.